Saturday, April 3, 2010

ప్రమోటర్లు మహా మాయగాళ్లు...

సిబిఐ చెబుతున్న వివరాల ప్రకారం 2004-2006 మధ్య విశాల్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోటర్లు ఈ బ్యాంకు స్కామ్‌కు పాల్పడ్డారు. బ్యాంకులను ముంచడానికి ముందుగానే పద్ధతి ప్రకారం ఇన్వెస్టర్లను కూడా నిండా ముంచారు. 2004 మేలో ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఇష్యూ సమయంలో కొత్త ఈక్విటీని జారీ చేయకుండా తెలివిగా ప్రమోటర్లే తమ వాటా షేర్లను మార్కెట్‌లో తెగనమ్మారు.

5 రూపాయల ముఖ విలువగల షేరును 40 రూపాయల ప్రీమియంతో విక్రయించారు. మొత్తం 5.65 కోట్ల షేర్లను అమ్మడం ద్వారా 254 కోట్ల రూపాయల మేర దండుకున్నారు. మొత్తం ఈక్విటీలో 25 శాతం వాటాను ఈ విధంగా పబ్లిక్‌కు అంటగట్టిన ప్రమోటర్లు ఆ తర్వాత కొద్ది రోజులకే షేర్లను ఒక రూపాయి ముఖ విలువకు విభజించారు. షేర్ల విభజన దరిమిలా 2005లో ప్రతి షేరుకు రెండు షేర్ల చొప్పున బోనస్ ఇష్యూ జారీ చేశారు.

అంటే కంపెనీలో తెలివిగా తమ వాటాను పెంచుకున్నారన్నమాట. ఈ తంతు పూర్తికాగానే ఓపెన్ మార్కెట్‌లో తమ వాటాల విక్రయం ప్రారంభించారు. 2007 నుంచి వారి వాటా ఒక్కసారిగా 20 శాతం దిగువకు పడిపోయింది. ప్రస్తుతం ప్రమోటర్ల వాటా 14 శాతం లోపే. 86 శాతం వాటా పబ్లిక్ దగ్గరే ఉంది. అంటే ఎంత తెలివిగా జనాన్ని దగా చేసారో అర్ధం చేసుకోవచ్చు.

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు తోడుగా విండ్ పవర్ అంటూ, జల విద్యుత్ అంటూ రంగుల కలలను ఆవిష్కరిస్తూ ఇన్వెస్టర్లను మురిపించి మరీ దగా చేశారు. రూపాయి ముఖ విలువగల ఈ షేరు ధర గురువారం నాటి క్లోజింగ్ ప్రకారం 89 పైసలు.