Tuesday, February 23, 2010

ఆన్‌లైన్‌ మోసాలకు తెలుగోడి పరిష్కారం

ఆన్‌లైన్‌ మోసాలకు తెలుగోడి పరిష్కారం
ఇంటలెక్ట్‌ ప్రైవసీ కార్డు
రూపశిల్పి ఖమ్మం విద్యార్థి
చెన్నై, న్యూస్‌టుడే: బ్యాంకింగ్‌ లావాదేవీల్లో ఆన్‌లైన్‌ వినియోగం ఎక్కువే. అదే విధంగా అందులో ఆన్‌లైన్‌ మోసాలూ ఎక్కేవే. ఈ సమస్యకు ఐఐటీ మద్రాసు ఇంటలెక్ట్‌ ప్రైవసీ కార్డు రూపంలో పరిష్కారం కనుగొంది. విశేషం ఏమిటంటే దీని రూపకర్త ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగు విద్యార్థి కొండవీటి బాలరాజు కావడం. సోమవారం ఐఐటీ మద్రాసులో కార్డు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మొట్టమొదటి ప్రైవసీ కార్డును ఐఐటీ డైరెక్టర్‌ ఎంఎస్‌ అనంత్‌ ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు ఉపాధ్యక్షుడు రమేశ్‌ గణేశన్‌కు అందజేశారు. ఈ విధానాన్ని తొలిసారిగా ఆంగ్లంతోపాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కూడా వాడొచ్చని బాలరాజు తెలిపారు.

ప్రస్తుతం ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌లో ఉన్న లోపాలు
ప్రస్తుతం ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌లో రెండు విధానాలు అమల్లో ఉన్నాయి. ఒకటి ఎలక్ట్రిక్‌ టోకెన్‌ కాగా రెండోది, ఎస్‌ఎంఎస్‌ విధానం

ఎలక్ట్రిక్‌ టోకెన్‌: ఈ కార్డు క్యాలిక్యులేటర్‌ను పోలి ఉంటుంది. దీన్ని అందజేయాలంటే బ్యాంకులకు ఒక్కో కార్డుపై రూ.700-1500 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విధానం కాస్త సురక్షితమే అయినా ఒక్కో వినియోగదారుడిపై ఇంత ఖర్చు చేసేందుకు బ్యాంకులు సిద్ధంగా లేవు.

ఎస్‌ఎంఎస్‌ విధానం: ప్రస్తుతం ఎక్కువగా వాడుకలో ఉన్న విధానమిది. ఇందులో మన ఆన్‌లైన్‌ పాస్‌వర్డ్‌ ముందే తెలిసి ఉంటే లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. లేకుంటే పాస్‌వర్డ్‌ను (ఆప్షనల్‌) ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా పొందవచ్చు. మన పాస్‌వర్డ్‌ను ఇతరులు తెలుసుకునే అవకాశాలు చాలా సులభం.

ఇదీ నూతన విధానం
'ఇంటెలెక్ట్‌ ప్రైవసీ కార్డు' అంటే ప్లాస్టిక్‌తో తయారుచేసిన ఆరు కార్డులు. దీన్ని మన దగ్గర ఉంచుకోవడం సులభం. దీనికి ఒకే పాస్‌వర్డ్‌ (డైనమిక్‌ పాస్‌వర్డ్‌) ఉండదు. లావాదేవీలు జరిపిన ప్రతిసారీ పాస్‌వర్డ్‌ మారుతుంటుంది. దీంతో మన పాస్‌వర్డ్‌ ఇతరులకు తెలిసే అవకాశం లేదు. తెలిసినా జరిగే నష్టం లేదు. ఇది అత్యంత చవకైనది. ప్లాస్టిక్‌తో ఉన్న ఆరు కార్డులు తయారు చేసేందుకు అయ్యే ఖర్చు కేవలం రూ.7 మాత్రమే. దీంతో ఈ విధానం బ్యాంకులకు ఆర్థికంగా భారం కాదు.