Tuesday, February 23, 2010

పిరికితనం వదిలేద్దాం !

పిరికితనం వదిలేద్దాం !

chindhamraన్యూఢిల్లీ: వ్యవహార ధోరణిలో పిరికితనం కారణంగా భారతీయ వ్యాపార సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉజ్వల వ్యాపార అవకాశాలను కోల్పోతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి పి. చిదంబరం అన్నారు. ప్రొసీజర్లపై ఉండే తెలియని భయం కారణంగా ఈ అవకాశాలను మనం కోల్పోతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం నాడిక్కడ జరిగిన ఆల్‌ ఇండియన్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి చిదంబరం మాట్లాడుతూ, విదేశాల్లో భారతీయ సంస్థ లు విస్తరిస్తున్నప్పటికీ, ఆర్థిక మాంద్యం కారణంగా రెండేళ్ళుగా భారీస్థాయి లావాదేవీలేవీ చోటు చేసుకోలేదని అన్నారు. దేశంలో ఎస్‌బీఐ మార్చి నాటికి రూ. 50లక్షల కోట్ల వ్యాపారాన్ని పూర్తి చేయనుందని, అది సరిపోదనీ అన్నారు.అనుబంధ బ్యాంకుల విలీనాన్ని సిబ్బంది వ్యతిరేకించడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎస్‌బీఐ ఛైర్మన్‌ ఒ.పి. భట్‌, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌ ఛైర్మన్‌ ఆర్‌.సి భార్గవ, సెబీ మాజీ ఛైర్మన్‌ ఎం.దామోదరన్‌ తదితరులకు ఈ సందర్భంగా అవార్డులు బహుకరించారు.

భట్‌కు...చిదంబరమే బాస్‌!
పాత అలవాట్లు అంత త్వరగా మానవు. మంత్రి చిదంబరం హోం మంత్రిగా మారి ఏడాది గడిచినా, ఎస్‌బీఐ ఛైర్మన్‌ మాత్రం ఈ సమావేశంలో ఆయనను ఆర్థిక మంత్రిగానే సంబోధించారు. దాంతో సభలో నవ్వులు విరిశాయి. పొరపాటును గ్రహించిన భట్‌ వెంటనే సవరించుకున్నారు. ఆ తరువాత కూడా ఆయన తిరిగి అదే తప్పు చేశారు. ఆర్థిక మంత్రిగా చిదంబరం సమర్థనాయకత్వంలో భారతదేశం ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోగలిగిందంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

ఎస్‌బీఐ బేస్‌రేట్‌ 8 శాతం
బ్యాంకు ప్రతిపాదిత బేస్‌రేట్‌ 8 శాతంగా ఉండవచ్చునని ఎస్‌బీఐ ఛైర్మన్‌ ఒ.పి. భట్‌ తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి బెంచ్‌మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేట్‌ (బీపీఎల్‌ఆర్‌) స్థానంలోనే బేస్‌రేట్‌ అమల్లోకి రానుంది. ఓ కస్టమర్‌ నుంచి బ్యాంకు వసూలు చేసే అతి తక్కువ వడ్డీరేటును బేస్‌రేట్‌గా పరిగణిస్తుంటారు. బ్యాంకుల కార్యకలాపాల్లో మరింత పారదర్శకత ఉండేందుకు గాను ఆర్‌బీఐ ఇటీవల బేస్‌రేట్‌ నిబంధనను ప్రవేశపెట్టింది.