న్యూఢిల్లీ: ఉక్కు ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తి కంపెనీలైన సెయిల్, జెఎస్‌డబ్ల్యు, ఎస్సార్ తమ ఉత్పత్తులపై టన్నుకు 2,500 రూపాయల వరకు ధరలను పెంచాయి. ఈ ధరల పెంపుతో ఆటోమొబైల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్ ్స ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇనుప ఖనిజం, కోకింగ్ కోల్ ధరలు పెరగడంతో తమ ఉక్కు ఉత్పత్తుల ధరల పెంచినట్లు కంపెనీలు వెల్లడించాయి. తమ ఉత్పత్తులపై ధరను టన్నుకు 2,000- 2,500 పెంచినట్లు సెయిల్ చైర్మన్ ఎస్‌కె రుంగ్టా తెలిపారు. జెఎస్‌డబ్ల్యు, ఎస్సార్ స్టీల్ కూడా ధరల పెంపును ధృవీకరించాయి. అయితే టాటా స్టీల్ మాత్రం తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది.
తాము పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయని ఎస్సార్ స్టీల్ అధికారి తెలిపారు. కాగా ధరల పెంపుపై ప్రభుత్వం ఇప్పుడప్పుడే సమీక్ష జరిపే అవకాశం లేదు. స్టీల్ ధరల పెంపు తాత్కాలిక పరిణామని, దీనివల్ల ద్రవ్యోల్బణ భయం లేదని ఉక్కు శాఖ మంత్రి వీరభద్ర సింగ్ తెలిపారు.