Monday, March 15, 2010

డాక్టర్‌ రెడ్డీస్‌ అరుదైన ఘనత

అత్యధిక డీఎంఎఫ్‌ల దాఖలు
రెండో స్థానం అరబిందోది
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: అమెరికా ఔషధ నియంత్రణ మండలి (యూఎస్‌ఎఫ్‌డీఏ) వద్ద గత ఏడాది సెప్టెంబరు నెలాఖరు వరకూ అత్యధిక సంఖ్యలో డీఎంఎఫ్‌లు (డ్రగ్‌ మాస్టర్‌ ఫైల్స్‌) దాఖలు చేసిన దేశాల్లో మనదేశం అగ్ర స్థానంలో నిలిచింది. భారత్‌ నుంచి డీఎంఎఫ్‌లు దాఖలు చేసిన కంపెనీల్లో రాష్ట్రానికి చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ మొదటి స్ధానాన్ని పొందగా, రెండో స్ధానంలో రాష్ట్రానికే చెందిన అరబిందో ఫార్మా ఉండటం విశేషం. సిప్లాది మూడో స్థానం. ఈ వివరాలను ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మాక్జిల్‌) ఇక్కడ వెల్లడించింది. అమెరికాలో ముడి ఔషధాలు (బల్క్‌ డ్రగ్స్‌), యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌ (ఏపీఐ) విక్రయించాలంటే, అందుకు ముందుగా యూఎస్‌ఎఫ్‌డీఏ వద్ద డీఎంఎఫ్‌ దాఖలు చేయాలి. తద్వారా మార్కెటింగ్‌ అనుమతి లభిస్తుంది. అమెరికా అతిపెద్ద ఔషధ విపణి అనే విషయం విదితమే. అందువల్లే అమెరికా కంపెనీలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన కంపెనీలు అక్కడ బల్క్‌ ఔషధాలు, ఏపీఐలు విక్రయించడానికి క్యూ కడుతూ ఉంటాయి.

గత ఏడాది సెప్టెంబరు వరకూ అమెరికాలో యూఎస్‌ఎఫ్‌డిఏ వద్ద మనదేశానికి చెందిన కంపెనీలు అత్యధికంగా 2,101 డీఎంఎఫ్‌లు దాఖలు చేశాయి. తదుపరి స్థానాల్లో అమెరికా (1122), ఇటలీ (732), చైనా (663) జపాన్‌ (328) ఉన్నాయి. మనదేశానికి చెందిన కంపెనీలు దాఖలు చేసిన డీఎంఎఫ్‌లలో ఎంతో విలువైన మెట్‌ఫామిన్‌, అమ్లోడిపిన్‌, సిమ్‌వాస్టాటిన్‌, ఓమిప్రజోల్‌ తదితర ఔషధాలు ఉన్నాయి.