Saturday, April 3, 2010

టోకు వ్యాపారానికే పరిమితం

'రిటైల్‌'లో ఎఫ్‌డీఐలకు అనుమతి లేదు: కేంద్రం
న్యూఢిల్లీ: అధికారికంగా నమోదైన చిల్లర దుకాణాలకు మాత్రమే టోకు లేదా నగదు చెల్లింపు పద్ధతిలో సరకు ఇవ్వాలని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో (ఎఫ్‌డీఐ) ఏర్పాటయ్యే సంస్థలకు ప్రభుత్వం సూచించింది. ప్రైవేటు వినియోగదారులకు నేరుగా విక్రయించకూడదని పేర్కొంది. ఎఫ్‌డీఐలను పర్యవేక్షించే డిప్‌, టోకు వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి మొదటిసారిగా స్పష్టమైన నిర్వచనాన్ని ప్రకటించింది. ఎఫ్‌డీఐ విధాన పత్రంలోని నిబంధనల ప్రకారం రిటైల్‌ రంగంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించరు. టోకు వ్యాపారంలోకి అనుమతి పొందిన విదేశీ రిటైల్‌ సంస్థలు నిబంధనలు అతిక్రమించి, దేశీయ రిటైల్‌రంగంలోకి ప్రవేశించకూడదని పేర్కొన్నారు. సరఫరాదార్లతో ఒప్పందం కుదుర్చుకుని ఇప్పటికే వాల్‌మార్ట్‌, మెట్రో, టెస్కో వంటి సంస్థలు 'నగదు చెల్లింపుపై సరకు అందించే' సంస్థలను ఏర్పాటు చేశాయి. టోకు వ్యాపారానికి తగు నిర్వచనం లేక, ఇవి భారీస్థాయి కొనుగోలుదార్లకూ సరకు అందిస్తున్నాయి.

నూతన విధానం ప్రకారం..
* నూరు శాతం ఎఫ్‌డీఐలను టోకు వ్యాపారంలోకి; 51% ఎఫ్‌డీఐలను ఒకే బ్రాండ్‌ రిటైల్‌ వ్యాపారంలోకి అనుమతిస్తారు. పలు బ్రాండ్ల రిటైల్‌ వ్యాపారంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించరు.

* కొనుగోలుదారుకు అనుగుణంగా జరిగింది టోకు లేదా రిటైల్‌ వ్యాపారమా అనేది అంశాన్ని నూతన నిబంధనలు తేలుస్తాయి. సరకు ఎంత పరిమాణం అనేది గమనించరు.

* వ్యక్తిగత అవసరాలకు కాక రిటైల్‌, పారిశ్రామిక, వాణిజ్య, వృత్తి పరమైన సంస్థలు, ఇతర టోకు సంస్థలకు మాత్రమే టోకు సంస్థలు విక్రయాలు జరపాలి.