మాంద్యం పూర్తిగా పోలేదు
ఐఎంఎఫ్ సారథి అమ్మాన్: మాంద్యం ఇంకా పూర్తి స్థాయిలో తొలగిపోలేదనిఅంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అధినేత డోమినిక్ స్ట్రాస్ కాన్ అన్నారు. అంచనాల కన్నా వేగంగా అభివృద్ధి చెందుతున్న, వర్ధమాన దేశాలు మాంద్యం నుంచి కోలుకుంటున్నప్పటికీ ప్రైవేటు గిరాకీ ఇంకా పూర్తి స్థాయిలో బలేపోతం కాలేదని ఆయన అన్నారు. అన్ని రంగాల్లోనూ వృద్ధి కనిపిస్తున్నప్పటికీ అవి మాంద్యాన్ని అధిగమించిన స్థాయిలో లేవని ఆయన తెలిపారు. ప్రైవేటు గిరాకీ వృద్ధిని నిలిపే స్థాయికి చేరే వరకు మాంద్యం ముగిసిందని చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు. మాంద్యం నుంచి కోలుకుంటుండడాన్ని విశ్లేషించిన ఐఎంఎఫ్, జనవరిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని 3.1 శాతం నుంచి 3.9 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఆర్థిక మాంద్యం ఇపుడిపుడే దూరమవుతున్నందున ఇంకా అప్రమత్తతతోనే ఉండాలని కాన్ సూచించారు. మాంద్యం నుంచి పూర్తిగా కోలుకోక ముందే కనిపిస్తున్న వృద్ధి ఆయా ప్రభుత్వాలను ఉద్దీపనల్ని తొందరగా వెనక్కి తీసుకొనేలా ప్రేరేపించవచ్చని ఆయన చెప్పారు. అయితే ఇలా చేస్తే ముప్పు కలుగుతుందన్నారు. ఇది 'తాను ఉన్న కొమ్మను తానే నరుక్కున్నట్లు' అవుతుందని కాన్ హెచ్చరించారు.