2022 నాటికి జీడీపీలో తయారీరంగ వాటా 15% నుంచి 25% చేయాలనే లక్ష్యంతోనే ఎన్‌ఎంఐజడ్‌లను కేంద్రప్రభుత్వం ప్రతిపాదించింది. పారిశ్రామిక పట్టణాలుగా పిలిచే ఈ మండళ్లలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతులకు ప్రత్యేకించిన యూనిట్లతో పాటు దేశీయ సుంకాలకు అనుగుణమైనవీ ఉంటాయి. వీటిల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు వివిధ విభాగాలు, అధికారులు వేగంగా అనుమతులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు రూపొందించాలని పారిశ్రామిక విధానం, పెట్టుబడుల శాఖ (డిప్) రూపొందించిన ముసాయిదా పత్రం సూచిస్తోంది.
ఇన్ని రకాల లైసెన్సులు: తయారీ రంగ పరిశ్రమ ఏర్పాటుకు 70 రకాల లైసెన్సులు పొందాల్సి ఉంది. పలు రకాల తనిఖీలు జరగాల్సి ఉంది. మొత్తంమీద ఏడాదిలో 100 రిటర్న్‌లను పారిశ్రామిక వేత్త ప్రభుత్వశాఖలకు సమర్పించాల్సి వస్తుంది. ఇందుకోసం పారిశ్రామికవేత్తలు ఎంతో సమయంతో పాటు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.
ఇవీ మార్పులు: ఎక్కువ అనుమతులు స్థానిక ప్రభుత్వాల నుంచే రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల్లో మార్పులు చేసి, ఔత్సాహికులకు త్వరగా అనుమతులు, ఆమోదాలు లభించేలా చూడాలి. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో 'సింగిల్ విండో క్లియరింగ్ అథారిటీ'ని ఏర్పాటు చేయాలి. పారిశ్రామిక వేత్త ఈ రెండు విభాగాలతోనే వ్యవహారాలు నడిపితే సరిపోయేలా అధికారాలు ఇవ్వాలని డిప్ కోరింది. కాగా డిప్ ముసాయిదా పత్రం బాగుందని ఫిక్కీ ప్రశంసించింది.