కొత్త వాటికి అనుమతి తప్పనిసరి
సెబి తాజా ఆదేశం
ముంబై : యులిప్‌ల వివాదం మళ్లీ మొదటికొచ్చింది. యులిప్‌ల వివాదాన్ని కోర్టులో పరిష్కారించుకుంటాయని ఆర్థిక శాఖ ప్రకటించి ఇరవై నాలుగు గంటలైనా గడవక ముందే నియంత్రణా సంస్థలు దానికి తూట్లు పొడిచాయి.
సెబి ఉత్తర్వులను పట్టించుకోకుండా కార్యకలాపాలు యధావిధిగా సాగించాలని బీమా కంపెనీలకు ఐఆర్‌డిఎ సూచించగా దానికి ప్రతిగా ఏప్రిల్ 9 తర్వాత వచ్చే కొత్త యులిప్‌లకు తమ అనుమతి తప్పనిసరని సెబి తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. యులిప్‌లను జారీ చేయకుండా నిషేధం విధించిన 14 కంపెనీల నుంచి వచ్చే కొత్త పాలసీలపైన నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.
ఏప్రిల్ 9 వరకు వచ్చిన యులిప్‌లపై యధాతథ స్థితి ఉంటుందని సోమవారం ప్రకటించిన సెబి, ఆ తర్వాత వచ్చే కొత్త పాలసీలకు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు యులిప్‌లపై నిషేధం అమల్లో ఉంటుందని, ప్రస్తుతానికి ఈ అంశాన్ని అమలు చేయబోవటం లేదని సెబి ఇన్వెస్టర్లకు సూచించింది. సెబి తాజా ఉత్తర్వులపై ప్రణబ్ ముఖర్జీని అడుగగా సెబి ఎలాంటి సర్క్యులర్ విడుదల చేసిందో తెలియదని, దానిని పరిశీలించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రభావం పడుతుంది..
ఈ నెల 9 తర్వాత విడుదల చేసే కొత్త యులిప్ పథకాలకు సంబంధించి సెబి అనుమతి తీసుకోవాల్సిందేనని మార్కెట్ నియంత్రణ సంస్థ ఉత్తర్వులో స్పష్టం చేసింది. నిషేధానికి గురైన 14 కంపెనీలు కూడా కొత్త పాలసీలను మార్కెట్లోకి తీసుకు రావాలనుకుంటే వారికి కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని సెబి పేర్కొంది. సెబి తాజా ఉత్తర్వులపై ప్రతిస్పందించటానికి ఐఆర్‌డిఎ చైర్మన్ జె హరినారాయణ అందుబాటులో లేరు.
మార్కెట్ నియంత్రణ సంస్థ జారీ చేసిన కొత్త ఉత్తర్వులతో ఏడాది, రెండేళ్ల కిందట కార్యకలాపాలు ప్రారంభించిన బీమా కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తెలిపింది. కొత్త కంపెనీలు చాలా పాలసీలను అమ్మటానికి సన్నద్దంగా లేవని, ఈ ఉత్తర్వుల మూలంగా వీరిపై ప్రభావం పడుతుందని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ ఎస్‌బి మాథూర్ అన్నారు.
తాజా ఉత్తర్వులతో కోర్టుకు వెళ్లాలా వద్దా అనేది నియంత్రణా సంస్థలైన సెబి,ఐఆర్‌డిఎలపైనే ఆధారపడి ఉందని తెలిపారు. మరోవైపు సెబి ఉత్తర్వుల మూలంగా లక్షలాది మంది ఇన్వెస్టర్లు ఇబ్బందులకు గురవుతారని తక్షణమే యులిప్‌లపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ బొంబాయి హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. 2008-09లో 90,945 కోట్ల రూపాయల మొత్తం ప్రీమియంతో 7.03 కోట్ల యులిప్ పాలసీలు ఉన్నాయి. 2009-10 ఏప్రిల్- ఫిబ్రవరి కాలంలో 44,611 కోట్ల ప్రీమియంతో 16.7 లక్షల పాలసీలను బీమా కంపెనీలు విక్రయించాయి.
రెండు రోజుల్లో కార్యాచరణ : ఐఆర్‌డిఎ
యులిప్‌ల వివాదంపై తదుపరి కార్యాచరణను మరో రెండు ప్రకటిస్తామని ఐఆర్‌డిఎ తెలిపింది. యులిప్‌ల అంశాన్ని కోర్టులో తేల్చుకోవాలని ప్రభుత్వం ఇరు సంస్థలకు సూచించటంతో నిర్ణయం తీసుకోవటానికి రెండు రోజులు పట్టవచ్చని ఐఆర్‌డిఎ మెంబర్ ఆర్ కన్నన్ అన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచనలకు అనుగుణంగా పరిస్థితులను పరిశీలించటానికి పలు మార్గాలను పరీక్షిస్తున్నట్లు కన్నన్ వెల్లడించారు.