చెరకు క్రషింగ్ రెట్టింపు?
నవభారత్ వెంచర్స్‌కు పెరగనున్న ఆదాయాలు హైదరాబాద్, న్యూస్‌టుడే: నవభారత్ వెంచర్స్‌కు తన చక్కెర ఫ్యాక్టరీ పరిధిలో చెరకు సాగు విస్తీర్ణం పెరగడం మేలు చేయనుంది. విద్యుదుత్పత్తి, ఫెర్రోఅల్లాయ్స్, షుగర్ విభాగాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీ 2009-10 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2,75,000 లక్షల టన్నుల చెరకును క్రషింగ్ చేసింది. రికవరీ 9.5% వరకూ ఉంది. ఇదేకాకుండా పంచదారకు ధర, గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో 4,000 టన్నుల ముడి పంచదారను దిగుమతి చేసుకొని శుద్ధి చేసి దేశీయ మార్కెట్‌కు అందించింది. ఫలితంగా కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 3 లక్షల బస్తాల పంచదారను విక్రయించగలిగింది. ధర ఎక్కువగా ఉన్నందున దీనిపై ఆశించిన దానికంటే ఎక్కువగానే లాభాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2010-11లో సంస్థ చెరకు క్రషింగ్ దాదాపు రెట్టింపు అవుతుందని తెలుస్తోంది. ఫ్యాక్టరీ పరిధిలో రైతులకు పలు రాయితీలు ఇచ్చి అధికంగా చెరకు సాగు అయ్యే విధంగా కంపెనీ జాగ్రత్తలు తీసుకుంది. ఈసారి క్రషింగ్ సీజన్లో 5 లక్షల టన్నుల వరకూ చెరకు గానుగాడే వీలు ఉంటుందని యాజమాన్యం భావిస్తోంది. అయితే పంచదార ధరలు ఇటీవల నమోదైన గరిష్ట స్థాయిల నుంచి కనీసం 10% తగ్గుతాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశం మొత్తం మీద ఈసారి చెరకు సాగు విస్తీర్ణం కాస్త ఎక్కువగా ఉండవచ్చని, పంచదార లభ్యత పెరిగి, ధర గణనీయంగా పెరిగే అవకాశాలు ఉండకపోవచ్చన్న వాదన ఉంది. ఏమైనా నవభారత్ వెంచర్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షుగర్ డివిజన్ నుంచి అధికాదాయాలను, లాభాలను నమోదు చేసే వీలు ఉన్నట్లు తెలుస్తోంది.