లీజు విమానాలకు స్వస్తి
30% సీట్లు చౌక ప్రయాణానికే
ప్రస్తుతానికి రూ.753 కోట్లు ఆదా
కొత్త ఆశల్లో ఎయిర్ ఇండియా
ఆర్థికంగా నిలదొక్కుకోలేక అవస్థలు పడుతున్న ఎయిరిండియా.. భవిష్యత్తులో మళ్లీ 'మహరాజ' యోగం పొందాలన్న తాపత్రయపడుతోంది. అందుకు అనుగుణంగా చర్యలూ తీసుకుంటోంది. అయితే ఇవి ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయి.. సంస్థ మళ్లీ గాడిలో పడేదెప్పటికి? అన్నవే ప్రధాన ప్రశ్నలు.ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేసుకున్నాక ఎయిరిండియా కష్టాలు ఎక్కువయ్యాయా...?
దుబారా ఖర్చులు తగ్గించేందుకు, ప్రైవేట్ రంగానికి దీటైన పోటీ ఇచ్చేందుకు ప్రభుత్వం అప్పట్లో ఉభయ సంస్థల విలీనానికి శ్రీకారం చుట్టింది. కానీ, ఇది ఆశించిన సత్ఫలితాలను ఇవ్వలేదనేందుకు ఇటీవల కిశోర్ చంద్రదేవ్ కమిటీ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఎయిరిండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ల విలీనాన్ని 'పొసగని పెళ్లి'గా ఆ కమిటీ అభివర్ణించింది. వాస్తవానికి దేశీయ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా, నిర్వహణ ఖర్చులు మితిమీరి ఎయిరిండియా నష్టాలు కళ్లచూడాల్సి వస్తోందనే వాదన బలంగా వినవస్తోంది. రెండు సంస్థల విలీనం వల్ల దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో నాసిల్ గట్టి పోటీ నిస్తోందని ప్రభుత్వం చెబుతున్నా.. ఈ ప్రక్రియ సాఫీగా లేదని, నష్టదాయకమని పార్లమెంటరీ స్థాయీ సంఘాలు ఢంకా భజాయిస్తున్నాయి. అయితే కొన్ని వ్యయ నియంత్రణ చర్యల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.753 కోట్ల ఖర్చులను తగ్గించ గలగడం జాతీయ విమానయాన సంస్థ (నాసిల్)కు ఊరటనిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు స్వల్పకాలానికి భారీ రాయితీలు ప్రకటించింది. లాభాల బాటలో సాగేందుకు శతథా యత్నిస్తోంది.
నిర్దేశించుకున్న లక్ష్యాలు
* 2011 మార్చి నాటికి విమానాల సంఖ్య 146 నుంచి 105కు తగ్గింపు
* లీజు ముగిసిన 22 విమానాలకు స్వస్తి. ఫలితంగా రూ.200 కోట్ల మేర వార్షిక ఖర్చులు, రూ.400 కోట్ల విలువైన ఇంధనం ఆదా
* కాక్‌పిట్, క్యాబిన్ సిబ్బంది, ఇంజినీర్ల సంఖ్య తగ్గింపుతో ఏడాదికి రూ.300 కోట్లు ఆదా
* ఈ ఆర్థిక సంవత్సరంలోనే 6 బోయింగ్-747 విమానాల ఉపసంహరణ, నాసిల్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ మార్గాల క్రమబద్ధీకరణ వంటి చర్యలతో రూ. 563 కోట్లు ఆదా
* అయిదేళ్ల క్రితం వరకు భారతీయ విమానాల్లో 80% వరకు ప్రయాణాలు వ్యాపార అవసరాల నిమిత్తం జరిగేవి. ప్రస్తుతం ఈ సంఖ్య 50% కంటే తక్కువే. జెట్ ఎయిర్‌వేస్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కూడా రాయితీలు లేని, చౌకగా తీసుకెళ్లే సాధారణ ప్రయాణాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. ఎయిరిండియా కూడా 2010-11లో 30% సీట్లను చౌక ప్రయాణానికి కేటాయించనుంది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కూడా గల్ఫ్ మార్గాల్లో ఇటువంటి చర్యలే తీసుకోనుంది.
సీట్ల భర్తీ పెరిగింది..
మానవ వనరుల హేతుబద్దీకరణ, పనితీరుకు అనుగుణంగా ప్రోత్సాహకాలు, ఎయిరిండియా- ఇండియన్ ఎయిర్‌లైన్స్ విలీనం, సాంకేతిక-నిర్వహణకు సంబంధించి చేసుకున్న ఒప్పందాల పునఃపరిశీలనతో పాటు లీజుపై తీసుకున్న విమానాలకు నాసిల్ స్వస్తి పలుకుతోంది. ఎయిరిండియా విమానాలు నడపని దేశాల్లో ఉన్న నాసిల్ కార్యాలయాలను మూసివేసి, సిబ్బందిని తొలగిస్తున్నారు. సీట్ల భర్తీ 57.7% నుంచి 62 శాతానికి చేరింది. ప్రయాణికుల సంఖ్య 53.2 లక్షల నుంచి 56.1 లక్షలకు చేరింది. నిర్వహణ నష్టాలు రూ.2,638 కోట్ల నుంచి 23% తగ్గి రూ.2,029 కోట్లకు పరిమితమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,911 కోట్ల మేర ఖర్చులు తగ్గించాలని నిర్ణయించగా, రూ.753 కోట్లు ఆదా చేయగలస్థితికి చేరారు.
దేశీయ ప్రయాణాల్లో 10% వృద్ధి!
* దేశీయ విమాన ప్రయాణికులు 2009లో 4.4 కోట్లు..
* 2010లో ప్రయాణికులు మరో 10% వరకు పెరుగుతారని బోయింగ్ అంచనా.
* 2010-11లో దేశీ ప్రైవేటు విమానయాన కంపెనీలన్నీ కలిపి 250 -300 మిలియన్ డాలర్ల (రూ.1150 కోట్లు- రూ.1380 కోట్లు) లాభాన్ని ఆర్జిస్తాయని సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ (సీఏపీఏ) అంచనా వేసింది.
పరిశ్రమకు ఉన్న అవరోధాలు
* ప్రయాణికులపై 10% సేవాపన్ను విధింపు, విమాన ఇంధన ధర అమాంతం పెరగడం
* కొన్ని దేశాలు ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడనందున, అంతర్జాతీయ విమాన మార్గాల్లో రాయితీల కొనసాగింపు
* 'ఎయిర్‌పోర్ట్' సేవల నిర్వచనాన్ని మార్చడం
ఎయిరిండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ విలీనం తరవాత నాసిల్‌కు నష్టాలు మరింత పెరిగాయి. విలీనానికి ముందు 2007-08లో రూ.2,226.16 కోట్లు నష్టపోగా, విలీనానంతరం 2008-09లో రూ.5,548 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. 2009-10లో కూడా రూ.5,400 కోట్ల మేర నష్టాలు తప్పవని భావిస్తున్నట్లు రాజ్యసభలో విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ ఇటీవల తెలిపారు. మరి కొన్నేళ్లు నష్టాలు తప్పవని కూడా ఆయన చెప్పారు.
విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌దీ ఇదే పరిస్థితి. నష్టాలు రూ.408.91 కోట్ల నుంచి అమాంతం నాలుగురెట్లు (రూ.1608 కోట్లు) అయ్యాయి.
ఎయిర్ సహారాను స్వాధీనం చేసుకుని, జెట్‌లైట్ గా పేర్చుమార్చి నిర్వహిస్తున్న జెట్ ఎయిర్‌వేస్‌కూ కష్టాలు తప్పలేదు. ఈ సంస్థ నష్టాలు రూ.695.10 కోట్ల నుంచి రూ.1,032.7 కోట్లకు చేరాయి.
అయితే బోయింగ్, ఎయిర్‌బస్ కంపెనీల నుంచి 111 విమానాల కొనుగోలు ప్రక్రియకు భారీ మొత్తం వెచ్చించనున్నందున, కొద్దిపాటి ఖర్చు నియంత్రణ చర్యల వల్ల ఫలితం ఉండదని పార్లమెంటరీ స్థాయిసంఘం అభిప్రాయం వ్యక్తంచేసింది. ప్రభుత్వమే విమానాల కొనుగోలు వ్యయాన్ని భరించాలని సూచించింది.