Saturday, April 3, 2010

పరిశ్రమల కోసం 15 వేల ఎకరాలు

హైదరాబాద్ (ఆన్‌లైన్): రాష్ట్రానికి కొత్తగా వచ్చే పరిశ్రమల కోసం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలికసదుపాయాల కల్పనా సంస్థ (ఎపిఐఐసి) 15,000 ఎకరాల భూమితో స్వాగతం పలుకుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పారిశ్రామిక అవసరాల కోసం ఈ భూమిని సిద్ధం చేసి ఉంచినట్లు కార్పొరేషన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

పారిశ్రామికంగా అగ్రస్థానంలో ఉన్న గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సౌలభ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో భూమి అందుబాటులో ఉండటమేనని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు భూమి కేటాయించి.. సకాలంలో మౌలికసదుపాయాలు కల్పిస్తే పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథంలో పయనించగలదని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

కార్పొరేషన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు దాదాపు లక్ష ఎకరాల భూమిని వివిధ పారిశ్రామిక పార్కులు/యూనిట్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్ళ (సెజ్)కు ఎపిఐఐసి కేటాయించింది. మరో పదిహేను వేల ఎకరాల భూమిని ఎపీఐఐసి భవిష్యత్ పారిశ్రామిక అవసరాల కోసం సిద్ధంగా ఉంచింది.

కడప జిల్లాలో పులివెందులలో 700 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయగా... ఇప్పటికే ఇందులో పలు సంస్థలు యూనిట్లు ఏర్పాటు చేశాయని..ఇక్కడ ఇంకా డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో మరో 200 ఎకరాల భూమిని సేకరించే ఆలోచనలో ఉన్నట్లు కార్పొరేషన్ వర్గాలు వెల్లడించాయి.

దీంతోపాటు అనంతపురం జిల్లాలోని హిందుపురం పారిశ్రామికవాడకు కూడా ఇప్పుడు డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని చెబుతున్నారు. తాజాగా ఇక్కడ దాదాపు 600 కోట్ల రూపాయ ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేసేందుకు బెర్జర్ పెయిం ట్స్ ముందుకొచ్చిందని చెప్పారు. ఇప్పటికే గుజరాత్‌లో యూని ట్లు కలిగిఉన్న హిందుస్థాన్ గ్లాస్, గుజరాత్ ఎన్ఆర్ఈ కోక్‌లు రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యా యి.

పోటీ రాష్ట్రాలతో పోలిస్తే పారిశ్రామిక అవసరాలకు కేటాయించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో భూమి అందుబాటులో ఉండ టం సానుకూల అంశమే అయినా...ఈ భూములను ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలే తమ అస్మదీయ కంపెనీలకు ఇష్టం వచ్చిన రేట్లకు కేటాయించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

గత ఐదేళ్ళలో రూ.6,433 కోట్ల భూముల అమ్మకాలు ఎపిఐఐసి గత ఐదేళ్ళ కాలంలో 2భూముల విక్రయంలో రికార్డులు సృష్టించింది. 2004-05 నుంచి 2008-09 ఆర్థిక సంవత్సరం వరకూ కార్పొరేషన్ 6433 కోట్ల రూపాయల విలువ చేసే భూములు అమ్మింది. 2004-05 ఆర్థిక సంవత్సరంలో 119 కోట్ల రూపాయల విలువ చేసే భూములు అమ్మగా, 2005-06 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 440 కోట్ల రూపాయలకు పెరిగింది.

2006-07 ఆర్థిక సంవత్సరంలో ఎపిఐఐసికి భూముల విక్రయం ద్వారా వచ్చిన మొత్తం 1,086 కోట్ల రూపాయలకు చేరగా, 2007-08 సంవత్సరంలో భూముల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం ఏకంగా 3528 కోట్ల రూపాయలకు పెరిగింది.

2008-09 ఆర్థిక సంవత్సరంలో మాత్రం భూముల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం 1,260 కోట్ల రూపాయలకు తగ్గింది. ఎపిఐఐసి చరిత్రలో ఎప్పుడూ గత ఐదేళ్ళ కాలంలో జరిపినంతగా భూముల విక్రయాలు జరపలేదు. విచ్చలవిడిగా ప్రభుత్వ భూముల విక్రయాలపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.