Friday, March 19, 2010

మార్కెట్‌ ర్యాలీలో వాటిదే ప్రధానపాత్ర


మార్కెట్‌ ర్యాలీలో వాటిదే ప్రధానపాత్ర
పెద్దగా పెరగని ఇతర షేర్లు
బడ్జెట్‌ నేపథ్యంలో మార్కెట్లు నిస్తేజంగా ఉండి స్క్రిప్‌ల ధరలు కూడా తగ్గడంతో అజిత్‌ గతనెల చివరి వారంలో కొన్ని చిన్నశ్రేణి షేర్లను కొనుగోలు చేశాడు. బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు జరిగే వీలున్న రంగాలను ఎంచుకొని మరీ వాటిని కొన్నాడు. బడ్జెట్‌ తరువాత మార్కెట్లో మంచి ర్యాలీ ఉంటుందన్నది అప్పట్లో అతని అంచనా.
వూహించినట్లే ప్రణబ్‌ బడ్జెట్‌ మార్కెట్‌ను మెప్పించింది. దీంతో సూచీలు పరుగులు తీశాయి. అయితే అజిత్‌ కొన్న షేర్లు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పెద్దగా మార్పుల్లేకుండా అదే స్థాయిల వద్ద ఉన్నాయి. ఈ మర్మం ఏమిటో అజిత్‌కేమాత్రం అర్థం కావడంలేదు. వాస్తవానికి ప్రస్తుత మార్కెట్‌ ర్యాలీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నవి కేవలం అయిదే అయిదు స్క్రిప్‌లు అంటే ఆశ్చర్యం కలక్కమానదు.

వెలుగంతా వీటిదే: బడ్జెట్‌ తర్వాతి నుంచి నిన్నటి దాకా సెన్సెక్స్‌ 8 శాతానికి పైగా లాభపడి దాదాపు 1300 పాయింట్లు పెరిగింది. ఈ ర్యాలీలో 50 శాతం వాటా ముందే చెప్పుకున్నట్లు అయిదు షేర్లదే. సెన్సెక్స్‌లో 375 పాయింట్ల ర్యాలీ రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంకులదే కావడం గమనార్హం. ఇది సెన్సెక్స్‌ తాజా పరుగులో 30% పెరుగుదలకు సమానం. గత నెల 25 నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్క్రిప్‌ 13 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 11.48 శాతానికి పైగా పెరగడం విశేషం. ప్రస్తుత ర్యాలీలో ఆర్‌ఐఎల్‌ 227.41 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ 148 పాయింట్లు, హెచ్‌డీఎఫ్‌సీ 92 పాయింట్లు, ఇన్ఫోసిస్‌ 82 పాయింట్లు, ఎల్‌ అండ్‌ టీ 63.3 పాయింట్ల మేర పాలుపంచుకున్నాయి. ఈ అయిదు సంస్థలే మొత్తం ర్యాలీలో 50% మేర వాటాను అందించాయి. అయితే హెచ్‌యూఎల్‌, ఓఎన్‌జీసీలు స్క్రిప్‌లు వరుసగా 17, 19పాయింట్ల మేర సెన్సెక్స్‌ను కుంగదీశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2 నెలల గరిష్ఠాన్ని అధిగమించినప్పటికీ మిగతా షేర్లలో మాత్రం ఒక మోస్తరు ర్యాలీ కూడా కనిపించడం లేదు.

ప్రభావం చూపుతున్న పన్ను చెల్లింపులు: రిలయన్స్‌ (ఆర్‌ఐఎల్‌) రూ.770 కోట్ల ముందస్తు పన్ను చెల్లింపులు జరపడం మదుపరులను బాగా ఆకర్షించింది. ఈ అంశం ఆర్‌ఐఎల్‌ను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఉపకరిస్తోందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. మిగతా సంస్థల ముందస్తు పన్ను చెల్లింపులను, ఆర్థిక మూలాలను కూడా పరిగణనలోకి తీసుకొని మదుపర్లు పెట్టుబడులు పెడుతున్నట్లు వీరు చెబుతున్నారు.

ఎఫ్‌ఐఐల జోరుతోనే ర్యాలీ: ప్రస్తుతం మార్కెట్‌ ర్యాలీలోఎఫ్‌ఐఐలదే కీలక పాత్ర. అయితే ఈ వీరు ఎక్కువగా మెరుగైన మార్కెట్‌ విలువ ఉండి, మూలాలు బలంగా ఉన్న ఆర్‌ఐఎల్‌ వంటి స్క్రిప్‌లనే ఎంచుకొంటుండడం వల్లే సెన్సెక్స్‌ బాగా పరుగులు పెడుతున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. గత 11 ట్రేడింగ్‌ సెషన్ల నుంచి ఎఫ్‌ఐఐలు సుమారు రూ.13,000 కోట్ల నిధులను భారత స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. పోయిన ఏడాది సెప్టెంబరు తరువాత ఒకే నెలలో ఎఫ్‌ఐఐలు ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం ఇదే ప్రథమం. గురువారం కూడా మార్కెట్‌ టర్నోవర్‌ సుమారు రూ.5424.6 కోట్లుగా నిలిచింది. అంటే ఎఫ్‌ఐఐల ప్రవాహం భవిష్యత్‌లో కూడా ఇంకా కొనసాగుతుందనడానికి ఇది నిదర్శనం.