Tuesday, February 23, 2010

మమత మార్గం.. వైవిధ్యం

మమత మార్గం.. వైవిధ్యం
తలుచుకుంటే... బెంగాలీ మిర్చీ అంత ఘాటు. కదిపితే... ప్రత్యర్థులకు కోల్‌కతా కాళిక. పలకరిస్తే... అభిమానులకు, కార్యకర్తలకు దీదీ. ఇవేనా... మమతా బెనర్జీ అంటే... మాటల ప్రవాహం, చేతల దూకుడు, వార్తల్లో వ్యక్తి. అంతేకాదు... బాధ్యతలకు ముందుండే మనిషి. ప్రజా ఉద్యమాలకు వూపిరి. సృజనశీలి, రచయిత్రి. రేపు రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న ఆ విలక్షణ వనితపై కథనం.

నూలు చీర, చేతి సంచీ, రబ్బరు చెప్పులు... రైల్వే మంత్రిగా ఉన్నా మమతది అదే మార్క్‌. నిరాడంబరతకే ఆమె ఓటు. ఆ మాటకొస్తే చదువు, కుటుంబ నిర్వహణ, విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనడం, ఎంత ఎదిగినా అందరికీ అందుబాటులో ఉండటం, నాయకురాలిగా మన్ననలు పొందడం వంటి పలు అంశాల్లో మమతది ప్రత్యేక శైలి.

బెంగాల్‌లోని దిగువ మధ్యతరగతి కుటుంబంలో మమత జన్మించింది. అనుబంధాలే వారి ఆస్తి. వాటిని మరింత గాఢంగా అల్లేందుకు ఆమె బాల్యం నుంచీ ప్రయత్నించింది. తల్లి అనారోగ్యంతో బాధపడుతుంటే ఇంటిపనుల్ని నెత్తికెత్తుకొంది. వైద్యానికి డబ్బుల్లేక తండ్రి చిన్న వయసులోనే మరణిస్తే పెద్ద కూతురిగా బాధ్యతల్ని స్వీకరించింది.

ఒకపక్క చదువు... మరోపక్క ఇంటి బాధ్యతలు. తెల్లవారుజాము నాలుగుకాకముందే నిద్రలేవడం, ఇంటిపనులన్నీ చక్కబెట్టడం, తోబుట్టువులను తయారుచేయడం, వంట పూర్తిచేశాక అప్పుడు స్కూలుకి బయలుదేరడం ఇదీ అప్పట్లో ఆమె దినచర్య. కాలేజీకి వచ్చాక్కూడా సరదాల గురించి ఆమె ఏ క్షణం ఆలోచించింది లేదు. చదువు, మార్కులు, బాధ్యతలు. ప్రతిక్షణం వాటి ధ్యాసే.

మమతకు చదువంటే ప్రాణం. బడుగు జీవులంటే వల్లమాలిన అభిమానం.అన్యాయాలను సహించేది కాదు. అక్రమాలను ప్రశ్నించేది. ఆ క్రమంలో లాఠీ దెబ్బలు తింది. ఒకానొక సమయంలో ఇనుప కడ్డీ దెబ్బలకు కోమాలోకి వెళ్లింది. చిత్రం ఏంటంటే, అంతటి ఆవేశ, ఉద్వేగ సమయంలోనూ చదువుని నిర్లక్ష్యం చేయకపోవడం. జైలుకి వెళుతూ పాఠ్య పుస్తకాలను వెంట తీసుకెళ్లింది. అక్కడ తదేక దీక్షతో చదివింది. అయినవారూ, అందరూ భేష్‌ అనేలా ఎమ్మే, బీఈడీ పూర్తి చేసింది. న్యాయశాస్త్రమూ అభ్యసించింది.

విద్యార్థి ఉద్యమాలతో ఎదిగిన మమత పాతికేళ్లకే ప్రజలు మెచ్చిన మనిషిగా మారింది. 27 ఏళ్ల వయసులోనే వామపక్ష దిగ్గజం సోమ్‌నాథ్‌ ఛటర్జీపై పోటీ చేసి గెలిచింది. అలాగని విర్రవీగలేదు. నేరుగా ఆయన వద్దకు వెళ్లి పాదాభివందనం చేసి ఆశీస్సులు కోరింది. ఎంత ఎదిగినా పెద్దలకు, అనుభవానికి, అంతులేని విజ్ఞానానికి తలవంచుతానని చెప్పకనే చెప్పింది.

కాంగ్రెస్‌లో... కేంద్ర ప్రభుత్వంలో మమత పలు కీలక పదవులు నిర్వహించింది. వామపక్షాలపై పోరాడింది. అలాగే పార్టీ నుంచి బయటికొచ్చి సమస్యలపై సమరభేరి మోగించింది. అవసరమైతే స్వపక్షీయులనూ వదల్లేదు. అవినీతికి వ్యతిరేకంగా కావచ్చు... సింగూరు భూసేకరణపై నిరాహార దీక్ష కావచ్చు. ప్రతి సందర్భంలో ప్రజల పక్షమే.కార్యకర్తలకు ముందు నిలవడం... ఎన్ని సవాళ్లు ఎదురైనా మడమ తిప్పలేదు. దీన్ని కొందరు మొండితనం అంటే, ఇంకొందరు పరిణతిలేమి అన్నారు. ప్రజలు మాత్రం ఆమె వెంటే ఉన్నారు. ఏటికేడాది అభిమాన ధనం అందిస్తూనే ఉన్నారు.

కొన్ని నెలల క్రితం, ఢిల్లీ విజయ్‌ చౌక్‌లో ఓ మోటార్‌ బైక్‌ని కారు ఢీ కొట్టింది. అంతా చోద్యం చూడటమే. సాయానికి ఎవరూ ముందుకు రాలేదు. అంతలో తెల్లని కారొకటి అక్కడొచ్చి ఆగింది. అందులోంచి దిగిన వ్యక్తి గాయపడ్డ అతనికి సపర్యలందించారు. అతను తేరుకుని చూసేలోపు 'కారు నో పార్కింగ్‌ జోన్‌లో ఉంది సెలవు' అంటూ బయలుదేరారు. అలా సేవలందించిన వ్యక్తి మమతా బెనర్జీ. కట్టలు తెంచుకునే ఆవేశం కాసేపే. అభాగ్యుల కోసం పడే మథనమే అధికమని ఆమె తీరుని తెలిపే సందర్భాలు చెప్పాలంటే మరిన్ని.

చూడ్డానికి సాదాసీదాగా కనిపించే మమత తీరిక సమయాన్ని చక్కగా వినియోగిస్తుంది. శరత్‌ పుస్తకాలను... 'గీతాంజలి' భావాలను మనసుకు హత్తుకుంటుంది. ఇప్పటివరకూ ఆమె తొమ్మిది పుస్తకాలు రచించారు. వేకువ సమయంలో ప్రశాంత చిత్తంతో కవితలు రాయడమంటే ఎంతో ఇష్టం.

కేంద్ర మంత్రిగా ఆమెవి కీలక బాధ్యతలు. కిందటేడాది మహిళలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టి అందరి మన్ననలు పొందారు. అదే సమయంలో 'రైల్వే బడ్జెట్‌ను బెంగాల్‌ బాట పట్టించింది' అన్న విమర్శలను ఎదుర్కొన్నారు. ఈసారైనా అందరి మనసులు గెలిచేలా... సమన్యాయం పాటిస్తుందో లేదో చూడాలి మరి!