Monday, April 5, 2010

ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్దపీట

ప్రత్యేక పాలసీకి సన్నాహాలు
ఆర్థిక సంవత్సరాంతానికి రెడీ...

న్యూఢిల్లీ : శిలాజ ఇంధనాలు నానాటికీ అంతరించిపోతుండటంతో పాటు వాటి ద్వారా ఏర్పడుతున్న కాలుష్యం కారణంగా ఇప్పుడు అందరి దృష్టి ప్రత్యామ్నాయ ఇంధనాలు, ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలపై పడింది. ఇందులో భాగంగానే దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా ఒక విధానాన్ని తీసుకురావటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ సాధ్యాసాధ్యాల నివేదికను పరిశీలిస్తోంది.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఎలా ప్రమోట్ చేయాలనే అంశానికి అనుగుణంగా ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కొత్త పాలసీ అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించేందుకు వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో కోర్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ గ్రూప్‌లో నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంపిటీటివ్‌నెస్ కౌన్సిల్ (ఎన్ఎంసిసి) సహా రోడ్ ట్రాన్స్‌పోర్ట్, పెట్రోలియం, భారీ పరిశ్రమలు, పర్యావరణ శాఖలకు చెందిన ప్రతినిధులున్నారు.

ప్రస్తుతం ఎన్ఎంసిసి సాధ్యాసాధ్యాల నివేదికను పరిశీలిస్తుండగా విధాన ముసాయిదా, అమలును భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ చేపడుతుందని ఆ వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశోధన,అభివృద్ధిని ప్రోత్సహించటానికి అవసర మైన మార్గాలు వెతకటంతో పాటు ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ రంగానికి కావలిసిన ప్రోత్సాహకాలు అందించటంపై కూడా ఈ కోర్ గ్రూప్ పరిశీలిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మాన్యుఫ్యాక్చరింగ్‌లో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేయటంతో పాటు టెక్నాలజీ బదలాయింపు వంటి అంశాలను ఈ విధానంలో చేర్చనున్నట్లు పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధిని ప్రోత్సహించటానికి కావలిసిన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దేశవ్యాప్తంగా చార్జింగ్ పాయింట్లను నెలకొల్పే అవకాశాలపై ఈ నివేదిక దృష్టి సారిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే కోర్ గ్రూప్ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించటానికి అన్ని రాష్ట్రాలతో చర్చలు నిర్వహించింది.

సుంకాలు ఎక్కువే...
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిపై 4 శాతం ఎక్సైజ్ సుంకాలు విధిస్తుండగా ఎలక్ట్రిక్ వాహనాల కాంపోనెట్లపై 10 శాతం ఎక్సైజ్ సుంకాలను విధిస్తుండటం గమనార్హం. దీంతో కాంపోనెట్లపై విధిస్తున్న సుంకాలకు మినహాయింపు ఇవ్వాలని ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలపై 14 శాతం సుంకాలుండగా విడిభాగాల దిగుమతిపై 4 శాతం సుంకాలను విధిస్తున్నారు.

ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్ సహా లక్షద్వీప్ రాష్ట్రాలు సేల్స్ టాక్స్‌పై ఎలాంటి లెవీ విధించటం లేదు. కాగా ఇతర రాష్ట్రాలు మాత్రం సేల్స్ టాక్స్ లేదా వ్యాట్ పేర 4 నుంచి 15 శాతం వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే దేశంలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు రాష్ట్రాల నుంచి ఏ మాత్రం తోడ్పాటు లభించటం లేదని సత్వరమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ రంగానికి మద్దతునివ్వాలని సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎస్ఎంఇవి) ప్రెసిడెంట్ నవీన్ ముంజాల్ కోరారు.

వచ్చే మూడు ఐదేళ్లలో ఈ పరిశ్రమకు సముచిత స్థానం లభిస్తుందని ఇందుకు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా తోడయితే మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ సైజు ఏటా 85 వేల యూనిట్లుగా ఉంది. కాలుష్య రహిత రవాణాను ప్రభుత్వం ప్రోత్సహిస్తే వచ్చే రెండు మూడేళ్లలో ఈ రంగం రెండు మూడు రెట్లు వృద్దిని నమోదు చేసుకుంటుందని ఎస్ఎంఇవి డైరెక్టర్ సోహిందర్ గిల్ తెలిపారు.