మానవత్వం మరువొద్దు
ఐఆర్‌ఎస్ అధికారులకు సూచన
పన్ను చెల్లింపుదార్లతో మానవత్వంతో మెలగాలని అధికారులకు ఆర్థికశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. మర్యాద పూర్వకంగా సంప్రదింపులు జరపడం వల్ల పన్ను వసూళ్లు మెరుగవుతాయని మంత్రి అభిప్రాయం వ్యక్తంచేశారు. 'దేశ నిర్మాణంలో పన్ను చెల్లింపుదార్లదే ప్రధాన వాటా. అందుకే మానవతా ధోరణిలో సంప్రదిస్తే బాగుంటుంది' అని మంత్రి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారులకు వివరించినట్లు అధికార ప్రకటన వెలువడింది. ఐఆర్‌ఎస్ శిక్షణ పొందుతున్న 63వ బృంద సభ్యులనుద్దేశించి ప్రణబ్ ప్రసంగించారు. పన్ను చెల్లింపుదార్లను వ్యతిరేక భావంతో చూడటం మానివేసిన ఫలితంగానే గత దశాబ్ది కాలంలో పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయని, ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 10 రెట్లు అయ్యాయని విత్తమంత్రి వివరించారు. ఆదాయంలో ప్రత్యక్ష పన్నుల వాటా 55% కంటే ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. సానుకూల ధోరణితో కలుగుతున్న ఫలితాలను గుర్తించి, అమలు పరచాలని శిక్షణ పొందుతున్న అధికారులను ప్రణబ్ కోరారు. పన్ను చెల్లింపులు ఇంత ఘనంగా ఉండటం వల్లే, వ్యవసాయ రుణాలు రూ.71,000 కోట్లు మాఫీ చేయగలిగినట్లు మంత్రి గుర్తుచేశారు.