చిన్న పరిశ్రమలకు వూరట
సాయంత్రం కోత ఎత్తివేత హైదరాబాద్, న్యూస్‌టుడే: చిన్నతరహా పరిశ్రమలకు విద్యుత్తు కోత నుంచి కాస్త వూరట లభించింది. రోజూ కరెంటు వినియోగం ఎక్కువగా ఉండే.. సాయంత్రం 6.30 నుంచి 10.30 గంటల మధ్య పరిశ్రమలకు విధిస్తున్న కోత నుంచి చిన్న పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. సోమవారం చిన్నతరహా పరిశ్రమలశాఖ మంత్రి డీకే అరుణ, ఏపీ ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో చిన్నతరహా పారిశ్రామిక సంఘాల సమాఖ్య ప్రతినిధులు సమావేశమయ్యారు. వారానికి రెండ్రోజులు సెలవు, ఒకరోజు వీక్లీఆఫ్ వల్ల మూడురోజులు ఉత్పత్తి నిలిచిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన రోజుల్లో సాయంత్రం 4 గంటల కోతతో తీవ్రంగా నష్టపోతున్నామని వివరించారు. సమాలోచనల అనంతరం సాయంత్రం కోత ఎత్తివేయడానికి ఏపీ ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు అంగీకరించారు. ఈ నిర్ణయాన్ని సోమవారం నుంచే అమల్లోకి తెచ్చారు. కరెంటు సెలవు వారంలో ఒక రోజుకు(వీక్లీఆఫ్‌తో కలిపితే రెండురోజులకు) తగ్గించాలన్న పరిశ్రమల సమాఖ్య ప్రతినిధుల వినతిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రోజంతా కరెంటు ఇవ్వలేని పక్షంలో సెలవు అమల్లో ఉండే రోజుల్లో రాత్రిపూట 8 గంటల చొప్పున సరఫరా చేయాలనే ప్రతిపాదన వచ్చింది. దీనిపై ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలు చర్చిస్తున్నాయి. కరెంటు సెలవు కూడా తగ్గిస్తారన్న ఆశాభావంతో ఉన్నామని సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఎ.విజయ్‌కుమార్ తెలిపారు.