Saturday, April 3, 2010

ఇళ్ళ రుణాల జాతర ముగిసింది

నిన్న మొన్నటి వరకూ కాస్తంత జోరుగా కొనసాగిన ఇళ్ళ రుణాల జాతర ముగిసిపోయింది. మధ్యతరగతి ప్రజానీకాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని పలు బ్యాంకులు ఇటీవలి కాలంలో ఇళ్ళ రుణాల కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టాయి. టీజర్‌ స్కీమ్‌ (ఆరంభంలో వడ్డీరేటు తక్కువగా ఉండడం)లు కూడా వచ్చాయి. ఇలాంటి స్కీమ్‌లపై రిజర్వు బ్యాంక్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖాతాదారులందరికీ ఒకే విధమైన సేవలు అందించాలన్న భావనకు ఈ స్కీమ్‌లు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు ఇళ్ళ రుణాల ప్రత్యేక స్కీమ్‌లను మార్చి 31తో నిలిపివేశాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాత్రం ఏప్రిల్‌ నెలాఖరు దాకా ఈ స్కీమ్‌లను కొనసాగించే అవకాశం ఉంది.

ప్రత్యేక పథకాలపై రుణమొత్తంతో సంబంధం లేకుండా మొదటి ఏడాది 8 శాతం వడ్డీ, ఆ తరువాతి రెండేళ్ళకు 9 శాతం వడ్డీ వసూలు చేస్తారు. గతంలో ఎస్‌బీఐ రుణ మొత్తం గనుక రూ. 50 లక్షల కంటే తక్కువగా ఉంటే, రెండో, మూడో ఏడాదికి 8.5శాతం వడ్డీ వసూలు చేసేది. రూ. 50 లక్షలను మించితే 9 శాతం వడ్డీ విధించేది. నాలుగో ఏడాది నుంచి అప్పటికి అమల్లో ఉండే వడ్డీరేట్లు వర్తిస్తాయి. ఇలాంటి ప్రత్యేక పథకాలపై ఆర్‌బీఐ అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో వీటిని ఉపసంహరించుకున్నట్లు ఓ బ్యాంక్‌ ఉన్నతాధికారి తెలిపారు. తమ వద్ద తగినన్ని నిధులు ఉన్న నేపథ్యంలో ఈ ప్రత్యేక స్కీమ్‌ను మరికొంత కాలం కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ఎస్‌బీఐ అధికారి ఒకరు తెలిపారు. రూ. ఐదులక్షల లోపు ఇళ్ళ రుణాలకు మాత్రం ఈ ప్రత్యేక పథకాన్ని ఎస్‌బీఐ నిలిపేసింది. ఏప్రిల్‌ 20న ఆర్‌బీఐ తన వార్షిక ద్రవ్య విధానాన్ని ప్రకటించిన అనంతరం ప్రత్యేక స్కీమ్‌లపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఎస్‌బీఐ వర్గాలు తెలిపాయి.