Friday, March 19, 2010

క్యాన్సర్‌కు ప్రత్యేక ఆసుపత్రులు

ప్రాథమిక పరీక్షలపై 30% రాయితీ
రూ.400 కోట్ల పెట్టుబడులు
ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు యోచన
అపోలో గ్రూపు ఛైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: క్యాన్సర్‌ చికిత్సకు అపోలో హాస్పిటల్స్‌ దాదాపు రూ.400 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే చెన్నైలో ఒకటి ఉండగా.. హైదరాబాద్‌లోని అపోలో హెల్త్‌ సిటీలో రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మించిన రెండో ఆసుపత్రిని శనివారం రాష్ట్ర గవర్నర్‌ హెచ్‌.ఇ.నరసింహం ప్రారంభించనున్నారు. 100 పడకల ఈ ఆసుపత్రిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం 'నోవాలిస్‌ టీఎక్స్‌'తో చికిత్స చేస్తారు. దేశంలో ఈ పరిజ్ఞానం కలిగిన మొట్టమొదటి ఆసుపత్రి ఇదే. మరో రెండు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను కోల్‌కత్తా (ఈనెల 23), ఢిల్లీలో (రెండు మూడు నెలల్లో) ప్రారంభించనున్నారు. అపోలో ప్రస్తుతం 9 క్యాన్సర్‌ ఆసుపత్రులు నిర్వహిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఏడాదిలో గ్రూప్‌ కార్యకలాపాల విస్తరణకు రూ.1,800 కోట్లు ఖర్చు చేస్తామని ఆపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి చెప్పారు. ప్రాథమిక పరీక్షల (స్క్రీనింగ్‌ టెస్ట్‌) ద్వారా 90 శాతం క్యాన్సర్‌ కేసుల్లో నష్టాన్ని నివారించవచ్చని రెడ్డి అన్నారు. క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌కు వచ్చే వారికి వచ్చే పదేళ్ల పాటు పరీక్షలకు అయ్యే వ్యయంలో 30 శాతం రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించారు. మధుమేహం, గుండె జబ్బుల చికిత్సలకూ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేసే అంశాన్ని తోసిపుచ్చలేమని ఆయన అన్నారు.

ఆరోగ్య సంరక్షణ రంగంలోని కంపెనీలు వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) వీలు కల్పించిన నేపథ్యంలో గ్లోబల్‌ హెల్త్‌ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పనుంది. ఇందులో ఆసుపత్రులు, మెడికల్‌ కాలేజీలు, శిక్షణ సంస్థలు మొదలైనవి ఉంటాయి. ఇందుకు దాదాపు రూ.1,000 కోట్లు వెచ్చించనున్నారు. హైదరాబాద్‌ సహా మూడు ప్రాంతాలను ఇందుకోసం పరిశీలిస్తున్నారు.

రెండేళ్లలో 31 ఆసుపత్రులు: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11, ఆ తర్వాత ఏడాది మరో 20 ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని అపోలో యోచిస్తోంది. వచ్చే నెలలో సికింద్రాబాద్‌లో కొత్త ఆసుపత్రిని ప్రారంభించనుంది. దీంతో మొత్తం ఆసుపత్రుల సంఖ్య 52కు చేరుతుందని ప్రతాప్‌ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే పరిశోధన &అభివృద్ధి కేంద్రంలో ఆయుర్వేదం వంటి సంప్రదాయ చికిత్సా విధానాలపైనా పరిశోధన జరుగుతుందని, 20-25 శాతం నిధులను వెచ్చిస్తామని తెలిపారు. అహ్మదాబాద్‌లో మూలకణ కేంద్రం అందుబాటులోకి రానుందన్నారు.

వాటా కొనే అవకాశం: విదేశాల్లో అపోలో నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో వాటాను కొనుగోలు చేయడానికి కంపెనీకి అవకాశం (ఆప్షన్‌) ఉంది. అయితే.. కంపెనీ కార్పొరేట్‌ బోర్డు విదేశాలలో పెట్టుబడులు పెట్టొద్దని జులైలో సలహా ఇచ్చిందని రెడ్డి చెప్పారు. నైజీరియాలో రెండు, షాంఘై, వియన్నాలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం నాలుగు ఆసుపత్రులను కంపెనీ నిర్వహిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం పనితీరు డిసెంబరుతో ముగిసిన మూడు నెలల కన్నా మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తోంది.