నిబంధనలు పాటించకపోతే చర్యలు
బ్యాంకుల్లో నల్లధన ప్రవాహాన్ని అరికట్టి, బినామీ అకౌంట్లు తెరిచే వీలు లేకుండా చేసేందుకు ఆర్‌బీఐ కేవైసీ నిబంధనలను రూపొందించింది. నిబంధనలను పాటించకపోతే బ్యాంకులపై ఆర్‌బీఐ భారీ అపరాధ రుసుము విధించడంతో పాటు ఇతరత్రా చర్యలు తీసుకుంటుంది. గతంలో ఈ నిబంధనలు పాటించని కొన్ని బ్యాంకులపై చర్యలు తీసుకుంది కూడా. దీంతో ఇటీవల పలు బ్యాంకులు పాత ఖాతాలపై దృష్టి పెట్టాయి. గతంలో (కేవైసీ నిబంధనలకు పూర్వం) పొదుపు ఖాతాలను ప్రారంభించేందుకు నివాస ధ్రువపత్రాలు, ఇతరత్రా ఫొటో గుర్తింపుకార్డులు సమర్పించాల్సిన అవసరం ఉండేది కాదు. పాత ఖాతాల్లో నిబంధనల మేరకు కావలసిన ధ్రువపత్రాలను సమర్పించాలని, లేకుంటే ఖాతాలను స్తంభింపచేస్తామని బ్యాంకులు లేఖలు పంపుతున్నాయి. కొన్ని బ్యాంకులు పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నాయి. ఎస్‌బీఐ కొద్ది కాలం క్రితం అవసరమైన ధ్రువపత్రాలను, ఇతర సమాచారాన్ని నిర్ణీత గడువు లోపు అందించని ఖాతాదారులకు ఖాతా లావాదేవీలను నిలుపు చేస్తామంటూ ఒక ప్రకటనను జారీ చేసింది. ఖాతా తెరిచేందుకు వచ్చే వారి గురించి క్షుణ్నంగా తెలుసుకొని సంబంధిత ధ్రువపత్రాలు ఉంటేనే బ్యాంకులు కొత్త ఖాతాల్ని ప్రారంభిస్తున్నాయి.
వెంటనే స్పందించాలి: పాత ఖాతాలు కేవైసీ నియమావళికి లోబడి లేకపోతే బ్యాంకులు వాటిని ఎప్పుడైనా నిలిపివేసే అవకాశం ఉన్నందున ఖాతాదారులు సంబంధిత సమాచారాన్ని అవసరమైనప్పుడు అందించేందుకు వీలుగా ధ్రువపత్రాలను, ఇతరత్రా డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా పాత ఖాతాల విషయంలో బ్యాంకులు ఎప్పుడైనా కొన్ని ధ్రువపత్రాలను కోరవచ్చు. అందువల్ల రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను, ఫొటో గుర్తింపు కార్డు (పాన్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్ట్‌పోర్టుల వంటివి), నివాస సంబంధిత ధ్రువపత్రాలను (టెలిఫోన్ బిల్లు, విద్యుత్తు బిల్లు, రేషన్ కార్డు వంటివి) సిద్ధంగా ఉంచుకోవడం మేలు. అంతేకాక గతంలో బ్యాంకు ఖాతాలో పేర్కొన్న ఇంటి చిరునామాను ఒకసారి సరిచూసుకోండి. ఏవైనా మార్పులు ఉంటే వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి. ఖాతాలను స్తంభింపచేసే పరిస్థితి రాకుండా ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సందర్భాలలో అవసరమైన సమాచారాన్ని అందించినప్పటికీ బ్యాంకులు సకాలంలో ఖాతాలను అప్-డేట్ చేయకపోవచ్చు. తత్ఫలితంగా ఖాతాదారులు కొన్ని ఇబ్బందులకు గురవుతున్నారు.
పాన్ లేకుంటే కష్టం
బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై మూలంలోనే పన్ను మినహాయింపు (టీడీఎస్) విధిస్తాయి. డిపాజిట్ల వడ్డీ ఆదాయం సాలీనా కొంత పరిమితిని మించితే టీడీఎస్ ఉంటుంది. సాధారణంగా వడ్డీ ఆదాయంపై 10 శాతం పన్ను కోత ఉంటుంది. కానీ డిపాజిట్ ఖాతాకు సంబంధించిన ఖాతాదారుకు ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే శాశ్వత ఖాతా సంఖ్య (పర్మినెంట్ అకౌంట్ నెంబర్ -పాన్) లేనట్లయితే బ్యాంకులు వడ్డీ ఆదాయంపై 20% పన్ను కోత విధిస్తాయి. ఈ నిబంధన కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలు కానుంది. కాబట్టి డిపాజిట్‌దారులు అప్రమత్తంగా ఉండాలి. గతంలో పాన్‌ను బ్యాంకులకు సమర్పించినప్పటికీ మరోసారి సరిచూసుకోవడంతో పాటు కొత్తగా ప్రారంభించే డిపాజిట్ అకౌంట్లకు పాన్ ధ్రువపత్రాన్ని జత చేయాల్సి ఉంటుంది కూడా. ఇప్పటిదాకా ఈ నంబర్ లేని డిపాజిటర్లకు అధిక పన్ను కోత తప్పదు. అధిక పన్ను కోత విధానంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిబంధనను రద్దు చేసే అవకాశం లేకపోలేదు. ఏదిఏమైనా, పాన్ లేని వారు అందుకోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది.