Tuesday, February 23, 2010

అలవాటులో పొరపాటు.. ఇప్పటికీ చిదంబరమే బాస్...

న్యూఢిల్లీ: అందరి దృష్టిలో చిదంబరం భారత హోమ్ శాఖ మంత్రి. కానీ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ చైర్మన్ భట్ దృష్టిలో మాత్రం కాదు. ఇప్పటికీ చిదంబరమే తమ బాస్ అన్నట్లు భట్ ప్రసంగం ప్రారంభించడంతో ఆల్ ఇండియన్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అవార్డుల వేదిక ఒక్కసారిగా గొల్లుమంది. ఈ కార్యక్రమంలో హోమ్‌శాఖ మంత్రి చిదంబరం చేతుల మీదుగా జెఆర్‌డి టాటా కార్పొరేట్ లీడర్‌షిప్ అవార్డు స్వీకరించిన ఎస్‌బిఐ చైర్మన్ భట్ వేదికను ఉద్దేశించి 'గౌరవనీయులైన ఆర్థిక మంత్రి చిదంబరం గారు' అంటూ ప్రసంగం ప్రారంభించారు.

దీనితో వేదికను అలంకరించిన చిదంబరంతో సహా ఒక్కసారిగా అందరూ గొల్లుమన్నారు. వెంటనే నాలిక కరుచుకున్న భట్ ప్రసంగం కొనసాగిస్తూ, పాత అలవాట్లు ఎప్పటికీ మారవు. చిదంబరం మా మాజీ బాస్ మాత్రమే కాదు నేను చూసిన బాస్‌లలో ది బెస్ట్ బాస్ అంటూ కితాబు ఇచ్చారు. అందుకే ఈ పొరపాటు అంటూ.. అక్కడితో ఆగకుండా సంక్షోభ సమయంలో ఆర్థికమంత్రిగా బ్యాంకింగ్ వ్యవస్థకు నాయకత్వం వహించిన తీరు ప్రశంసనీయమని పొగడ్తల వర్షం కురిపించారు.