గ్రీన్ రేటింగ్స్: దేశంలోనే తొలిసారిగా ఎంఎస్‌ఎంఎఫ్ రంగానికి గ్రీన్ రేటింగ్ ఇచ్చే ప్రక్రియను మంత్రి ఈ సమావేశంలో ఆరంభించారు. సిడ్బీకి చెందిన ఎస్‌ఎంఈ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యం వహిస్తుంది. విస్తృతంగా, పారదర్శకంగా, నమ్మకమైన విధానంలో ఆయా సంస్థలకు రేటింగ్ ఇవ్వడం వల్ల పర్యావరణ అనుకూల, ఇంధన వినియోగంలో సమర్థంగా ఉండేలా పరిశ్రమలు రూపుదిద్దుకుంటాయని మంత్రి అభిప్రాయం వ్యక్తంచేశారు.
9% వృద్ధి రేటు సాధిస్తాం: 2010-11 బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనల వల్ల ప్రైవేటు పెట్టుబడులు అధికంగా సమకూరి, 9% వృద్ధిరేటు సాధించేలా ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతుందని ప్రణబ్ చెప్పారు. 2009-10లో వృద్ధిరేటు 7.2% ఉండవచ్చని, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఇది ప్రభావవంతమేనని ఆయన పేర్కొన్నారు. 2010-11 ఆర్థిక సంవత్సరంలో 8.25% - 8.75% వృద్ధిరేటు సాధ్యమౌతుందని ప్రణబ్ తెలిపారు.
బడ్జెట్ అంచనాలను మించిన ప్రత్యక్ష పన్నులు: 2009-10 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్షపన్నుల (కార్పొరేట్ పన్ను, ఆదాయపు పన్ను, సంపద పన్ను) వసూళ్లు బడ్జెట్ అంచనా రూ.3.70 లక్షల కోట్లను మించుతాయని ప్రణబ్ ఈ సమావేశంలో వెల్లడించారు. అయితే సవరించిన అంచనాలు రూ. 3.87 లక్షల కోట్లకు కాస్త తక్కువగా ఉంటాయని మంత్రి తెలిపారు. 2010-11లో ప్రత్యక్ష పన్నులు రూ.4.30 లక్షల కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొన్న సంగతి విదితమే.