సవాళ్లున్నా.. మెరుగ్గా రాణించనున్న మార్కెట్
25,000 పాయింట్లకు సెన్సెక్స్!
కొత్త ఆర్థిక సంవత్సరంపై నిపుణుల విశ్లేషణ
ఐఏఐపీ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వే ప్రకారం 80 శాతం మంది ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఈక్విటీ మార్కెట్లు మంచి పెట్టుబడి అవకాశమని పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రాధాన్యం స్థిరాస్తి, కమోడిటీ రంగాలకు ఇచ్చారు. ఇంకా ఆ సర్వే ఏం చెబుతోందంటే..
* సెన్సెక్స్ 2010-11లో 50 శాతం ర్యాలీ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుండడంతో మార్కెట్లు 17,500 పైన కదలుతూ ఉన్నాయి. ఆ లెక్కన 50 శాతం అంటే ఈ ఏడాది ఎప్పుడో ఒకప్పుడు 25,000 పాయింట్లనూ దాటేందుకు వీలుంది.
* బ్యాంకింగ్, విద్యుత్, నిర్మాణ సంస్థలు మెరుగ్గా రాణించగలవు. అదీకాక సిమెంటు కంపెనీలు లక్ష కోట్ల డాలర్ల మూలధన పెట్టుబడులు పెడుతుండడం కూడా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవనుంది.
* ఏప్రిల్-జూన్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ స్క్రిప్‌ల మార్కెట్ విలువ రూ.36,000 కోట్లకు చేరే అవకాశం ఉంది.
* చాలా వరకు అంతర్జాతీయ తయారీ కంపెనీలను భారత్ ఆకర్షిస్తూ ఉండడం కూడా శుభపరిణామం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ) తమ పెట్టుబడులను మరింత పెంచే అవకాశం ఉంది. అంతే కాదు తమ కేటాయింపులను చైనా నుంచి భారత్‌కు మళ్లించే అవకాశాలూ ఎక్కువే.
* ఈ ఆర్థిక సంవత్సరంలో జనరిక్ ఫార్మా,. దేశీయ ఎఫ్‌ఎమ్‌సీజీ, రిటైల్, మీడియా, వినోద కంపెనీలతో పాటు అధిక ఆర్‌ఓఈ(రిటర్న్ ఆన్ ఈక్విటీ) గల మధ్య స్థాయి కంపెనీలు బలోపేతం కానున్నాయి.
* ఎక్కువ ఖర్చు చేసే సత్తా ఉన్న భారతీయ యువ జనాభా కూడా ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించొచ్చు. జీడీపీ 9 శాతంగా నమోదవ్వొచ్చు.
* ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటుండం; ఈ ఏడాది మరిన్ని శీతలీకరణ గిడ్డంకులను ఏర్పాటు చేస్తుండడంతో ద్రవ్యోల్బణ కట్టడి సాధ్యమవ్వొచ్చు.
* రుతుపవనాల ధోరణి, కరెంట్ అకౌంట్ లోటు వంటి అంశాలపై ఆధారపడి వచ్చే 3-4 నెలల్లో స్వల్పకాల సవాళ్లు ఎదురవ్వొచ్చు.
* వేతన/జీతాల పెంపు 15 శాతంగా ఉండొచ్చు.