Tuesday, February 23, 2010

కేంద్ర బడ్జెట్‌పై ప్రజలకు అహేతుక అంచనాలు

కేంద్ర బడ్జెట్‌పై ప్రజలకు అహేతుక అంచనాలున్నాయి. బడ్జెట్‌లో మనకు ఏదో ఒరిగిపోతుందనే వూహలున్నాయి. వాస్తవానికి అంత ఎక్కువగా ఆశించి ప్రయోజనం లేదు. ఏటా బడ్జెట్లు మనకు ఈ విషయాన్ని కళ్లకు కడుతున్నాయి. బడ్జెట్‌ అనేది కేంద్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాల పట్టిక మాత్రమే. భారత ఆగంతుక నిధి నుంచి డబ్బు ఖర్చు పెట్టడానికి రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు అనుమతి తప్పనిసరి కాబట్టి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం రివాజు. శాంతి భద్రతలు, ఆరోగ్యం, విద్య.. ఇలా ప్రజలకు నేరుగా ఉపయోగపడే వాటిపై ఎక్కువగా ఖర్చు పెట్టాలని కోరుకుంటాం. కేంద్ర బడ్జెట్‌పై మీడియా హడావుడి ఎక్కువగా ఉంటుంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రేట్లు ఏటేటా మారే అరుదైన సందర్భాల్లో మాత్రమే కేంద్ర బడ్జెట్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇలా తరచూ మార్పులు జరిగే పరిస్థితిని నివారించాలనేదే సంస్కరణవాదం.

సంస్కరణ యుగంలో పన్ను రేట్లలో తరచూ మార్పుల్ని మనం ఆశించలేం. సుస్థిరత ముఖ్యం. 1991 నుంచి కేంద్ర బడ్జెట్‌లకు ప్రాధాన్యం ఏర్పడింది. ఎందుకంటే ముఖ్యమైన విధాన ప్రకటనల్ని బడ్జెట్‌ ద్వారానే చేస్తున్నారు. వాటిని ఆ తర్వాత అమలు చేస్తున్నారా? లేదా? అనేది వేరే విషయం. ప్రస్తుత ఆర్థిక మంత్రి వ్యవహార శైలి వేరు. 26వ తేదీన ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌లో ప్రణబ్‌ ముఖర్జీ నాటకీయమైన విధాన ప్రకటనలు చేస్తారని వూహించడం కష్టం.

బడ్జెట్లో మనం చాలా కోరుకుంటాం. ముఖ్యంగా ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయాలని ప్రతిఒక్కరూ ఆశిస్తారు. ప్రస్తుతం ఆహార ధరలతో పాటు, ఉత్పాదక వస్తువులు, ఇంధన ధరలు మండిపోతున్నాయి. ధరల పెరుగుదల అదుపునకు ప్రభుత్వం చేయాల్సిన పనుల జాబితాను విడమర్చి చెప్పడానికి ఇది వేదికకాదు. అయితే వీటి గురించి ఆర్థిక శాఖ తీవ్రంగా ఆలోచిస్తోందా? ఆహార భద్రతా చట్టం తెస్తామని, ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) సమర్థంగా అమలుచేస్తామని ఆయన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పొచ్చు. సభ్యులు లేచి చప్పట్లు కొట్టొచ్చు. కానీ, వీటిని అమలు చేస్తారని గ్యారెంటీ ఏమిటి? పరస్పర విరుద్ధాలైన వృద్ధిరేటు, ద్రవ్యోల్బణాల మధ్య సమతౌల్యం సాధించడం అవసరం. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడానికి ఏ ప్రయత్నం చేసినా... వృద్ధిరేటు ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ద్రవ్యవిధానాన్ని కట్టుదిట్టం చేయడం ద్వారా ఆర్‌బీఐ ఈ సమస్యను పరిష్కరించాలి. ఆర్‌బీఐ అనేది ఆర్థికశాఖతో సంబంధం లేని స్వతంత్ర వ్యవస్థ కాదని మనం అనుకోవడం సరైనదే. అలాగని ఆర్‌బీఐ, ఆర్థిక శాఖ రెండూ ఒక్కటే అనుకుంటే పొరపాటే. ద్రవ్యోల్బణం అదుపునకు ప్రభుత్వం ఏదోఒకటి చేయాలని మనం కోరుకోవడం సహజం. అయితే బడ్జెట్‌ ద్వారా అది సాధ్యమయ్యేది తక్కువే.

మనకు, మన రంగాలకు వ్యక్తిగత, కార్పొరేట్‌ పన్నుల రేట్లు తక్కువగా ఉండాలని ఆశిస్తాం. అందుకే బడ్జెట్‌ తయారీకన్నా ముందు పారిశ్రామిక వర్గాలు ఆర్థిక శాఖ కార్యాలయం చుట్టూ తిరిగి మహజర్లు సమర్పిస్తుంటాయి. అదే సమయంలో ఇవి సంక్లిష్ట పన్నుల విధానం, అవినీతి, లంచగొండి తనాల గురించీ ఫిర్యాదులు చేస్తాయి. ఎక్కడ వివక్ష, మినహాయింపులుంటాయో అక్కడ పద్దు నిర్వహణ వ్యయాల్ని తగ్గించలేం. అందుకే 1991 నుంచీ పన్నుపరిధిని విస్తరిస్తూనే... ప్రధానంగా ప్రమాణీకరణ, ఏకీకరణ, సమంజసీకరణపై పన్ను సంస్కరణలు దృష్టిపెట్టాయి.

పన్నుల విధానంలో చాలా లొసుగులున్నాయి. వేతన చట్రంలో లేని ఛార్టెడ్‌ అకౌంటెంట్లు, న్యాయవాదులు మెర్సిడెజ్‌ బెంజ్‌ కారులో తిరుగుతుంటే వాళ్లు పన్నులు చెల్లించడం లేదని, చట్టవిరుద్ధ వ్యవహారం ఏదో జరుగుతోందని వేతనజీవికి అనిపించవచ్చు. అయితే, ఇది అన్ని వేళలా నిజం కాకపోవచ్చు. చాలా సందర్భాల్లో ఇది చట్టబద్ధంగా పొందే మినహాయింపు అవుతుంది. ఇలాంటి అసమానతలు తొలగిస్తూ... పన్నుల విధానంలో ఏకీకరణ, ప్రామాణీకరణ, సమంజసీకరణ తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష పన్నుల కోడ్‌ను ప్రతిపాదిస్తోంది. దీనిపై ఇంకా చర్చ సాగుతుండడంతో... ఈ బడ్జెట్లో దీనిని ప్రవేశపెట్టడం లేదు. కాబట్టి ఈ బడ్జెట్లో ఆదాయపు పన్నుకు సంబంధించి అనూహ్య ప్రకటనలుంటాయని ఆశించడానికి వీల్లేదు.

ఏకీకృత వస్తువులు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమలును 2011 ఏప్రిల్‌కు వాయిదా వేశారు. అలాగని వూరుకోకుండా వస్తువులపై కేంద్రం విధిస్తున్న ఎనిమిది శాతం సెన్‌వ్యాట్‌ను, పదిశాతం సేవలపై పన్నురేటును ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉంది. ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా 14 శాతం నుంచి ఎనిమిది శాతానికి తగ్గించిన ఎక్సైజ్‌ పన్ను, 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించిన సేవాపన్ను ఈ బడ్జెట్లో పెరగొచ్చు. ఇలాంటి పెరుగుదలలు మళ్లీ ద్రవ్యోల్బణాన్ని రాజేస్తాయి. కానీ ఈ పనిచేయక తప్పదు. కనీసం ఎంత మేరకు పెంచగలననే విషయమై ఆర్థికమంత్రి ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకుంటారు.

వ్యయాల దగ్గరకు వద్దాం. చాలా వ్యయాల్ని(వడ్డీ చెల్లింపులు, వేతనాలు, పింఛన్లు, రక్షణ వ్యయం) తగ్గించలేం. ప్రాధాన్య కార్యక్రమాలు, ఉపాధి హామీలాంటి వాటి ద్వారా యూపీఏ ప్రభుత్వం ప్రజలపై ఖర్చును పెంచింది. వీటికితోడు ఇంకా బడ్జెట్‌ కేటాయించని విద్యాహక్కు, ప్రతిపాదనల్లోని ఆహార హక్కు ఉన్నాయి. ప్రజల పేరుతో అమలుచేస్తున్న ఇలాంటి పథకాల్లోని వ్యయ సమర్థతను ప్రశ్నించే అధికారం మనకు ఉంది. వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణం, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల ప్రభుత్వం తాను అనుకున్న దానిపై సరైన రీతిలో ఖర్చుచేయలేకపోతోంది. ఎరువుల సబ్సిడీల దగ్గరకు వస్తే... పోషకాల-ఆధార వ్యవస్థ దిశగా కొన్ని అడుగులు పడుతున్నాయి. బడ్జెట్‌లో కాకపోయినా... సమీప భవిష్యత్తులో పెట్రోలియం ఉత్పత్తులపై వడ్డన తప్పకపోవచ్చు. 2010-11 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును జీడీపీలో 5.5 శాతంగా ఆర్థికమంత్రి ప్రతిపాదించవచ్చు. ఇది సాధ్యమే. ఎందుకంటే ఆరో వేతన సంఘం బకాయిలు, రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిలు ఏవీ ఈ ఏడాది ఉండబోవు. 3జీ వేలం, పెట్టుబడుల ఉపసంహరణ గురించి బడ్జెట్‌లో ప్రస్తావన ఉండొచ్చు. అంకెలు మాత్రం చెప్పకపోవచ్చు. మొత్తంమీద ఈ బడ్జెట్లో మనకు ఏదో ఒరిగిపోతుందని మాత్రం అనుకోవద్దు.

వివేక్‌ దెబ్రాయ్‌
(రచయిత ప్రముఖ ఆర్థికవేత్త, సంస్కరణలాభిలాషి)