Saturday, April 3, 2010

సంక్షోభంలోనూ లాభాల పంటే..

గత రెండేళ్ళ నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యం ఆవరించిన పరిస్థితుల్లో కూడా క్రెడిట్‌కార్డు కంపెనీలు లాభాలే దండుకున్నాయి. ప్రపంచంలో స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ అవుతున్న కంపెనీల్లో అమెక్స్, మాస్టర్‌కార్డ్, వీసా ఉన్నాయి. 2008 ఏప్రిల్ నుంచి అమెరికాకు చెందిన ఎస్ అండ్ పి ఇండెక్స్ 33 శాతం నష్టపోగా ఈ మూడు కంపెనీలు మాత్రం లాభాలే ఆర్జించాయి.

వీసా నికరలాభం 2009 ఆర్థిక సంవత్సరంలో 13 శాతం పెరిగి 200 కోట్ల డాలర్లకు (9 వేల కోట్ల రూపాయలు) చేరింది. క్రెడిట్ కార్డ్ కంపెనీ ప్రాసెసింగ్ సర్వీసుల కేంద్రం కావడమే ఇందుకు దోహదపడుతున్న అంశమని చెబుతున్నారు. చెల్లింపును ప్రాసెస్ చేయడం వల్ల క్రెడిట్ కార్డ్ జారీ చేసిన కంపెనీకి వ్యాపార సంస్థలు నిర్దిష్ట మొత్తంలో ఫీజు చెల్లిస్తాయి.

కస్టమర్లు తమ బకాయిపై వడ్డీ చెల్లిస్తారు. మాస్టర్ కార్డ్ కంపెనీ 2008 సంవత్సరం చివరి నాటికి 640 కోట్ల డాలర్ల కంపెనీగా రూపాంతరం చెందగా అందులో 430 కోట్ల డాలర్ల మేరకు నిల్వలే ఉన్నాయి. వీసా కార్డుది కూడా ఇదే పరిస్థితి. ఈ కంపెనీ సైజు 3,200 కోట్ల డాలర్లు కాగా అందులో 800 కోట్ల డాలర్లు లిక్విడ్ ఆస్తులే.

పైగా క్రెడిట్ కార్డ్ కంపెనీలకు ఉత్పత్తుల కంపెనీల తరహాలో కొత్త పెట్టుబడులు పెట్టాల్సిన బాధ్యత కూడా లేకపోవడం వారి లాభాలు మరింతగా పెరగడానికి దోహదపడుతున్న అంశమని అంటున్నారు. ఈ కంపెనీలకు భారీ నగదు నిల్వలుండడంతో పాటు వడ్డీరేట్ల రిస్క్‌ను ఎప్పటికప్పుడు కస్టమర్లకు, కార్డు జారీ చేసిన బ్యాంకులు, వ్యాపారుల పైకి నెట్టి వేయడం వల్ల ఇవి అదనంగా భరిస్తున్న భారం కూడా ఏమీ లేదు.