ఓటరూ.. ఇదిగో సమాచారం
హైదరాబాదీ సాఫ్ట్‌వేర్ కంపెనీ వినూత్న సేవ హైదరాబాద్, న్యూస్‌టుడే: ఓటేయడమేకాదు.. సరైన వ్యక్తికి వేయడమూ అంతే ముఖ్యం. దానికి వారి గురించిన సమగ్ర సమాచారం తెలిసి ఉండాలి. ఇదే లక్ష్యంతో ప్రజల్లో అవగాహన కల్పించడానికి హైదరాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ నడుం బిగించింది. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల వివరాల నుంచి ఓటర్ల సంఖ్య, గతంలో గెలిచిన వారు, పోలింగ్ బూత్‌లకు ఎలా వెళ్లాలి వంటి సమగ్ర సమాచారం మొత్తం థ్రెషోల్డ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అందిస్తోంది. గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు (www.ap2009.in, www.ghmc2009.in) ఇటువంటి సేవలు అందించింది. మహారాష్ట్ర, సూడాన్, లెబనాన్ ఎన్నికలకు కూడా ఓటర్లకు సమాచారం అందించినట్లు కంపెనీ సీఈఓ భరత్ కుమార్.బి చెబుతున్నారు. రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికల సమయంలో తమ సైట్‌ను 6.5 లక్షల మంది సందర్శించారని అంటున్నారు. ఇట్స్‌ఏపీ ఉత్పత్తుల ప్రదర్శనలో కంపెనీ ఈ సేవలను ప్రదర్శించింది. 2014 సార్వత్రిక ఎన్నికలకు కూడా సమగ్ర సమాచారం అందించేందుకు కంపెనీ కృషి చేస్తోంది.