Wednesday, May 5, 2010

ఉద్యోగులకు మరిన్ని సెలవులు


మరో 60 రోజుల ప్రసూతి సెలవు
'ఆర్జితం' 180 రోజులకు పెంపు
ఇక ఎల్‌టీసీ కింద ఇతర రాష్ట్రాలూ వెళ్లొచ్చు
అసాధారణ సెలవులో పరిహార భత్యం పెంపు
ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల్లో మార్పులొచ్చాయి. మహిళా ఉద్యోగులు మరో 60 రోజుల ప్రసూతి సెలవును తీసుకోవచ్చు. ఉద్యోగుల సెలవు ప్రయాణ రాయితీ (ఎల్‌టీసీ) విధానం మారింది. ఉద్యోగి ఇక కుటుంబ సభ్యులతో సహా ఇతర రాష్ట్రాలను సందర్శించొచ్చు. తీవ్ర వ్యాదుల బారినపడి అసాధారణ సెలవులో ఉన్నప్పుడు పొందే పరిహార భత్యం పెరిగింది. కొన్ని సెలవుల విషయంలో రాష్ట్ర ఉద్యోగులు కేంద్ర ఉద్యోగులతో సమానమయ్యారు. వివిధ సెలవులకు సంబంధించి 9వ వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) చేసిన సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

*వివాహిత మహిళా ఉద్యోగికి ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి మాదిరిగా పూర్తి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవు లభిస్తుంది. ఇప్పటివరకు ఈ సెలవు 120 రోజులు మాత్రమే ఉంది.

*ప్రసూతి సెలవుల ఉత్తర్వు వెంటనే అమల్లోకి వస్తుంది. ఇప్పటికే ఈ సెలవులో ఉన్న ఉద్యోగులు 180 రోజుల సదుపాయాన్ని పొందొచ్చు. 120 రోజుల సెలవును వాడుకొని వేరే రకాల సెలవుల్లో ఉన్నవారు, విధుల్లో చేరిన వారు మాత్రం అదనంగా 60 రోజులు ఉపయోగించుకోవటానికి వీలుకాదు.

*ఉద్యోగులు ఇక ఎల్‌టీసీ కింద రెండేళ్ల రెండో బ్లాకులో కుటుంబ సభ్యులతో కలిసి దేశంలోని ఇతర రాష్ట్రాల సందర్శనకు వెళ్లొచ్చు. అయితే వారు ప్రభుత్వం నుంచి ఖర్చులను రాష్ట్ర పరిధిలోని చివరి ప్రాంతం వరకు మాత్రమే పొందగలుగుతారు.

*అధికారిక పర్యటన సమయాల్లో విమానంలో వెళ్లటానికి అనుమతి గల ఉద్యోగులు ఎల్‌టీసీ కింద కూడా కుటుంబ సభ్యులతో కలిసి విమానంలో వెళ్లొచ్చు. వీరు కూడా రాష్ట్రంలోని చివరి ప్రాంతం వరకే ఖర్చులనుపొందగలుగుతారు.

*ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా.. కుటుంబ పింఛను అందుకుంటున్న వారు కూడా ఉద్యోగితోపాటు ఎల్‌టీసీ కింద ప్రయాణించవచ్చు. అయితే వారి అన్ని రకాల ఆదాయాలు కలిపి కనీస కుటుంబ పింఛను మొత్తాన్ని దాటకుండా ఉండాలి. కొత్త ఎల్టీసీ విధానం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే అమల్లో ఉంటుంది.

*ఉద్యోగి తన సెలవు ఖాతాలోని ఆర్జిత సెలవును ఇక ఒకేసారి 180 రోజుల పాటు వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ పరిమితి 120 రోజులే ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వోద్యోగితో సమానమైంది.

*సగం జీతంపై తీసుకొన్న సెలవులకు పదవీ విరమణ, మృతి సమయంలో పొందే నగదుకు కొత్త సూత్రీకరణ వచ్చింది. సగం జీతం సెలవులు, ఆర్జిత సెలవులు కలిసి 300 రోజులకు మించకూడదు.

*కొత్త వేతనం రూ.11,860లోపు కలిగిన ఎన్జీవోలు టీబీ, కుష్ఠు, క్యాన్సర్‌, మానసిక వ్యాధి, గుండె జబ్బుల బారిన పడి అసాధారణ సెలవులో ఉన్నట్త్లెతే..వారు పరిహారభత్యాన్ని సగం వేతనం కింద నెలకు కనిష్ఠంగా రూ. 5,770, గరిష్ఠంగా రూ.7,490 పొందటానికి అర్హులు.

*వ్యాధుల బారిన పడ్డవారు ఆఖరి శ్రేణి ఉద్యోగులైనట్త్లెతే నెలకు రూ.4,295- 6,430 పొందేందుకు అర్హులు.