Friday, April 2, 2010

అప్పు కాని అప్పు తప్పవా తిప్పలు

ఎం.వి.దుర్గాప్రసాద్‌
ప్రముఖ న్యాయవాది
హామీగా ఉన్నంత మాత్రాన బాకీ మొత్తం తీర్చాలా? అసలు బాకీదారుడిని వదిలేసి హామీదారు నుంచి బాకీ వసూలు చేయడం ఏమిటి?పూచీగా ఉన్నా అప్పు తీసుకున్నట్లేనా? హామీదారుడికి హక్కులే లేవా?చాలామంది మదిలో మెదిలే ప్రశ్నలివి.
బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలన్నా.. చీటీ పాడుకోవాలన్నా హామీదారు ఉండాల్సిందే. ఉద్యోగానికి కూడా హామీ అవసరం పడుతోంది. మిత్రుడో, బంధువో అడిగారని మానవత్వంతో హామీగా ఉండటానికి సిద్ధపడుతుంటారు చాలామంది. అన్నీ సవ్యంగా సాగితే హామీ ఇవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బందులూ రావు. కానీ, రుణం తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించలేదనుకోండి. అప్పుడు వస్తాయి అసలైన కష్టాలు. హామీగా ఉన్న వ్యక్తికి నోటీసులు, దావాలు, ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరికలు. అప్పటికీ బాకీ వసూలు కాకపోతే ఆస్తుల్ని జప్తు చేయడంతోపాటు వాటిని అమ్మి బాకీ వసూలు చేసుకోవడానికి కూడా రుణదాతలకు అధికారం ఉంది. ముందుగా అసలు బాకీదారుపై చర్యలు చేపట్టి, ఫలితం లేకపోతేనే, నా జోలికి రమ్మని అనేందుకూ హామీగా ఉన్న మీకు అవకాశం లేదు. చట్టం కూడా మిమ్మల్ని సమర్థించదు. బాకీదారు తనఖా పెట్టిన ఆస్తులున్నాయి కాబట్టి, నన్ను వదిలెయ్యమని అడిగేందుకూ సాధ్యం కాదు. హామీ ఇచ్చారంటే రుణ గ్రహీతతో సమానమే. మీరూ బాకీ పడినట్లే. తీర్చక తప్పదంతే.

లేదా బాధ్యత
హామీదారుకేనా అన్ని బాధ్యతలు? అతనికేం హక్కులు లేవా? అనే అనుమానం మీకు రావచ్చు. రుణదాతకూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి.
* రుణగ్రహీత పరపతి చరిత్రను రుణదాత హామీదారు దృష్టికి తీసుకురావాల్సిందే. అలా చెప్పకపోయినా, తప్పుడు సమాచారం ఇచ్చి హామీ పొందినా అది చెల్లదు.
* బాకీ మొత్తాన్ని హామీగా ఉన్న వ్యక్తి చెల్లించినప్పుడు రుణదాత హక్కులన్నీ హామీదారుకు సంక్రమిస్తాయి. తనఖా పత్రాలు, ఇతర హక్కులను హామీదారుడికి అప్పజెప్పాల్సిన బాధ్యత రుణదాతదే. వీటి గురించి హామీదారుకు తెలిసినా, తెలియకపోయినా తేడా ఏమీలేదు. అలాంటి తనఖాలు, పూచీకత్తులు వగైరా రుణదాత పోగొట్టుకున్నా, వదులుకున్నా, ఆ విలువ మేరకు హామీదారు బాధ్యత కూడా రద్దయిపోతుంది.
* బ్యాంకులు అప్పు ఇచ్చేటప్పుడు సాధారణంగా బాకీదారు ఆస్తుల్ని, సరకుల్ని కుదువ పెట్టుకోవచ్చు. అతని మీద దావావేసి డిక్రీ పొందవచ్చు. ఆ తనఖా ఆస్తుల్ని, సరుకుల్ని పోగొట్టుకున్నా, డిక్రీని అమలు చేయకుండా కాలదోషం పట్టించినా, అమలుకు అర్జీ పెట్టి తగ్గించుకున్నా, మీరిచ్చిన హామీ రద్దయినట్లే.
* కేవలం బాకీదారుపై దావా వేయనంత మాత్రాన, అతనికి గడువు పొడిగించినందువల్లా, ఇతర హామీదార్లను వదిలి వేసినందువల్ల మీరు ఇచ్చిన హామీ రద్దు కాదు. మీ బాధ్యతల నుంచి విముక్తి కలగదు. అయితే మీ సమ్మతి లేకుండా బాకీదారును బాకీ నుంచి విముక్తి చేస్తే మీరూ విముక్తులయినట్లే.
* హామీ పొందిన రుణదాత మీదే కాదండోయ్‌! మీతో పాటు హామీ ఇచ్చిన సహ హామీదార్లపైన కూడా మీకు హక్కులున్నాయి. మొత్తం బాకీ మీరే కట్టేస్తే, లేదా మీ నుంచే వసూలు చేస్తే మీ సహ హమీదార్లందర్నీ, మీరు కట్టిన సొమ్మును సమానంగా భరించమని కోరవచ్చు. ఒకవేళ వారిది పరిమితమైన హామీ అయితే, అంటే వారి బాధ్యత ఫలానా మొత్తం దాట రాదని షరతు ఉంటే ఆ మొత్తం దాటకుండా మీరు రాబట్టుకోవచ్చు. ఇతర సహ హమీదార్లు ఉన్నట్లుగా మీకు ముందు తెలియాల్సిన అవసరం లేదు.

సంతకం పెడుతున్నారా? ఒక్క నిమిషం!
* బాకీదారు కట్టకపోయినా మీరు కట్టేందుకు సిద్ధమైతేనే హామీ ఇవ్వండి.
* మీ శక్తికి మించిన హామీలు ఇవ్వరాదు. ఒకవేళ తప్పకపోతే, మీ హామీకి పరిమితి అంటే వడ్డీతో కలిపి ఫలానా మొత్తం వరకే మీ హామీ అని షరతు పెట్టండి. మీకు సాధ్యమైతే ఇతర షరతుల్ని కూడా పెట్టుకోవచ్చు.
* బ్యాంకులు, సంస్థలు మీ ప్రత్యేక షరతుల్ని ఒప్పుకోవు. పైగా మీరు చట్టం ఇచ్చిన హక్కులన్నింటినీ వదులుకొన్నట్లుగా, హామీ పత్రాల్లో ముద్రించి మీతో సంతకం పెట్టించుకుంటారు. అలా వదులుకున్నట్లుగా రాసిన షరతులు, చట్ట సమ్మతమేనని, చెల్లుతాయని, సుప్రీంకోర్టు కూడా బాష్యం చెప్పింది. కాబట్టి, మోసం, దగా లాంటి సందర్భాల్లో తప్ప ఈ ఉచ్చు నుంచి తప్పించుకోవడం సాధ్యం అయ్యేపని కాదు.
* బాకీదారు ఆస్తులమ్మడానికి ప్రయత్నించినప్పుడు, వ్యాపారాన్ని, సరుకుల్ని లేదా నిధుల్ని అక్రమంగా మళ్లిస్తున్నప్పుడు బ్యాంకుకు, రుణదాతకి రాతపూర్వకంగా తెలియజేయండి. రిజిస్టరు పోస్టులో పంపి రశీదు పొందండి. బ్యాంకు తగు చర్యలు చేపట్టకుండా, బాకీదారు మళ్లింపు చర్యలకు అవకాశం కల్పిస్తే, మీరు విముక్తి పొందేందుకు అవకాశం ఎక్కువ.
* మీరు హామీ ఇచ్చేప్పుడు కనీస సొమ్ము మిమ్మల్ని కట్టమని బ్యాంకు, లేదా రుణదాత కోరినప్పుడు బ్యాంకుతో ఉన్న లావాదేవీలు, రుణపత్రాలు, తనఖాలు, ఇతర పూచీల వివరాల్ని కోరండి. సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోండి. అనుభవజ్ఞులైన న్యాయవాది సలహా కోరండి. బ్యాంకు /సంస్థ వద్ద ఖాతా ప్రతిని కోరండి. దానిలో వేసిన ప్రతి పద్దును పదవీ విశ్రాంత బ్యాంకు అధికార్ల సహాయంతో పరిశీలింపజేసుకోండి. పద్దుల్లో ఉన్న అక్రమాల నిగ్గు తేల్చండి.
* మీపై హామీ సొమ్ము వసూలుకై దావా పడినపుడు, నోటీసులు వచ్చినప్పుడు బాకీదారుపై వదిలేయకుండా మీరు సొంతంగా న్యాయవాదిని పెట్టుకోండి. మీ వాదన వినిపించుకోండి. బాకీదారుతో పాటు సహ హామీదార్లపై మీకున్న హక్కుల మేర ప్రతి డిక్రీ ఇప్పించాల్సిందిగా కోర్టు వారిని కోరండి. దానివల్ల మీకు కాలయాపన ఉండదు. బాకీదారు ఆస్తులు అమ్ముకోకుండా, బ్యాంకువారి పూచీలను వదలకుండా మధ్యంతర ఉత్తర్వులను కోరండి.