Tuesday, February 23, 2010

ఆయకట్టు లక్ష్యంగా జలయజ్ఞం

ఆయకట్టు లక్ష్యంగా జలయజ్ఞం
ప్రాజెక్టుల పూర్తికి మరో కార్యాచరణ ప్రణాళిక
సింహభాగం పూర్తయినవి ముందుగా..
ముఖ్యమంత్రి పరిశీలనలో ఠక్కర్‌ నివేదిక
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: జలయజ్ఞం ప్రాజెక్టుల్ని ఎలా పూర్తి చేయాలనేది ప్రస్తుతం ప్రభుత్వానికి సమస్యగా మారింది. జలయజ్ఞం సంక్షోభం నుంచి బయటపడాలంటే ఏ ప్రాజెక్టు ముందు చేపట్టాలి, దేనిని తర్వాత చేపట్టాలనే ప్రాధాన్యాన్ని నిర్ణయించాల్సిన పరిస్థితి నెలకొంది. అలా.. నిర్ణయిస్తే రాజకీయ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనినుంచి బయట పడటానికి ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. రెండు నెలల క్రితం నీటి పారుదల శాఖ ప్రాజెక్టులను ప్రాధాన్యాల వారిగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆ ప్రాధాన్యాలను ప్రభుత్వం కూడా ఆమోదించి, దాని ప్రకారం పనులు చేస్తామనీ ప్రకటించింది. కానీ.. బడ్జెట్‌కు వచ్చేసరికి నిధుల కేటాయింపు మాత్రం ఆ ప్రాధాన్యాల ప్రకారం చేయనేలేదు. ఈ క్రమంలో ప్రాజెక్టుల పూర్తికి మరో ప్రణాళిక సిద్ధమైంది. జలయజ్ఞం పనులతో సంబంధం లేని నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.పి.ఠక్కర్‌ ప్రాజెక్టుల పూర్తికి ఓ కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి అందజేశారు. ఇందులో ఆయకట్టునే ప్రాతిపదికగా తీసుకున్నారు. ఆయకట్టు లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణ ప్రాధాన్యాన్ని నిర్ణయించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు జలయజ్ఞానికి దూరంగా ఉంటూ చిన్ననీటి వనరులు, ఆయకట్టు అభివృద్ధి, సంస్కరణలను పర్యవేక్షిస్తోన్న ఠక్కర్‌, ప్రాంతాల వారీగా జలయజ్ఞం పనులు పర్యవేక్షిస్తోన్న ముగ్గురు కార్యదర్శుల ప్రమేయం కూడా లేకుండా ఈ నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. రూ.1900 కోట్లు వ్యయం చేస్తే ఇప్పటికే 75 శాతం పనులు జరిగిన ప్రాజెక్టులను పూర్తి చేసి 12.83 లక్షల ఎకరాల ఆయకట్టును ఏడాదిలోగా సాగులోకి తేవచ్చు. ఈ నిధులతో 15 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులతోపాటు, 121 చిన్న నీటి వనరులు, 67 చిన్న ఎత్తిపోతల పథకాలు పూర్తి అవుతాయి. ఈ ప్రాజెక్టులకు ఖర్చు చేసే రూ.1900 కోట్లలో రూ.271 కోట్లు కేంద్రసాయంగా లభిస్తోంది. ఈ సంవత్సరం ఖర్చు చేసే నిధులతోపాటు వచ్చే ఏడాది రూ.8,900 కోట్లు వ్యయం చేస్తే మరో పది ప్రాజెక్టులు పూర్తిచేసి 17 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి తేవచ్చు. మొత్తమ్మీద 60 నుంచి 75 శాతం వరకు పూర్తయిన ప్రాజెక్టులన్నింటినీ వచ్చే రెండేళ్లలో పూర్తి చేయడానికి వీలవుతోంది. రూ.10 కోట్ల నుంచి రూ.11 వేల కోట్ల వరకు వ్యయం చేస్తే 25 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి తేవడానికి అవకాశం ఉంది. మిగిలిన ప్రాజెక్టులకు నాలుగు సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక పెట్టుకొంటే, ఏ ప్రాజెక్టును కూడా పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు. పోలవరంతోపాటు మరో ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చే అవకాశం ఉంది. ఇది జరిగితే ఏడాదికి రూ.మూడువేల కోట్ల వరకు వస్తాయి. ప్రణాళిక ప్రకారం పనులు చేస్తే వచ్చే నాలుగేళ్లలో ఎక్కువ భాగం పూర్తి చేయవచ్చని ఆయన సూచించినట్లు తెలిసింది. జాతీయ హోదా కోసం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం వచ్చే వరకు పనులు చేయకుండా పక్కన పెట్టాలని, ఈ ప్రాజెక్టులకు భూసేకరణ కూడా చేయరాదని కూడా సూచించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం పరిశీలనలో ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

వాస్తవానికి రెండునెలల క్రితం నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని తయారు చేసి ముఖ్యమంత్రికి అందజేసింది. ఏ ప్రాజెక్టు ఎంత శాతం పూర్తయ్యింది, ప్రాజెక్టు వారీగా ఎంత వ్యయం చేసింది అందులో పేర్కొంది. రూ.13వేల కోట్లు వ్యయం చేస్తే 41 ప్రాజెక్టులను 2011లోగా పూర్తి చేయవచ్చని, 2014 నాటికి మిగిలిన ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చని నివేదించింది. నాలుగు ప్రాజెక్టులను మూడవ కేటగిరిలో చేర్చింది. ముఖ్యమంత్రితో సమీక్ష తర్వాత, ఈ ప్రాధాన్యాల్ని మంత్రి పొన్నాల కూడా ప్రకటించారు. అయితే బడ్జెట్‌లో నిధుల కేటాయింపు మాత్రం దీనికి తగ్గట్లుగా లేదు. ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని నిర్ధారించి ఇప్పటికే ఆమోదించిన తర్వాత, ఇప్పుడు ఠక్కర్‌ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారు, దీని ప్రకారం పనులు చేయడానికి నిర్ణయం తీసుకొంటారా అన్నది ప్రశ్న.