న్యూఢిల్లీ : విశాల్ ఎక్స్‌పోర్ట్స్ ఓవర్సీస్ లిమిటెడ్... స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన సంస్థ. అంటే పబ్లిక్ ఇష్యూకు వచ్చి ప్రజల నుంచి నిధులను సమీకరించిందన్న మాట. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలో ఉన్నట్లు చెప్పుకునే ఈ సంస్థకు స్టార్ ఎక్స్‌పోర్ట్ ప్రతిపత్తి కూడా ఉంది. ఈ సంస్థ 2004 - 2006 మధ్య కాలంలో 23 బ్యాంకులతో కూడిన కన్సార్షియం నుంచి రకరకాల మార్గాల్లో 500 కోట్ల రూపాయల మేర దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
బోగస్ పత్రాలు, ఫోర్జరీ డాక్యుమెంట్లు, దొంగ కంపెనీలతో... ప్రమోటర్లు ఈ బ్యాంకుల నెత్తిన విశాల్ ప్రమోటర్లు కుచ్చుటోపీ పెట్టారు. హైదరాబాద్‌కు చెందిన ఆంధ్రాబ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు దరిమిలా గురువారం నాడు ఈ సంస్థపై దాడులు నిర్వహించిన సిబిఐ అధికారులు, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ సి మెహతాను కంపెనీ డైరెక్టర్లు మెహతా కుమారులైన ప్రదీప్, దీపక్‌లను అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా కంపెనీపైనా, నిందితుల ఇళ్లపైనా సిబిఐ అధికారులు నిర్వహించిన దాడుల్లో పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత అరెస్టుచేసిన వారిని అహ్మదాబాద్‌లోని అడిషనల్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా ఈ నెల 12వరకు జుడీషియల్ కస్టడీలో ఉంచాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.
దొంగ పత్రాలు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో తమను 23 కోట్ల రూపాయల మేరకు వంచించినట్లు ఆంధ్రాబ్యాంక్ చేసిన ఫిర్యాదు మేరకు సిబిఐ ఈ అరెస్టులు చేసింది. సిబిఐకి చెందిన బ్యాంకు సెక్యూరిటీస్ అండ్ ఫ్రాడ్ సెల్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నది.
ఆంధ్రాబ్యాంక్ కంటే ముందు పంజాబ్ నేషనల్ బ్యాంక్, విజయా బ్యాంక్, యూకో బ్యాంక్ చేసిన ఫిర్యాదులపై కూడా ఈ కంపెనీకి, కంపెనీ డైరెక్టర్లకు వ్యతిరేకంగా అధికారులు కేసులు నమోదు చేశారు. 190 కోట్ల రూపాయల మేర తమను ముంచినట్లు ఈ బ్యాంకులు సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేశాయి.
కంపెనీ ప్రమోటర్లు మాయల మరాఠీలు
ప్యాకింగ్ క్రెడిట్, ఫారిన్ బిల్ డిస్కౌంటింగ్, లెటర్ ఆఫ్ క్రెడిట్ వగైరా సౌకర్యాలను ఉపయోగించుకుని 2004-2006 మధ్య 23 బ్యాంకుల కన్సార్షియం నుంచి దాదాపు 500 కోట్ల రూపాయల మేర నిధులను విశాల్ ఎక్స్‌పోర్ట్స్ దండుకున్నట్లు చెబుతున్నారు.
బోగస్ డాక్యుమెంట్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లను బ్యాంకులకు సమర్పించడం, బోగస్ బిజినెస్ లావాదేవీలను చూపిస్తూ తమకే చెందిన అసోసియేట్ కంపెనీల పేరుతో లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ఓపెన్ చేయించడం.. ఇలాంటి దందాలతో బ్యాంకులను ముంచినట్లు ఈ సంస్థపై ఆరోపణలు ఉన్నా యి. వ్యాపారం కోసం బ్యాంకులు ఇచ్చిన రుణాలను కూడా విశాల్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోటర్లు తమ సొంత అవసరాలకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కంపెనీ ఘనత ఏ విధంగా ఉందంటే క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో సమాచారం ప్రకారం 2008 మార్చినాటికే 11 బ్యాంకులకు ఎగవేసిన మొత్తం 244.92 కోట్ల రూపాయల మేర ఉంది. మరికొన్ని బ్యాంకులకు సంబంధించిన సమాచారం కూడా తెలియాల్సింది.
క్రెడిట్ బ్యూరో వివరాల ప్రకారం, విజయా బ్యాంక్ (18.39 కోట్ల రూపాయలు), ఇండియన్ బ్యాంక్ (24.76 కోట్ల రూపాయలు) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (36.48 కోట్ల రూపాయలు) జమ్మూకాశ్మీర్ బ్యాంకు (34.67 కోట్ల రూపాయలు), ఆంధ్రాబ్యాంకు (33.83 కోట్ల రూపాయలు) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ (27.74 కోట్ల రూపాయలు), స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (24.63 కోట్ల రూపాయలు), అలహాబాద్ బ్యాంక్ (21.10 కోట్ల రూపాయలు), ఇండస్ బ్యాంక్ (15.87 కోట్ల రూపాయలు), సిడ్బీ (4.01 కోట్ల రూపాయలు), సౌత్ ఇండియన్ బ్యాంక్ ( 3.44 కోట్ల రూపాయలు).. విశాల్ ఎక్స్‌పోర్ట్స్ ఎగవేసిన మొత్తాలుగా పేర్కొన్నాయి.