మనపై నమ్మకం ఎక్కువే ... వాణిజ్య విశ్వాస సూచీలో రెండో స్థానం
అగ్ర స్థానంలో యూఏఈ
హెచ్‌ఎస్‌బీసీ సర్వేలో వెల్లడి
చెన్నై: ఇటీవలి ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరం వ్యాపార వేత్తల్లో వాణిజ్య విశ్వాస సూచీలో భారత్ రెండో స్థానం సంపాదించింది. 134 పాయింట్లతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకటో స్థానంలోనూ, 133 పాయింట్లతో భారత్ రెండో స్థానంలోనూ నిలిచాయని హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ (హెచ్‌ఎస్‌బీసీ) నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా ట్రేడ్ అండ్ సప్లయ్ చైన్ అధిపతి భృగురాజ్ సింగ్ ఇక్కడ విలేకరులకు ఈ సంగతి తెలిపారు. వియత్నాం 132 పాయింట్లు, బ్రెజిల్ 129 పాయింట్లు సాధించి వరుసగా 3,4 ర్యాంకులు పొందాయి. 95 పాయింట్లతో ఉన్న ఫ్రాన్స్‌కు సూచీలో 17వ ర్యాంకు లభించింది. 17వ ర్యాంకు ఆఖరి ర్యాంకు కావటం విశేషం. సర్వేలో తేలిన మరో ముఖ్యాంశం ఏమిటంటే.. ఆర్థిక సంక్షోభం తరువాత ఆసియా పసిఫిక్ ప్రాంతం, లాటిన్ అమెరికా, కెనడా, యూరప్ సహా కొన్ని దేశాల మార్కెట్లు ఇదివరకటి కన్నా సానుకూలంగా మారాయి. ప్రపంచ వ్యాప్తంగా చిన్న, మధ్యతరహా ఎగుమతిదారులు మొత్తం 5,120 మంది అభిప్రాయాలను సర్వే కోసం సేకరించారు. రానున్న ఆరు నెలలకు వారి అంచనాలను తెలపాలని కోరారు. అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లకు 106 పాయింట్లు దక్కితే, ఎదుగుతున్న దేశాల మార్కెట్లు 122 పాయింట్లతో సూచీలో అగ్రగాములుగా నిలిచాయి. భారత ఎగుమతిదారుల్లో విశ్వాసం స్థాయి మెరుగ్గా ఉందని భృగురాజ్ సింగ్ చెప్పారు. గత సంవత్సరం ద్వితీయార్థంలో వ్యాపార విశ్వాసం 117 పాయింట్ల వద్ద ఉండగా అది తాజాగా 133కు చేరుకొంది. రానున్న ఆరు మాసాల్లో బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం పెరగవచ్చని 60 శాతం భారతీయ ఎగుమతిదారులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగుల్లో విశ్వాసం తగ్గింది న్యూయార్క్: ఉద్యోగుల్లో వారు పనిచేస్తున్న కంపెనీల భవితవ్యం పట్ల విశ్వాసం ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో కొంత తగ్గింది. గత సంవత్సరం డిసెంబరుతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ప్రపంచ ఉద్యోగి విశ్వాస సూచీ 98 పాయింట్లుగా ఉండగా, అది కిందటి నెలతో ముగిసిన మూడు నెలల కాలానికి 93.8కి క్షీణించినట్లు ప్రపంచ మానవ వనరుల సేవల సంస్థ కెనెక్సా పేర్కొంది. యాజమాన్య సంస్థలకు మార్కెట్‌లో పోటీపడే తత్వం పైన ఉద్యోగుల్లో ఉన్న నమ్మకం, ఉద్యోగులకు వారి సొంత వృత్తి జీవనం (కెరియర్)పైన ఉన్న నమ్మకం స్థాయిలను కొలిచేదే ఈ విశ్వాస సూచీ. సిబ్బందికి వారు పనిచేస్తున్న కంపెనీల నిర్వహణ బాగుండి, ఎదురయ్యే పోటీకి తట్టుకొనే సామర్థ్యం కలిగి ఉండి, ఆ కంపెనీలో తమకు ఉద్యోగ భద్రతతో పాటు మంచి భవిష్యత్తు కూడా ఉండవచ్చని, ఉద్యోగి మెలకువలు ఇతర యాజమాన్య సంస్థలకు సైతం ఆకర్షణీయంగా తోచవచ్చని ఉద్యోగులు భావిస్తున్నపుడు ఉద్యోగి విశ్వాస సూచీ అధిక పాయింట్లను ప్రతిబింబిస్తుంది. కెనెక్సా పరిశోధక విభాగం భారత్ సహా 12 దేశాలను అధ్యయనం చేయగా ఒక్క స్పెయిన్ మినహా మిగిలిన అన్ని దేశాల్లో ఉద్యోగి విశ్వాసం సమీక్షా కాలంలో తగ్గిపోయినట్లు కెనెక్సా రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ కన్సల్టెంట్ యాన్ హెర్మన్ చెప్పారు. చైనాలో గతేడాది నాలుగో త్రైమాసికంలో ఉద్యోగి విశ్వాసం 105.6 ఉండగా ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 99.8కి జారిపోయింది.