Saturday, April 3, 2010

"ప్రకాశి"స్తున్న రియల్‌ "భూమ్‌"

రాష్ట్ర విభజన అనివార్యమని భావిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రులు ప్రకాశం జిల్లాపై దృష్టిసారించారు. ప్రస్తుత పరి స్థితుల్లో ఆ జిల్లాలోనే ప్రభుత్వ భూముల లభ్యత ఉన్నందున ఒంగోలు రాజధాని అయ్యే అవకాశం ఉందనేది రియల్టర్ల అభిప్రాయం గా ఉంది. దీంతో ఒంగోలు పరిసర ప్రాంతాలతో పాటు ప్రకా శం జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో భూముల కొనుగోలుకు కోస్తా రియల్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కసారిగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భూముల వేటలో పడటంతో..నిన్నా మొన్నటి వరకు ఎకరం రూ.5 నుంచి 10లక్షల వరకు ఉన్న ధరలు హఠాత్తుగా రూ.20లక్షల వరకు చేరుకున్నట్టు తెలుస్తోంది.


ఒంగోలు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎకరం భూమి పాతిక లక్షల రూపాయల పైచిలుకేనని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు చెపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేర్పాటు వాదం ఊపందుకుంది. టిఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరిగిన ప్రతిసారీ తెలంగాణా వాదం తెరపైకి వచ్చేది. ఆ పార్టీ ఏర్పడిన తొలి నాళ్లలో రాష్ట్రం విడిపోవడం ఖాయమని, ఇదే జరిగితే కోస్తా, రాయలసీమ జిల్లాలకు మధ్యలో ఉన్న విజయవాడ రాజధాని అవుతుందనే ప్రచారం జరిగింది. పైగా టిఆర్‌ఎస్‌ పార్టీతో జత కట్టిన కాంగ్రెస్‌ కూడా తెలంగాణాకు మద్దతు ఇవ్వడం, కామన్‌ మినిమం ప్రోగ్రాంలో భాగంగా రాష్టప్రతి ప్రసంగంలో తెలంగాణా అంశాన్ని చేర్చడం ఇందుకు బలం చేకూర్చింది.

ఆ సమయంలో విజయవాడ పరిసర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న గుంటూరు జిల్లాలో కూడా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అప్పటి వరకు రూ.10లక్షల వరకు ఉన్న ఎకరం ధర ఉన్నట్టుండి రూ. 50 లక్షల వరకు వెళ్లింది. విజయవాడను ఆనుకొని ఉన్న ప్రాంతాల్లోనైతే ఎకరం కోటి రూపాయల వరకు క్రయ విక్ర యాలు జరిగాయి. కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణా, రాయలసీమకు చెందిన పలువురు కృష్ణా, గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. రాను రాను తెలంగాణా వాదం బల హీనపడటంతో రియల్‌ ఎస్టేట్‌ రంగం కూడా మందగించింది. అప్పట్లో కొనుగోలు చేసిన ధరలు కూడా రాకపోవడంతో అనేక మంది ఆర్థికంగా నష్టపోయారు.

గతం తో పోల్చితే తెలంగాణా వాదం ఈసారి బలంగా ఉంది. అన్ని రాజకీయ పార్టీల నేత లతో పాటు విద్యార్థులు, న్యాయవాదులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తెలంగాణా ఉద్యమంలో పాల్గొంటున్నారు. రాష్ట్రం విడిపోయేందుకు సీమాంధ్ర నేతలు అంగీకరించకున్నా కొందరు నేతలు మాత్రం విడిపోవడమే మంచిదనే అభి ప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్టమ్రంత్రి బొత్సా సత్యనారాయణ సైతం తెలం గాణాకు అనుకూలంగా ప్రకటన చేయడం, ఇందుకు మరికొందరు కూడా సహ కరించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో..రాష్ట్రం విడిపోవ డం ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

సీమాంధ్రకు రాజధాని విశాఖపట్టణం అని కొందరు, కర్నూలు అంటూ మరి కొందరు చెపుతున్నారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ భూముల లభ్యత అంత సులభం కాదని వాదనే వాదన వినబడుతోంది. సీమాంధ్ర జిల్లాల్లో ప్రకాశం జిల్లా లోనే ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నట్టు చెపుతున్నా రు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ జిల్లాలో భూ సేకరణ సులువుగా ఉన్నందున రాజధాని ఏర్పాటుకు అన్ని అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం ఓడ రేవు ఉన్నందున ఎగుమతి, దిగుమతులు చేసుకునేందుకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు.

పైగా విమా నాశ్రయం అభివృద్దికి కూడా ఇక్కడ అవకాశాలు మెండుగా ఉన్నాయని చెపుతున్నారు. ఏ విధంగా చూసినా రాష్ట్రం విడిపోతే ఒంగోలుకు రాజధాని అయ్యే అవకా శాలు నూటికి నూరుశాతం ఉందనేది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల వాదన. ఈ ప్రచారం విస్తృతంగా జరగడంతో ప్రకాశం జిల్లా ఒంగోలు పరిసర ప్రాంతాల్లోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రియల్టర్ల ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని రైతులు ధరలు పెంచగా..కొనుగోలుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ అంశమనే గాకుండా ఆర్థికమాంద్యం కూడా తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకుంది.