Monday, April 5, 2010

'రుణ' వాహనాలకు స్టాంపు రుసుము

బకాయిల వసూళ్లకూ రిజిస్ట్రేషన్‌ శాఖ సన్నాహాలు
గత ఐదేళ్లలో కొన్న వాహనాల పత్రాలు పరిశీలన
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలతో వాహనాలు కొనుగోలు చేసే వారి నుంచి ఇకపై రిజిస్ట్రేషన్‌ శాఖ ముక్కు పిండి మరీ స్టాంపు రుసుమును వసూలు చేయనుంది. గడిచిన ఐదేళ్లలో చెల్లించని వారి నుంచి బకాయిలను కూడా రాబట్టాలని యోచిస్తోంది. దీనిలో భాగంగా 2005 నుంచి రాష్ట్రంలో వాహనాల కొనుగోలుకు రుణాలిచ్చిన బ్యాంకులు, ఇతర సంస్థల వివరాలను రాబట్టనుంది. ప్రస్తుతం స్టాంపు రుసుము సరిగా వసూలు కావడంలేదని భావిస్తున్న రిజిస్ట్రేషన్ల శాఖ ఈ చర్యలు చేపడుతోంది. ఆదాయం పెంచుకోవడంలో భాగంగా రిజిస్ట్రేషన్ల శాఖ దృష్టి తాజాగా మోటారు వాహనాలపై పడింది. రాష్ట్రంలో కార్లు, మోటారు సైకిళ్లు వంటి వాహనాల కొనుగోలుకు రుణాలిచ్చే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చాలా ఉన్నాయి. కొనుగోలుదారు తన రుణాన్ని పూర్తిగా చెల్లించేవరకు వాహనం ఆయా ఆర్థిక సంస్థలకు తనఖా ఉన్నట్లుగా పత్రాల్లో పేర్కొంటారు. ఇలా తనఖా పత్రాలు రాసేటప్పుడు వాహనాల యజమానులు ప్రభుత్వానికి స్టాంపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రుణ మొత్తంపై ఇది 0.5 శాతం చొప్పున గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ శాఖ తాజాగా కొన్ని పత్రాలను పరిశీలించగా రుసుము పూర్తి స్థాయిలో వసూలు కావడం లేదని తేలింది. దీంతో 2005 నుంచి రుణాలపై అమ్మిన వాహనాల పత్రాలన్నింటినీ పరిశీలించాలని తాజాగా నిర్ణయించింది. 2005, ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విక్రయించిన వాహనాల వివరాలను రవాణా శాఖ నుంచి సేకరిస్తారు. అనంతరం స్టాంపు రుసుము సక్రమంగా వసూలైందీ లేనిదీ పరిశీలించి ఈ నెల 20లోగా అధికారులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి నివేదికలు అందజేస్తారు. వీటి ఆధారంగా బకాయిల వసూళ్లకు చర్యలు చేపడతారు.