Wednesday, April 14, 2010

ప్రపంచ టాప్‌ 10 ఫార్మా మార్కెట్లో భారత్‌

న్యూఢిల్లీ: ప్రపంచ దేశపు టాప్‌ టెన్‌ ఫార్మా మార్కెట్ల సరసన భారత్‌ చేరనుందనీ ప్రైస్‌వాటర్‌ హౌజ్‌ కూపర్స్‌ సంస్థ (పీడబ్ల్యూసీ) ప్రకటించింది. 2020 సంవత్సరం నాటికి ప్రోత్సాహకరమైన విక్రయాలతో భారత్‌ 50బిలియన్‌ల మార్కెట్‌ కలిగి ఉంటుందని పేర్కొంది. పెరుగుతున్న దేశ జనాభాతో పాటు ఆర్థికవ్యవస్థ కూడా వృద్ధి చెందుతోందనీ, తద్వారా మధ్యతరగతి వారు మరింత పెరిగి ఖరీదైన ఔషధాలకు ప్రాముఖ్యత పెరుగుతుందనీ పీడబ్ల్యూసీ కన్సల్టన్సీ సంస్థ తెలిపింది. పెరుగుతున్న జనాభా వల్ల కార్డియో వాస్కులర్‌, సెంట్రల్‌ నర్వస్‌ సిస్టమ్‌ సంబంధిత సమస్యలు మరింత పెరిగి డ్రగ్స్‌కు అధిక డిమాండ్‌ ఏర్పడనుందనీ రిపోర్టు పేర్కొంది. అమెరికాలో సుమారు 70బిలియన్‌ డాలర్ల విలువ గల డ్రగ్స్‌ పేటెంట్‌ హక్కులకు వెళ్ళనుండగా, భారత్‌ సమానస్థాయి వాటా ఉత్పత్తి సామర్థ్యాల్లో కలిగి ఉంటుందనీ తెలిపింది.

దాదాపు 20శాతం ప్రపంచ జెనరిక్‌ ఔషధాలను ఉత్పత్తి చేస్తున్న భారత్‌, పలు ముఖ్య విభాగాల్లో అంతర్జాతీయంగా పోటీను ఇవ్వనుందనీ తెలిపింది. వృద్ధి చెందుతోన్న దేశీయ ఫార్మ రంగం 2050 నాటికి అత్యంత ప్రాముఖ్యమైన ఫార్మా మార్కెట్‌గా ఎదగనుందనీ పీడబ్ల్యూసీ అధికారి సుజయ్‌ శెట్టి అన్నారు. ప్రస్తుతం దేశీయ ఫార్మా సంస్థలు కొన్ని పరిశోధనలకై అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయనీ తెలిపారు. ఈ వరుసలో డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొకేటరీస్‌ టార్రెంట్‌ నోవార్టిస్‌తో చేతులు కలుపగా, రాన్‌బ్యాక్సీ సంస్థ జీఎస్‌కె, స్వ్కాజ్‌ ఫార్మాస్యూటికల్స్‌తో భాగస్వామ్యానికి దిగిందనీ పీడబ్ల్యూసీ రిపోర్టు పేర్కొంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆంగ్ల భాష ప్రయుక్తగా భారత జనాభా ఎదిగిందనీ, ఇక్కడి విద్యావ్యవస్థ కూడా పటిష్ఠమైంది కాబట్టి ప్రతిభగల పరిశోధన నిపుణులకు భారత్‌ వనరుగా మారనుందనీ పీడబ్ల్యూసి తెలిపింది.