Tuesday, February 23, 2010

తడబడి.. సారీ చెప్పి.. ఎస్‌బీఐ ఛైర్మన్‌కొచ్చిన కష్టమిది

తడబడి.. సారీ చెప్పి..
ఎస్‌బీఐ ఛైర్మన్‌కొచ్చిన కష్టమిది
న్యూఢిల్లీ: పాత అలవాట్లు అంత తొందరగా వదలవన్నది సత్యం. ఇందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ ఒ.పి. భట్‌ సైతం మినహాయింపు కాదనేందుకు ఈ సంఘటనే ఓ చక్కటి నిదర్శనం. సోమవారం ఢిల్లీలో జేఆర్‌డీ టాటా కార్పొరేట్‌ లీడర్‌షిప్‌ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి చిదంబరం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవార్డు అందుకున్నాక భట్‌ 'గౌరవ ఆర్థిక మంత్రి చిదంబరం..' అంటూ ప్రసంగం ఆరంభించారు. విస్తుపోవడం సభికుల వంతైంది (చిదంబరం ఆర్థిక శాఖ నుంచి హోంశాఖకు మారి ఏడాది దాటేసింది). ఆ వెంటనే తేరుకున్న మంత్రి సహా వేదికపై ఉన్నవారంతా పగలబడి నవ్వేశారు. అంతలోనే జరిగిన పొరపాటు గ్రహించిన భట్‌ సైతం వారి నవ్వులతో శ్రుతి కలుపుతూనే 'సారీ' చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత తన పొరపాటును సరిదిద్దుకోవడమే కాదు.. కాస్తంత లౌక్యం కూడా ఉపయోగించారాయన. 'పాత అలవాట్లు అంత తొందరగా పోవు. చిదంబరం నా మాజీ బాస్‌. అంతేకాదు.. నేను పనిచేసిన బాస్‌లు అందరిలోకీ ఆయనే గొప్పవాడు. చిదంబరం పర్యవేక్షణవల్లే భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ ఆర్థిక సంక్షోభం బారిన పడకుండా నిలదొక్కుకుంది' అంటూ ముక్తాయింపు నిచ్చారు భట్‌.

స్టేట్‌ బ్యాంక్‌ బేస్‌ రేటు 8%! ఒ.పి.భట్‌ అంచనా
ముంబయి: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) తన ప్రతిపాదిత బేస్‌ రేటు 8 శాతం ఉండొచ్చనిఅంచనా వేసింది. సోమవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమం అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ 'ప్రస్తుత పరిస్థితుల్లో మా బ్యాంకు బేస్‌ రేటు 8 శాతం దరిదాపుల్లో నిర్ణయించే అవకాశముంద'ని పీటీఐకి చెప్పారు. ఏప్రిల్‌ నుంచి ప్రామాణిక కనీస రుణ రేటు(బీపీఎల్‌ఆర్‌) స్థానంలో బేస్‌ రేట్లను తీసుకురావాలని రిజర్వు బ్యాంకు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. బ్యాంకు వినియోగదారు నుంచి వసూలు చేయగల కనిష్ఠ వడ్డీ రేటును బేస్‌ రేటుగా వ్యవహరిస్తారు. బ్యాంకుల రుణ కార్యకలాపాల్లో పారదర్శకతను తీసుకురావడానికి ఆర్‌బీఐ ఈ ప్రతిపాదన తెచ్చింది. మరో పక్క స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌ విలీనం ఈ ఏడాది మార్చిలో జరిగే అవకాశముందని భట్‌ పేర్కొన్నారు.