టన్నుకు వెయ్యి డాలర్లు చెల్లిస్తున్న అరబ్ దళారులు
గల్ఫ్‌లో విక్రయించేది కిలో రూ.120కి పైమాటే
రాష్ట్రం నుంచి పాండిచ్చేరికి తరలుతున్న ధాన్యం
రైతుల ముసుగులో లాభాలు
పండించుకుంటున్న వ్యాపారులు
లారీల్లో బియ్యం ఎగుమతి కోసం పట్టు ఇందుకే?
సర్కారు మేల్కొనకుంటే మరోసారి బియ్యం మంటలు?
హైదరాబాద్ - న్యూస్‌టుడే
రాష్ట్రంలో పండే లావు బియ్యానికి ఆఫ్రికా దేశాల్లో మంచి డిమాండ్ ఉండగా, దుబాయ్ లాంటి అరబ్ దేశాల్లో సన్న బియ్యానికి బాగా గిరాకీ ఉంది. గతంలో కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు పెద్ద ఎత్తున అక్రమంగా లావు బియ్యం ఎగుమతి జరిగేది. దేశంలో బియ్యం కొరత ఏర్పడినప్పుడు వీటి ధరలు పెరిగే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో కేంద్రం టన్ను బియ్యం ధర వెయ్యి డాలర్ల లోపుగా ఉండే రకాలను ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. ధర ఎక్కువగా ఉంటే బాసుమతి లాంటి బియ్యాన్ని మాత్రమే ఎగుమతి చేసేందుకు అంగీకరించింది.
జపాన్ యంత్రాలతో నూకల్లేని బియ్యం
దుబాయ్‌లాంటి అరబ్ దేశాలకు గుజరాత్ తీరం కాండ్లా ఓడ రేవునుంచి బాసుమతి బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా వినియోగించుకునేందుకు మన రాష్ట్రానికి చెందిన కొందరు వ్యాపారులు, మిల్లర్లు రంగ ప్రవేశం చేశారు. బియ్యంలో ఒక్కశాతం కూడా నూక లేకుండా పూర్తిస్థాయి పాలిష్‌తో నాణ్యమైన సన్నరకంబియ్యాన్ని ఎగుమతి చేసేందుకు జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న స్టార్టెక్ యంత్రాలను వాడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30కి పైగా స్టార్టెక్ యంత్రాలున్నాయి. కొందరు వ్యాపారులు వీటి ద్వారా నూకలేని బియ్యాన్ని రూపొందించి కిందిస్థాయి అధికారుల సహకారంతో ముంబయి జాతీయ రహదారి మీదుగా కాండ్లా రేవుకు తరలిస్తున్నట్లు తెలిసింది.
పాండిచ్చేరికి సోనామసూరి
మరి కొందరు వ్యాపారులు వ్యూహాత్మకంగా పక్కనే ఉన్న పాండిచ్చేరిని తమ కార్యకలాపాలకు కేంద్రంగా ఎంచుకున్నారు. రాష్ట్రంలో పండిన సోనామసూరి వడ్లను రైతుల పేరుతో పాండిచ్చేరికి తరలిస్తున్నారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఎక్కడైనా విక్రయించుకునే వీలుంది. ఈ నిబంధనను ఉపయోగించుకున్న వ్యాపారులు రైతుల పేరుతో సోనామసూరి వడ్లను పాండిచ్చేరికి భారీగా తరలిస్తున్నారు. ధాన్యాన్ని అక్కడ మిల్లింగ్ చేసి చివరకు కాండ్లారేవుకుపంపిస్తున్నట్లు వ్యాపార వర్గాలే చెబుతున్నాయి. పాండిచ్చేరిలో బియ్యం తరలింపుపై ఎలాంటి నిబంధనలు లేకపోవడం వ్యాపారులకు వరంగా మారింది.
ఏడాది కిందటే తెలిసినా...
కాండ్లారేవు వద్దకు చేర్చిన టన్ను సన్నబియ్యానికి బడా వ్యాపారులు వెయ్యి డాలర్ల చొప్పున చెల్లిస్తున్నారు. మరోవైపు దుబాయ్‌లో సన్నబియ్యం కేజీ రూ.120 పలుకుతోంది. అంటే భారత కరెన్సీలో లెక్కిస్తే కిలో బియ్యాన్ని అక్రమంగా రూ.45కి కొనుగోలు చేసిగల్ఫ్‌లో రూ.120 చొప్పున విక్రయిస్తున్నారు. కొద్దిగా కష్టపడితే పెద్దఎత్తున డబ్బులు వస్తుండటంతో కాండ్లా రేవు వరకూ ఎలాగోలా సన్నబియ్యాన్ని తరలించటానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో కొందరు అధికారులకు భారీగానే ముడుపులు ముడుతున్నట్లు చెబుతున్నారు. నల్గొండ, నిజామాబాద్ జిల్లాల నుంచే కాకుండా రాయలసీమ, కోస్తాలో ఉత్పత్తి అయిన బియ్యం కూడా కాండ్లాకు చేరుతున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం కొద్దిరోజుల క్రితం జిల్లా స్థాయిలోని విజిలెన్సు అధికారుల దృష్టికి కూడా వచ్చింది. ఏడాది కిందట ముంబయి రేవు నుంచి రాష్ట్ర వ్యాపారులు కొందరు దుబాయ్‌కు రూ.కోట్ల విలువైన బియ్యాన్ని తరలించారని విజిలెన్సు విచారణలో వెలుగు చూసింది. దీనిపై అప్పటి పౌరసరఫరాలశాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య తీవ్రంగా స్పందించి పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించిన చర్యలకు సన్నద్ధమయ్యారు. అధికార పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడితో ఈ ఫైలు మూలనపడింది. ఫలితంగా సంబంధితులపై చర్యలు తీసుకోలేదు.
మిల్లర్ల ముందస్తు వ్యూహం
ఉప్పుడు బియ్యం నిల్వలను లారీల్లో పొరుగు రాష్ట్రాలకు తరలించివిక్రయించటానికి అనుమతి కోసం మిల్లర్లు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. మిల్లర్లకు మొదటి నుంచి అండదండగా ఉన్న పౌరసరఫరాలశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి లారీల్లో బియ్యం తరలించడానికి అవకాశం కల్పించమని సూచిస్తూ ప్రభుత్వానికి ఇటీవలే ప్రతిపాదనలు కూడా పంపించారు. దీన్ని మంత్రివర్గ ఉపసంఘం కూడా ఆమోదించింది. అనంతరం ఈ అనుమతులను ముఖ్యమంత్రి రోశయ్య నిలిపి వేశారు. శనివారం కొందరు మిల్లర్లు కమిషనర్ సంజయ్‌జాజును కల్సి లారీల్లో బియ్యం తరలించటానికి అనుమతి ఇవ్వకపోతే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలును నిలిపి వేస్తామని హెచ్చరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పది లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం నిల్వలు ఉన్నాయి. నిల్వలు అధికంగా ఉండటంతో వినియోగదారులకు రూ.22కే పచ్చి బియ్యం లభ్యమవుతున్నాయి. కాండ్లా రేవు నుంచి దుబాయికి బియ్యం నిల్వలు తరలిపోతే మళ్లీ రాష్ట్రంలో పచ్చిబియ్యం ధర భగ్గుమనే ప్రమాదం ఉంది. లారీల్లో బియ్యం తరలింపు విషయంలో ముఖ్యమంత్రి కఠిన వైఖరి అనుసరించకుంటే భవిష్యత్తులో సన్నబియ్యం ధరలకు రెక్కలొచ్చి ప్రజలు అల్లాడక తప్పదని నిపుణులుహెచ్చరిస్తున్నారు.