రాష్ట్రంలోకి మరో టెలికాం కంపెనీ
త్వరలో 'ఎంటీఎస్' సీడీఎంఏ సేవలు
అన్ని జిల్లాల్లో ఒకే సారి
ఎనిమిది పట్టణాల్లో డేటా బదిలీ సేవలు
హైదరాబాద్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ టెలికాం విపణి మరింత పోటీ మార్కెట్ కానుంది. ఇప్పటికే దేశంలోని ప్రధాన టెలికాం ఆపరేటర్లు అందరూ ఇక్కడ సేవలందిస్తుండగా.. వచ్చే రెండు మూడు నెలల్లో మరో కంపెనీ అడుగు పెట్టనుంది. ఇప్పటికే దక్షిణాదికి చెందిన మిగిలిన రాష్ట్రాల్లో 'ఎంటీఎస్' బ్రాండ్‌తో సేవలందిస్తున్న సిస్టమా శ్యామ్ టెలిసర్వీసెస్ (ఎస్‌ఎస్‌టీఎల్) ఈ ఏడాది రెండో త్రైమాసికంలో రాష్ట్రంలో సీడీఎంఏ ఆధారిత టెలికాం సేవలను ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ సెవ్‌లాడ్ రోజ్‌నవ్ తెలిపారు. 'రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకే సారి సేవలను ప్రారంభించనున్నట్లు, ఎనిమిది ప్రధాన పట్టణాల్లో హైస్పీడ్ డేటా బదిలీ సేవలను కూడా అందించనున్న'ట్లు వివరించారు. 'స్మార్ట్‌ఫోన్‌తోను, ఫోన్ లేకుండా కూడా కంపెనీ కనెక్షన్ ఇస్తుంది. సర్కిల్‌ను బట్టి టారిఫ్ ప్లాన్లు ఉంటున్నాయని, కొన్ని సర్కిళ్లలో సెకనుకు అర పైసా ప్లాన్‌ను కూడా కంపెనీ అమలు చేస్తోంద'ని ఎస్‌ఎస్‌టీఎల్ సీఓఓ (కర్ణాటక, ఆంధ్రప్రదేశ్) సురేశ్ ఎస్ కుమార్ చెప్పారు. 'గంట గంటకు టారిఫ్ పథకాలు మారుతున్న ప్రస్తుత పోటీ పరిస్థితిల్లో మూడు నెలల తర్వాత రాష్ట్రంలో ఎటువంటి వంటి టారిఫ్ పథకాలను ప్రవేశపెట్టేది ఇప్పుడే చెప్పలేమ'ని అన్నారు.
పబ్లిక్ ఇష్యూ!
దక్షిణాదితోపాటు పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర ప్రాంతాల్లో సేవలందిస్తున్న ఎస్‌ఎస్‌టీఎల్ ఈ ఏడాది చివరి నాటికి దేశ వ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో సేవలందించాలని భావిస్తోంది. 22 సర్కిళ్లలోను కంపెనీకి స్పెక్ట్రమ్ ఉంది. ఇప్పటి వరకు కంపెనీ 150 కోట్ల డాలర్ల (దాదాపు రూ.7,200 కోట్లు) పెట్టుబడులు పెట్టింది. వచ్చే నాలుగైదేళ్లలో మరో రూ.6,000 కోట్లను ఖర్చు చేయాలని యోచిస్తోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా కూడా నిధులు సమీకరించే అంశాన్ని పరిశీలిస్తోంది.