అంతా డొల్లే
ఆర్‌బీఐ అధ్యయనం
ఆదాయ లోటుతో 23 రాష్ట్రాలు
ఈ జాబితాలోనే మన రాష్ట్రం
మాంద్యానికి వేతనసంఘం సిఫారసుల తోడు
ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సహా 23 రాష్ట్రాలు స్థూల ద్రవ్యలోటుతో (జీఎఫ్‌డీ) ఉన్నాయని భారతీయ రిజర్వ్‌బ్యాంక్ వెల్లడించింది. ఆర్థికమాంద్యం, తదనంతర పరిణామాలు రాష్ట్రాల ఆర్థిక స్థితిని ప్రభావితం చేసినట్లు బ్యాంక్ తెలిపింది. 2008-09 సవరించిన అంచనాల్లో జీడీపీలో 2.6% ఉన్న జీఎఫ్‌డీ ప్రస్తుతం 3.2% అయ్యిందని ఆర్‌బీఐ పేర్కొంది. 'రాష్ట్రాల ఆర్థికస్థితి: 2009 - 10 బడ్జెట్ల అధ్యయనం' శీర్షికన రూపొందించిన నివేదికను ముంబయిలో విడుదల చేశారు. 2008-09లో జీడీపీలో 0.2% మిగులుగా ఉన్న ఆదాయాలు, ఈసారి 0.5% లోటుకు చేరాయని వివరించింది. ఈ గణాంకాలు పరిశీలిస్తే అత్యధిక రాష్ట్రాలు ఆదాయ సమతుల్యతలో క్షీణతను ఎదుర్కోవడంతో పాటు స్థూల ద్రవ్యలోటు పెరుగుతున్నట్లు బ్యాంక్ పేర్కొంది. 2008-09 సవరించిన అంచనాల ప్రకారం పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళ, రాజస్థాన్ ద్రవ్యలోటును నమోదు చేయగా, జార్ఖండ్ మాత్రం మిగులు చూపగలిగింది. గతంలో మిగులు బాటలో ఉన్న 10 రాష్ట్రాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయలోటుకు గురవుతాయని భావిస్తున్నారు.
ఇది ఆందోళనకరం
రాష్ట్రాల స్థూల ద్రవ్యలోటు - స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3% కంటే తక్కువగా ఉండాలని 12 ఆర్థిక ప్రణాళికా సంఘం లక్ష్యంగా నిర్ణయించింది. 2007-08లో 18 రాష్ట్రాలు ఈ పరిధిలోనే ఉండగా, 2008-09లో ఆ సంఖ్య 9 కి, 2009-10లో 6 కు చేరిందని ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎఫ్‌డీ- జీఎస్‌డీపీ నిష్పత్తి 3% కంటే ఎక్కువ ఉండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఒరిస్సా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, పశ్చిమబెంగాల్, గోవా ఉన్నాయని తెలిపింది.
ఈ రాష్ట్రాలు భేష్: ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆదాయాలు తగ్గుముఖం పట్టి, ప్రభుత్వాలు అధికంగా వెచ్చించాల్సి వచ్చినా కేరళ, బీహార్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, తమిళనాడు ద్రవ్యలోటును 2009-10లోనూ 3% కంటే తక్కువగా ఉంచడంలో సఫలమయ్యాయని ఆ నివేదిక వివరించింది.
మరికొన్ని విశేషాలు
* 2004లో రాష్ట్రాల అప్పులు - వృద్ధిరేటు నిష్పత్తి 32.8% ఉండగా, 2008-09లో 26.2 శాతానికి తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఇది స్వల్పంగా పెరిగి 26.5% కానుంది. ఇది 30.8% ఉండవచ్చని ఆర్థికసంఘం సూచించింది.
* ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో జీఎస్‌డీపీ నిష్పత్తితో మార్కెట్ అప్పులు 0.5% చొప్పున పెంచుకునేందుకు 2008-09, 2009-10లో కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను అనుమతించింది. ఫలితంగా జీఎఫ్‌డీ- జీఎస్‌డీపీ నిష్పత్తి 4% అయ్యింది.
* ఆర్థికసంఘం సూచనల ప్రకారం మార్కెట్ అప్పులపై వడ్డీ చెల్లింపుల (ఐపీ-ఆర్‌ఆర్) నిష్పత్తి 15% ఉండాలి. ఇది 14.5% ఉంది.
* మాంద్యం ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కొన్ని రంగాలకు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన ఉద్దీపనలు, చేసిన అధిక వ్యయాలతో పాటు ఆరో వేతన సంఘం సిఫారసుల అమలు ప్రభావం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై పడింది.
దిద్దుబాటుకు ఇవీ సూచనలు
* ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి
* ఆర్థిక స్థిరత్వీకరణ నిధి ఏర్పరచాలి
* అప్పులను సమతూకంలో ఉంచుకునేలా లక్ష్యాలు ఏర్పరచుకోవాలి
* సంక్షేమ పథకాలపై రెవెన్యూ ఖర్చుకు లక్ష్యాలుండాలి
* బడ్జెట్ నిబంధనలు ఖచ్చితంగా పాటించడం
* ఖాతాల నిర్వహణలో పారదర్శకత
* వ్యయాలు పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షణ సక్రమంగా ఉండాలి
* ముందస్తు అంచనాలతో నగదు నిల్వలను అనవసరంగా పెంచవద్దు.