Monday, April 5, 2010
రత్నాలు, ఆభరణాల ఎగుమతులు మెరుగు
న్యూఢిల్లీ: భారత రత్నాలు, ఆభరణాల ఎగుమతులు వరుసగా నాలుగో నెలా తళుకులీనాయి.. పశ్చిమ దేశాల మార్కెట్‌లలో గిరాకీ పెరగడంతో ఫిబ్రవరిలో ఈ విభాగం ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 55 శాతం వృద్ధితో 2.2 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా అమెరికా, యూరోప్ వంటి అనేక కీలక మార్కెట్‌లకు ఆభరణాల ఎగుమతులు తగ్గిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 2009 సంవత్సరంలో తక్కువ పరిమాణంలో జరిగిన కన్‌సైన్‌మెంట్లతో పోల్చి చూస్తే ఫిబ్రవరి ఎగుమతులు ఆకర్షణీయంగా ఉన్నట్లు రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ఛైర్మన్ బసంత్ మెహతా చెప్పారు. రానున్న రెండు, మూడు నెలల్లో పశ్చిమ దేశాలు, రష్యా, చైనాల నుంచి ఎగుమతిదారులు క్రిస్మస్ ఆర్డర్లను బుకింగ్ చేసుకోవడం ప్రారంభిస్తే పరిస్థితులు మెరుగుపడవచ్చన్నారు. చైనా, రష్యాల్లో వజ్రాలు, వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలకు మంచి గిరాకీ ఉందన్నారు. ఈ విభాగం నుంచి భారత్ చేస్తున్న మొత్తం ఎగుమతుల్లో అత్యధికంగా 31 శాతం యూఈఏకి వెళ్తుండటం గమనార్హం. ఆ తరువాతి స్థానాల్లో హాంకాంగ్, అమెరికాలు ఉన్నాయి.