Saturday, April 3, 2010

ఎండల్లాగే ధరలూ మండనున్నాయ్‌

కార్లు, ఏసీలు, టీవీలు, ఫ్రిజ్‌లు ప్రియం!
టన్నుకు రూ.2,500 పెరిగిన ఉక్కు ధరలు
ముడిపదార్థాలు భారం: స్టీల్‌ కంపెనీలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని ఉక్కు దిగ్గజం స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌)తో పాటు ప్రయివేటు రంగంలోని జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎస్సార్‌ స్టీల్‌లు తమ ఉత్పత్తుల శ్రేణి ధరలను టన్నుకు రూ.2,000 నుంచి రూ.2,500 వరకు పెంచివేశాయి. కొత్త ధరలు ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపాయి. అంతే కాదు, వచ్చే నెలకు ధరల నిర్ణయంపై ఈనెల మొదటి పక్షం దాటాక సమీక్షిస్తామని కూడా జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ విక్రయాలు, మార్కెటింగ్‌ విభాగం అధికారి జయంత్‌ ఆచార్య చెప్తున్నారు. గత నెల 29న మన రాష్ట్రంలోని విశాఖ ఉక్కు కర్మాగారం (ఆర్‌ఐఎన్‌ఎల్‌) కూడా తన వివిధ ఉత్పత్తులకు ధరలను టన్నుకు రూ.3,000 మేర పెంచిన విషయం తెలిసిందే. దీంతో విశాఖ ఉక్కు ధరలు టన్నుకు రూ.40,000 దాటిపోయాయి. ముడిపదార్థాల ధరలు పెరగడమే తమ నిర్ణయానికి కారణమని ఈ కంపెనీలు పేర్కొంటున్నాయి. భూషణ్‌ స్టీల్‌, ఇస్పాత్‌ వంటి కంపెనీలు కొంచెం ఆలస్యంగా అయినా ఇదే దోవన (ధరలు పెంచే దారిన) నడిచే సూచనలు ఉన్నాయి. అయితే టాటా స్టీల్‌ మాత్రం ధరలను పెంచడంపై ఒక నిర్ణయానికి రాలేదని పేర్కొంది. ఇప్పటికే గత రెండు నెలల్లో ఉక్కు ధరలు రెండు సార్లు ఎగయడం గమనార్హం.

కోకింగ్‌ బొగ్గూ భగ్గు
ఉక్కు పరిశ్రమలు బ్లాస్ట్‌ ఫర్నేసులను నడపడానికి కోకింగ్‌ కోల్‌ అవసరం. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ కోకింగ్‌ కోల్‌ ధరలు ఇటీవల ఒక్కసారిగా 55 శాతం మేర పెరిగాయి. 2010 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి టన్నుకు 200 డాలర్ల స్థాయిని నమోదు చేశాయి. అంతకు సంవత్సరం క్రితం టన్ను ధర 105 నుంచి 130 డాలర్లు ఉండేది. కోల్‌ ఇండియా లిమిటెడ్‌ సరఫరా చేసే బొగ్గుపై ఆధారపడ్డ సెయిల్‌ మినహా ఇతర కంపెనీలు ఎక్కువగా కోకింగ్‌ కోల్‌ను దిగుమతి చేసుకొంటాయి. అలాంటిది కోకింగ్‌ కోల్‌ ధరలు పెరిగితే, ఉక్కు ఉత్పాదక వ్యయం దానంతట అదే అధికం కావడం ఖాయం.

సహజ వాయువుల ధరలు కూడా..
ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లు ఉత్పత్తి చేస్తున్న సహజవాయువు ధరలను పెంచే దిశగా కసరత్తు సాగుతోందని కేంద్ర పెట్రోలియమ్‌ శాఖ ప్రకటించిన విషయమూ తెలిసిందే. ఉక్కు, సహజవాయువుల ధరలు పెరిగితే నాకేంటట అని పౌరులు అనుకోవడం తగదు.. ఎందుకంటే, పరిశ్రమలకు వస్తూత్పత్తి కోసం ఉక్కు, సహజవాయువుల వంటివి ఎంతో అవసరం. అవి తమ వస్తూత్పత్తి వ్యయం పెరిగే పక్షంలో, ఆ వ్యయం మొత్తాన్ని కాకపోయినా కొంతవరకైనా వినియోగదారులకు బదిలీ చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అపుడు అదనపు భారాన్ని మోయాల్సింది అంతిమంగా వినియోగదారే. అంటే- ఉక్కు, సిమెంటు, పెట్రోలు వంటి కీలక సరకుల ధరల పెంపు వస్తువుల ఖరీదుల పైన పరోక్ష ప్రభావాన్ని చూపించగలుగుతాయి.

ఇంతకూ ఉక్కు ధరలు పెరిగితే ఏమవుతుంది?
ఉక్కు ఒక ముడిపదార్థంగా తయారు అయ్యే కార్లు, ఇంకా రిఫ్రిజిరేటర్లు , ఎయిర్‌కండిషనర్‌లు, టెలివిజన్‌ సెట్లు వంటి వస్తువులు ప్రియం కావడానికి ఆస్కారం ఉంది. కొన్ని ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల కంపెనీలు తాము విక్రయించే ఉత్పత్తుల ధరలు ఎగబాకవచ్చని సూచనప్రాయంగా వెల్లడించినట్లు తెలిసింది. ఏసీలు, టీవీల వంటి వస్తువుల అమ్మకాలకు సాధారణంగా వేసవిలో గిరాకీ అధికంగా ఉంటుంది. ఇదే సమయంలో వాటి ధరలను పెంచడం వల్ల కంపెనీలకు లాభదాయకం కావచ్చేమో కాని, వినియోగదారులు వారి జేబుల నుంచి కాస్తంత పెద్ద మొత్తాన్నే తీసి చెల్లించవలసి రావచ్చు.