విధి నిర్వహణల్లోనూ సామ్యం
| అప్పటి ఒరిస్సా గవర్నర్ సయ్యద్ ఫజల్ అలీ, రాజ్యసభ సభ్యుడు హృదయ్‌నాథ్ కుంజ్రూ, ఈజిప్ట్‌లో భారత రాయబారిగా పని చేస్తున్న కవలం మాధవ పనిక్కర్‌లతో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (ఎస్సార్సీ) వేస్తున్నట్లు నాటి హోంశాఖ కార్యదర్శి ఎ.వి.పాయ్ 1953 డిసెంబర్ 29న హోంశాఖ తరఫున No.53/69/53-Public. పేర ఉత్తర్వులు జారీచేశారు. పది అంశాలను నిర్దేశించారు. పద్దెనిమిది నెలల్లో నివేదిక సమర్పించడం అందులో ఒకటి. చివర్లో మరో మూడు నెలలు పొడిగించారు. ప్రభుత్వ ఉత్తర్వులు అందగానే ఫజల్ అలీ కమిషన్ రాష్ట్రాల పునర్విభజనపై ప్రజాబాహుళ్యం, సామాజిక సంఘాలు, ఆసక్తి ఉన్న వ్యక్తుల నుంచి నివేదనలను ఆహ్వానిస్తూ 1954 ఫిబ్రవరి 23న బహిరంగ ప్రకటన విడుదల చేసింది. నిర్మాణాత్మక సూచనలు, సలహాలు, గణాంకాలు, కొత్త రాష్ట్రాలు ఏర్పడితే ఎలా ఉండాలో సూచిస్తూ ఒకటి రెండు మ్యాప్‌లు పంపాలని ఫజల్ అలీ కమిషన్ తన బహిరంగ ప్రకటనలో కోరింది. 1954 ఏప్రిల్ 24 వరకు గడువు విధించింది. అయితే కమిషన్ ఆ గడువుకే కట్టుబడలేదు. ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీకి సంక్షిప్త వినతి పత్రాల నుంచి పూర్తి స్థాయి పరిశోధన పత్రాలు వచ్చినట్లే అప్పట్లో కూడా ఆయా ప్రాంత ప్రజలు తమ మనోభావాలను వ్యక్తం చేస్తూ చిన్న చిన్న టెలిగ్రాంలతోపాటు, తమ ప్రాంత సమస్యలను కూలంకషంగా విశ్లేషిస్తూ భారీస్థాయి పరిశోధనా పత్రాలు పంపారు. ఈ విషయాన్ని ఫజల్ అలీ కమిషన్ నివేదిక ఉపోద్ఘాతంలో పొందుపరిచి ఉంది. అప్పట్లో ఆ కమిషన్ ముందుకు 1,52,250 వినతిపత్రాలు వచ్చాయి. ఇందులో ఎక్కువ భాగం తమను ఫలానా ప్రాంతం నుంచి ఫలానా ప్రాంతానికి మార్చాలని కోరుకుంటూ పంపిన టెలిగ్రామ్‌లు, ముద్రిత తీర్మానాలే. కమిషన్ విధివిధానాల్లో పేర్కొన్న అంశాల ప్రకారం పూర్తి స్థాయి సమాచారంతో నిండిన వినతి పత్రాలు 2 వేలకు మించి రాలేదని ఫజల్ అలీ కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఆ కమిటీ ఒకవైపు తనముందుకొచ్చిన విజ్ఞాపనపత్రాలను అధ్యయనం చేస్తూనే మరోవైపు సమాజంలోని అన్నివర్గాలతో సంప్రదింపులు జరిపేది. కమిటీ ముందుకొచ్చే వారు స్వేచ్ఛగా, నిర్మొహమాటంగా అభిప్రాయాలు వెల్లడించడానికి వీలుగా ఫజల్ అలీ కమిషన్ సంప్రదింపుల ప్రక్రియను ప్రైవేటుగా నిర్వహించింది. 1954 మార్చి 1న ఢిల్లీలో ప్రారంభమైన సంప్రదింపుల ప్రక్రియ 1955 జులై చివరి వరకు సాగింది. ఫజల్ అలీ బృందం 1954 ఏప్రిల్ 8న దేశ పర్యటనకు శ్రీకారం చుట్టింది. ఆ సేతు హిమాచలం 38 వేల మైళ్లు పర్యటించి 104 ప్రాంతాలను సందర్శించింది. సుమారు 9 వేల మందిని ఇంటర్వూ చేసింది. స్పష్టమైన జనాభిప్రాయానికి సేకరించడానికి వీలుగా సమాజంలోని అన్ని వర్గాలను సంప్రదించినట్లు ఫజల్ అలీ తన నివేదికలో పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, మున్సిపల్, జిల్లా బోర్డుల సభ్యులు, సాంస్కృతిక, విద్య, భాష, స్థానిక ప్రయోజనాలపై ఇతర ప్రజా ప్రతినిధులను ఈ కమిషన్ ఇంటర్వ్యూ చేసింది. ఫజల్‌అలీ బృందం కేవలం ప్రజాభిప్రాయ సేకరణ కోసమే దేశ పర్యటన చేపట్టలేదు. ఒక్కోసారి వివిధ ప్రాంతాల్లో అకస్మాత్తుగా ఆగి స్థానిక సమస్యలు, అక్కడున్న భావోద్వేగాల గురించి ఎవ్వరికీ తెలియకుండా ఆరా తీసింది కూడా. కమిషన్ విధివిధానాల ప్రకారం మధ్యంతర నివేదిక సమర్పించే వెసలుబాటు ఉన్నా కమిషన్ ఆ పని చేయలేదు. అది సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఫజల్ అలీ కమిషన్ నివేదికకు కొన్ని మార్పు, చేర్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 1956లో రాష్ట్రాల పునర్విభజన చట్టం తీసుకొచ్చింది. |
| |
| ఫిబ్రవరి 20న శ్రీకృష్ణ కమిటీ ప్రజాభిప్రాయాలను ఆహ్వానిస్తూ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. మార్చి 22తో దాని గడువు ముగుస్తోంది. ఏప్రిల్ తొలివారం నుంచి జులై చివరి వరకు రాష్ట్రంలో పర్యటించి అన్ని వర్గాలతో సంప్రదింపులు జరపడానికి సమాయత్తం అవుతోంది. శ్రీకృష్ణ కమిటీ పది నెలల్లో దాదాపు 20 సార్లు భేటీ కావాలని ప్రాథమికంగా నిర్ధారించుకొంది. శ్రీకృష్ణ కమిటీకి 7వేల దరఖాస్తులొచ్చాయి. |