సత్యం కంప్యూటర్‌ను ఎందుకు నిలదీయలేదు!
బ్యాంకులపై ఐసీఏఐ కమిటీ ఆగ్రహం న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్‌కు రుణాల మంజూరులో ఆయా బ్యాంకులు తగిన అధ్యయనం జరపలేదని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) దర్యాప్తు సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సత్యం కంప్యూటర్ ఖాతా పుస్తకాల కుంభకోణంపై దర్యాప్తు జరిపిన కమిటీ, రుణ మంజూరు విషయంలో బ్యాంకుల వ్యవహార సరళిని ఆక్షేపించింది. ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ ప్రకారం నిధులు దండిగా ఉన్న కంపెనీ (సత్యం) ని స్వల్పకాలిక రుణాలు ఎందుకు తీసుకుంటున్నట్లు బ్యాంకులు ఎక్కడా ప్రశ్నించినట్లు కనిపించలేదని ఐసీఏఐ దర్యాప్తు కమిటీ తప్పుబట్టింది. 2000-08 మధ్య 'సత్యం' తన వద్ద భారీ ఎత్తున మిగులు నిధులు ఉన్నట్లు చెప్పుకొన్నప్పటికీ, ఆ కంపెనీకి మొత్తం రూ.1,221.16 కోట్ల మేరకు రుణాలను అందజేసిన సంస్థల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సిటీ బ్యాంక్, సిటీకార్ప్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బీఎన్‌పీ పారిబస్ లు ఉన్నాయి. కుంభకోణం తర్వాత అత్యధిక రుణదాత హెచ్‌డీఎఫ్‌సీ గ్రూపు అధినేత దీపక్ పారేఖ్‌ను బోర్డులో స్వతంత్ర డైరెక్టరుగా నియమించడమేమిటి అని కూడాఉన్నత స్థాయి కమిటీ ప్రశ్నించింది.