సంస్థ సీఎండీ నర్సింగ్‌రావు వెల్లడి హైదరాబాద్, న్యూస్‌టుడే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 51.30 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రకటించింది. ఇందుకోసం రూ.1334 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ సంస్థ సీఎండీ ఎస్.నర్సింగ్‌రావు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 600 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ప్రాజెక్టు కోసం రూ.540 కోట్లు ఖర్చుచేయనున్నట్లు చెప్పారు. అంతిమంగా రూ.160 కోట్లు లాభాలొస్తాయని అంచనా వేసినట్లు వివరించారు. గురువారం సింగరేణి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. 2009-10లో 49.26 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు నర్సింగ్‌రావు తెలిపారు. తెలంగాణ తదితర రాజకీయ పరమైన ఉద్యమాలు ఉత్పత్తిపై కొంత ప్రభావం చూపాయన్నారు. జాతీయ బొగ్గు సరాసరి వృద్ధి రేటు 8% ఉండగా సింగరేణి 13%తో అగ్రస్థానంలో ఉందని, దేశ బొగ్గు అవసరాల్లో సింగరేణి 9% తీరుస్తోందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో రూ.1284 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ఇతర కంపెనీలతో ఒప్పందాలున్న విద్యుత్‌సంస్థలు ఇబ్బందులు పడుతుండగా, సింగరేణి నుంచి అలాంటి ఇబ్బందుల్లేకపోవడం కంపెనీ పనితీరుకు నిదర్శనమన్నారు. 11వ పంచవర్ష ప్రణాళికలో రూ.3600 కోట్లు పెట్టుబడి వ్యయం అంచనా వేస్తే రూ.5600 కోట్లకు చేరుకుందన్నారు. ఏపీజెన్‌కో విద్యుదుత్పత్తికి బొగ్గు అవసరాల కోసం ఈ-వేలంలో 1.17 లక్షల టన్నుల బొగ్గు అమ్మినట్లు తెలిపారు. దీనికి ఏపీజెన్‌కో సాధారణ ధర కంటే రూ.444 అధికంగా చెల్లించాల్సి ఉందన్నారు. అయితే దీనిని కాగ్ తప్పుబట్టిందన్నారు. కాగ్ జోలికి తాను వెళ్లడం లేదనీ, అదనపు ధరకి ప్రభుత్వం అనుమతించాల్సి ఉందని తెలిపారు. బొగ్గు తవ్వకం కాంట్రాక్టర్లకు: 2016-17 నాటికి డిమాండ్, సరఫరా మధ్య దాదాపు 11.5 మిలియన్ టన్నులు వ్యత్యాసం ఉంటుందని అంచనా వేసినట్లు సీఎండీ తెలిపారు. ఖమ్మం జిల్లా జవహర్, కోయగూడెం ఓపెన్‌కాస్ట్ గనులు, వరంగల్‌జిల్లాలో కాకతీయ, ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూర్ లాంగ్‌వాల్-1, లాంగ్‌వాల్-2, రామకృష్ణాపూర్ షాప్ట్‌బ్లాక్‌ల్లో ప్రాజెక్టులు చేపడతామన్నారు. వీటిని అభివృద్ధి చేసి బొగ్గు వెలికితీత కోసం టెండర్లు పిలుస్తామన్నారు. నాలుగు భూగర్భ గనుల్లో పనులు చేపట్టడానికి రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్ల ఖర్చవుతుందని చెప్పారు.
తాడిచర్లపై త్వరలో ఒప్పందం: భూపాలపల్లి కాకతీయ విద్యుత్‌ప్రాజెక్టు రెండోదశకు బొగ్గు సరఫరా కోసం కేటాయించిన తాడిచర్ల బొగ్గుగనిపై త్వరలోనే ఏపీజెన్‌కోతో ఒప్పందం చేసుకోనున్నట్లు నర్సింగ్‌రావు ప్రకటించారు. దీనిపై రెండు వారాల్లో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందన్నారు.