Monday, April 5, 2010

పారిశ్రామికవేత్తలకు ఫ్యాప్సీ అవార్డులు

నేడు ముఖ్యమంత్రి రోశయ్య
చేతుల మీదుగా ప్రదానం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: వివిధ రంగాల్లో ప్రత్యేకత చూపిన పారిశ్రామిక సంస్థలు, కంపెనీలతో పాటు కొందరు వృత్తి నిపుణులకు ఆంధ్ర ప్రదేశ్‌ పారిశ్రామిక, వర్తక మండళ్ల సమాఖ్య (ఫ్యాప్సీ) అవార్డులను ప్రకటించింది. ఆయా సంస్థలు, వ్యక్తులు 2008-09లో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు ఫ్యాప్సీ ఛైర్మన్‌ కె.హరిశ్చంద్ర ప్రసాద్‌, అవార్డుల కమిటీ కో-ఛైర్మన్‌ కె.ఎల్‌.కె.ప్రసాద్‌లు ఆదివారమిక్కడ తెలిపారు. నేటి సాయంత్రం రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ సమావేశ మందిరంలో జరిగే 92వ వార్షిక సమావేశంలో ముఖ్యమంత్రి కె.రోశయ్య అవార్డులను ప్రదానం చేస్తారు.

సౌభాగ్య అమినో ఇన్‌పుట్స్‌కు
ఆల్‌రౌండ్‌ పెర్‌ఫామెన్స్‌ అవార్డు
అధిక పారిశ్రామికోత్పత్తి విభాగంలో అవార్డును గుంటూరుకు చెందిన చైతన్య ప్యాకేజింగ్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ గెలుచుకుంది. అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరును కనబరిచినందుకు సౌభాగ్య అమినో ఇన్‌పుట్స్‌కు ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఆల్‌రౌండ్‌ పెర్‌ఫామెన్స్‌ అవార్డు దక్కనుంది. కార్మిక సంక్షేమ అవార్డును బసంత్‌నగర్‌లోని కేశోరాం సిమెంట్స్‌ గెల్చుకొంది. ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఆర్‌ అండ్‌ డీ అవార్డును ఎంఎస్‌ఎన్‌ ల్యాబరేటరీస్‌ లిమిటెడ్‌, హైదరాబాద్‌కు ప్రకటించారు. ఇన్‌ఫ్రానిక్స్‌ సిస్టమ్స్‌కు చిన్నతరహా పరిశ్రమల విభాగంలో ఎక్సలెన్స్‌ ఇన్‌ ఆర్‌ అండ్‌ డీ అవార్డు ఇవ్వనున్నారు. నవభారత్‌ వెంచర్స్‌, బయోకెమికల్‌ అండ్‌ సింథటిక్‌ ప్రోడక్ట్స్‌లకు అవుట్‌స్టాండింగ్‌ ఎక్స్‌పోర్ట్‌ పెర్‌ఫామెన్స్‌ అవార్డు ఇస్తారు. ప్రోడక్ట్‌ ఇన్నోవేషన్‌ విభాగంలో టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌- హైదరాబాద్‌, జెటాటెక్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ అవార్డులు సాధించాయి. గ్రామీణాభివృద్ధి అవార్డును నవభారత్‌ వెంచర్స్‌, ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ మార్కెటింగ్‌ అవార్డును శ్రీ బయోటెక్‌ ల్యాబరేటరీస్‌, టర్న్‌అరౌండ్‌/ ఖాయిలా నుంచి కోలుకున్న సంస్థకు ఇచ్చే అవార్డును పూల్లా కెమికల్స్‌, హైదరాబాద్‌ ఎంపిక అయ్యాయి. ప్రగతి గ్రీన్‌మెడోస్‌కు పర్యావరణ అవార్డు లభించనుంది.

ఉత్తమ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ కంపెనీ అవార్డు 7సీస్‌కు
గేమింగ్‌ కంపెనీ 7సీస్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ ఉత్తమ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కంపెనీ అవార్డుకు ఎంపికైంది. ఆరోగ్య సేవల విభాగంలో వెంకటేశ్వర అయుర్వేద నిలయం, చింతలూరు, తూర్పు గోదావరి జిల్లాకు అవార్డు లభించింది. వ్యక్తిగత విభాగంలో విశేష నైపుణ్యాన్ని కనబరచినందుకు డాక్టర్‌ ఎస్‌. చంద్రశేఖర్‌ (డిప్యూటీ డైరెక్టర్‌, ఐఐసీటీ, హైదరాబాద్‌), ఆర్తీ పాటిల్‌ (ఎండీ, ఐకాన్‌ యాక్సెసరీస్‌), గూడూరి నళినేశ్‌ బాబు (కృత్రిమ అవయవాల తయారీ నిపుణుడు, గురుదేవ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌, విజయనగరం)లకు ఫ్యాప్సీ అవార్డులు లభించనున్నాయి.