Tuesday, February 23, 2010

ఇక 'బ్రాండ్‌ హైదరాబాద్‌'

ఇక 'బ్రాండ్‌ హైదరాబాద్‌'
కార్యచరణ కమిటీ రెండు నెలల్లో ఏర్పాటు
ఐఎస్‌బీ అభినందన సభలోముఖ్యమంత్రి ప్రకటన
పారిశ్రామిక వర్గాలూ! సలహాలు ఇవ్వండి
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎటువంటి అనిశ్చిత పరిస్థితులు లేవు. మంచి మౌలిక సదుపాయాలు, మానవ వనరులు ఉన్నాయి. ఇక్కడకు వచ్చి పెట్టుబడులు పెట్టిండి. పెట్టుబడుల గమ్య స్థానంగా హైదరాబాద్‌ కొనసాగుతుందని దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు తెలియజెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. 'బ్రాండ్‌ హైదరాబాద్‌' ప్రచారం కోసం తగిన చర్యలు తీసుకోవడానికి ఒక కార్యచరణ కమిటీని (టాస్క్‌ఫోర్స్‌) ఏర్పాటు చేయనుంది. పారిశ్రామిక వర్గాల అభిప్రాయాలు, సలహాలు తీసుకుని రెండు నెలల్లో దీన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రోశయ్య పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)కు అత్యత్తుమ బిజినెస్‌ స్కూల్స్‌లో 12వ ర్యాంక్‌ (ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ఇస్తుంది) వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. సభ ప్రారంభంలో 'బ్రాండ్‌ హైదరాబాద్‌' కోసం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు వేయాలని ద ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యువర్స్‌ (టీఐఈ-టాయ్‌) హైదరాబాద్‌ చాప్టర్‌కు చెందిన జె.ఎ.చౌదరి (బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌) కోరారు. దేశంలో అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్‌ ఒకటని, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు ఇక్కడ బాగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీటిని ఉపయోగించుకుని మరిన్ని పెట్టుబడులు, కంపెనీలను ఆకర్షించడానికి 'బ్రాండ్‌ హైదరాబాద్‌'ను ప్రచారం చేయాలి. దీని వల్ల మరింత మందికి ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. దీనికి ముఖ్యమంత్రి స్పందించి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు అంశాన్ని ప్రకటించారు. మాంద్యం ప్రభావం అన్ని దేశాలతోపాటు రాష్ట్రంపైన కూడా ఉందని, దీనిపై గతంలోనే పారిశ్రామిక వర్గాల సలహాలు, సూచనలు కోరాం. రాష్ట్రంలోని వారికే కాదు, ప్రపంచ స్థాయి ఉన్నత విద్య అవకాశాలు కోరుకునే అందరికీ రాష్ట్రాన్ని గమ్య స్థానంగా తీర్చిదిద్దడం ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్ని పేర్కొన్నారు. టీఐఈ హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షుడు రమేశ్‌ బాబు మాట్లాడుతూ యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి 'హైదరాబాద్‌ ఏంజిల్స్‌'ను ఒకటి రెండు నెలల్లో టాయ్‌ ఏర్పాటు చేస్తోందని తెలిపారు.

రాష్ట్ర ఔత్సాహికులకు ప్రత్యేక విభాగం: చంద్రబాబు
రాష్ట్రంలోని ఔత్సాహికులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)లో ప్రత్యేక విభాగాన్ని (సెల్‌) ఏర్పాటు చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రంలోని ప్రజలు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తాను గట్టిగా కృషి చేయడం వల్లే రాష్ట్రానికి ఐఎస్‌బీ వచ్చిందని అన్నారు.

మొదటి ర్యాంక్‌ సాధించాలి
ఐఎస్‌బీ అభినందన సభకు మ్యాట్రిక్స్‌ ల్యాబ్స్‌ వ్యవస్థాపకుడు, వైస్‌ ఛైర్మన్‌ ఎన్‌.ప్రసాద్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ సీఈఓ జి.వి.ప్రసాద్‌, ఇందు ప్రాజెక్ట్స్‌ సీఎండీ శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి వంటి రాష్ట్రంలోని ప్రధాన పారిశ్రామికవేత్తలు విచ్చేశారు. ఇటువంటి ప్రపంచ అత్యుత్తమ బిజినెస్‌ స్కూల్‌ హైదరాబాద్‌లో ఉండడం రాష్ట్రానికే గర్వకారణమని, త్వరలో మొదటి ర్యాంక్‌ను సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అభినందన సభకు లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయ ప్రకాశ్‌ నారాయణ్‌, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దత్తాత్రేయ తదితరులు హాజరయ్యారు. అత్యుత్తమ ర్యాంక్‌తోపాటు అత్యంత ప్రభావితం చేసే సంస్థగా ఐఎస్‌బీని తీర్చిదిద్దాలన్నది తన లక్ష్యమని ఐఎస్‌బీ డీన్‌ అజిత్‌ రంగ్నేకర్‌ పేర్కొన్నారు. ఇటువంటి విజయాన్ని ఒక్క విద్యా సంస్థకే పరిమితం చేయకూడదని, అన్ని విద్యాసంస్థలను ఇదే స్థాయిలో తీర్చిదిద్దాలని జయప్రకాశ్‌ నారాయణ్‌ అన్నారు. ఐఎస్‌బీలో అనుసరించిన విధానాలను వైద్యం వంటి కీలక రంగాల్లో పునరావృతం చేసి అక్కడ కూడా విజయాలు సాధించాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సూచించారు.
ఎవరేమన్నారంటే..
ఐఎస్‌బీకి ఇది ఎంతో గౌరవమైన విజయం. పటిష్ఠమైన రాజకీయ నాయకత్వం వల్లే ఐఎస్‌బీని ఇక్కడ స్థాపించుకోగలిగాం.
- ఎన్‌.ప్రసాద్‌, మ్యాట్రిక్స్‌ ల్యాబ్స్‌, వైస్‌ ఛైర్మన్‌
ఇది విజ్ఞాన ప్రపంచం. వినూత్న ఆలోచనలదే రాజ్యం. నగరాలకు, దేశాలకు సంస్థల వల్లే పేరు, ప్రతిష్ఠలు వస్తాయి.
-జి.వి.ప్రసాద్‌, సీఈఓ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌
ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులను అధిగమించాలి. మరింత పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి కేంద్రీకరించాలి.
- పీపుల్‌ క్యాపిటల్‌ అడ్వజైర్స్‌ ఎండీ శ్రీనిరాజు
ఐఎస్‌బీకి అభినందనలు. ఐఎఎస్‌బీ మేనేజిమెంట్‌, నాయకత్వం వల్లే ఇది సాధ్యం అయింది. వారందరికీ నా అభినందనలు.
- దత్తాత్రేయ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు