Monday, April 5, 2010

పట్టిందల్లా బెల్లం

రూ.100 కోట్లు దాటిన వ్యాపారం
అనకాపల్లి- న్యూస్‌టుడే
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విశాఖ జిల్లా అనకాపల్లి మార్కెట్‌లో 2009-10 సీజన్‌లో రికార్డుస్థాయిలో అమ్మకాలు సాగాయి. మార్కెట్‌ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా వ్యాపారం రూ.100 కోట్లకు పైగానే జరిగింది. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ మార్కెట్‌లో ఎప్పుడు ఇంతటి స్థాయిలో జరగలేదు. ఈ ఏడాది రూ.103 కోట్లు విలువైన బెల్లం అమ్మకాలు చేశారు. దీనికి ప్రధాన కారణం ధరలు భారీగా పెరగడమే. దేశంలో ఉత్తరప్రదేశ్‌లోని ఆపూర్‌ మార్కెట్‌ ప్రథమ స్థానంలో ఉండగా అనకాపల్లి ద్వితీయ స్థానంలో నిలుస్తోంది. ఇక్కడకు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల నుంచి రైతులు బెల్లం తీసుకు వస్తారు. సీజన్‌లో రోజుకు సరాసరి 25 వేల దిమ్మలు వస్తాయి. ఒక్కొక్క దిమ్మ బరువు 13 నుంచి 16 కిలోలు ఉంటుంది. మార్కెట్‌కు ఎంత బెల్లం వచ్చినా ఏ రోజు అమ్మకాలు ఆ రోజే ముగిస్తారు. యార్డుకు బెల్లం తెచ్చిన 12 గంటలలోపు రైతుకు డబ్బు చెల్లిస్తారు. ఈ కారణం చేతనే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మార్కెట్లు ఉన్న రైతులు అనకాపల్లి యార్డుకే బెల్లం తీసుకు రావడానికి ఆసక్తి చూపుతారు. అయిదేళ్ల క్రితం మార్కెట్‌లో రూ.92.77కోట్లు విలువైన బెల్లం అమ్మకం సాగింది. ఆ తర్వాత నుంచి వ్యాపారం తగ్గుతూ వస్తుంది. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం దాదాపు రూ.18.44కోట్ల లావాదేవీలు ఎక్కువగా జరిగాయి.

భారీగా పెరిగిన ధరలు
గతంలో ఎప్పుడు లేని విధంగా 2009-10 సీజన్‌లో సరాసరి వందకిలోలు రూ.2,730లు పలికాయి. గత ఏడాదితో పోల్చితే వెయ్యి రూపాయలు అధికం. ఇంత భారీగా ధరలు మార్కెట్‌లో గతంలో ఎప్పుడు లేవు. దేశవ్యాప్తంగా చెరకు ఉత్పత్తి తగ్గడంతో పంచదార, బెల్లానికి డిమాండ్‌ ఏర్పడింది. ఫలితంగా ధరలు పెరిగాయి. అనకాపల్లి మార్కెట్‌ నుంచి రాష్ట్రంలోని ఖమ్మం, రాజమండ్రి, భద్రాచలంతో పాటు మధ్యప్రదేశ్‌లోని రాయపూర్‌, రాజనందగం, ఒరిస్సా రాష్ట్రంలో బరంపురం, కటక్‌, కోరాపుట్‌, భువనేశ్వర్‌, పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కత్తా, జార్కండ్‌లోని రాంచీ, మహారాష్ట్రలోని అమరావతి, నాగపూర్‌ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, తలోడ్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.