Monday, April 5, 2010
భారత్‌లో మరిన్ని ప్లాంట్లు: లక్ష్మీ మిట్టల్
లండన్: యార్సెలర్ మిట్టల్‌కు అత్యంత ఆసక్తిగల దేశాల్లో భారత్ ఒకటని ఆ సంస్థ అధిపతి లక్ష్మీ నివాస్ మిట్టల్ పేర్కొన్నారు. కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు అభివృద్ధి చెందుతున్న దేశాలవైపు దృష్టి సారిస్తున్నట్లు అందునా ముఖ్యంగా భారత్‌నే పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఆయన అన్నారు. 'ఐరోపా నుంచి మా కార్యకలాపాలను తరలించే ఉద్దేశం ఏమీ లేదు. అయితే మా వ్యాపారాలను ఎక్కువ శాతం వర్థమాన దేశాలవైపు తరలించడానికే ఇష్టపడతానని బ్రిటన్ పత్రిక టెలిగ్రాఫ్‌తో ఆయన పేర్కొన్నారు. 'మేం అక్కడ కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం. ఐరోపా, లాటిన్ అమెరికాల్లో కంటే ఎక్కువ వృద్ధిని అక్కడే చూడగలం. ముఖ్యంగా మేం భారత్, బ్రెజిల్‌లవైపే అడుగేయాలనుకుంటున్నామ'ని అన్నారు. ఐరోపాలో వృద్ధి మందగమనంలో ఉందని.. అదే భారత్ ,చైనాల్లో అయితే చాలా వేగంగా ఉందని, మాంద్యం నుంచి త్వరగా బయటపడ్డాయని మిట్టల్ కితాబునిచ్చారు. ఉక్కు ప్లాంట్ల ఏర్పాటుకు భారత్‌లో ఇప్పటికే గుర్తించిన ఒక ప్రదేశంలో నిర్మాణాన్ని మొదలు పెడతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే అక్కడ అనుమతులు పొందే దశలో ఉన్నామని వివరించారు. రూ.1.30 లక్షల కోట్ల అంచనా పెట్టుబడులతో భారత్‌లో కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేసే నిమిత్తం పనులు మొదలుపెట్టడానికి చాలా ఆతృతతో ఉన్నట్లు మిట్టల్ ఫిబ్రవరిలో ప్రకటించిన సంగతి విదితమే.