వాహన రంగం
గడ్డుకాలం నుంచి తేరుకొని పరుగులు పెడుతున్న వాటిలో వాహన రంగం ఒకటి. అమ్మకాలను పెంచుకొంటూ ప్రగతి రోడ్డెక్కిన ఈ రంగానికి రానున్న బడ్జెట్‌లో భారీగానే వడ్డింపులు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. అదే జరిగితే మళ్లీ కథ మొదటికి వస్తుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
ఈ రంగంలోని ప్రధాన కంపెనీలు
మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అశోక్ లేలాండ్, హీరో హోండా, బజాజ్, టీవీఎస్
సాగర్: ఏంటి రామ్మోహన్.. కొత్త బండి కొంటానన్నావ్? బడ్జెట్ వచ్చేస్తోంది.. ధరలు పెరుగుతాయేమో.. త్వరగా తీసుకోరాదూ..
రామ్మోహన్: భారీగా పెరగొచ్చు అంటావా..?
సాగర్: పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తోంది. మాంద్యం పుణ్యమాని.. ఏడాదినుంచి ప్రభుత్వం ఇచ్చిన ఉద్దీపనలతో వాహన సంస్థల అమ్మకాలు జోరుగా సాగాయి. ఏప్రిల్ నుంచి గత జనవరి వరకు వాహనాల అమ్మకాలు 24% పెరిగి కోటి వాహనాలకు చేరువయ్యాయి. గత నెలలో రికార్డు స్థాయిలో ఆయా కంపెనీలు 11 లక్షలకు పైబడి వాహనాలను విక్రయించాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వం ఉద్దీపనలు వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే వాహనాల ధరలకు రెక్కలొస్తాయి. ఇప్పటికే కొన్ని కార్ల కంపెనీలు ధరలు పెంచాయిగా. ఇప్పుడు రాయితీలను కూడా వెనక్కి తీసుకుంటే మరో వాత తప్పదు. అలా చేయొద్దనే పరిశ్రమ పెద్దలు ఆర్థిక మంత్రికి చెప్పుకొస్తున్నారు.
రామ్మోహన్: వాహన రంగానికి ప్రభుత్వం ఏమేం రాయితీలిచ్చిందీ చెబుదూ..
సాగర్: (సెన్‌వ్యాట్) ద్విచక్ర వాహనాలపై ఎక్సైజ్ సుంకాన్ని 10 శాతం నుంచి 8 శాతానికి, చిన్న కార్లపై 12 శాతం నుంచి 8 శాతానికి, పెద్ద కార్లపై 24 శాతం నుంచి 20 శాతానికి కుదించింది. బస్సులు, వాణిజ్య వాహనాలపై ఈ సుంకాన్ని వరుసగా 12%, 14% శాతానికి తగ్గించింది.
రామ్మోహన్: గత ఏడాది బడ్జెట్ వచ్చినప్పుడు బళ్ల ధరలు పెరిగాయా?
సాగర్: ఆ బడ్జెట్‌లో ప్రభుత్వం పలు ప్రోత్సాహక చర్యలు కొనసాగించడంతో వాహనాల ధరలు పెరగలేదు. అప్పట్లో పరిశ్రమ వర్గాలు కూడా ప్రభుత్వం 4-6% మేర తగ్గించిన ఎక్సైజ్ సుంకాన్ని వెనక్కి తీసేసుకుంటుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సేవా పన్నును 2 శాతం వరకు కుదించారు. వ్యక్తిగత వాహనాలపై రూ.15,000-20000 అదనపు సుంకాన్ని ఎత్తివేయడం లేదా కొంతమేర వెనక్కి మేర తీసుకోవాలని కోరారు. ప్రణబ్ ఈ విషయంలో స్పందించి 2000 సీసీ ఇంజిన్‌కు పైబడిన వాహనాలపై ఈ సుంకాన్ని రూ.5000 మేర తగ్గించారు. చిన్న-పెద్ద కార్ల మధ్య ఉన్న ఎక్సైజ్ సుంకం అంతరాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేసినా పూర్తిగా నెరవేరనేలేదు. తక్కువ దూర నగరాల మధ్య తిరిగే పెట్రోల్ టక్కులకు ఎక్సైజ్ సుంకాన్ని 20 శాతం నుంచి 8 శాతానికి కుదించారు. సంస్థాగతంగా ఏర్పాటు చేసుకొనే ఆర్ అండ్ డీ పై పన్ను 150 శాతం పన్ను మినహాయింపును కొనసాగించారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎమ్ పథకం, వ్యవసాయ కేటాయింపులు పెరగడాలు కూడా అమ్మకాలు పెరిగేందుకు దోహదపడ్డాయి.
రామ్మోహన్: మా వూళ్లో కూడా చాలా మంది కొత్తగా కార్లు, ట్రాక్టర్లు, బళ్లు కొన్నారు ఇందుకే అన్నమాట?
సాగర్: నువ్వు అనుకున్నది ఒకింత నిజమే.. అయినా ప్రభుత్వం గత బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి లభించేలా పలు పథకాలు, వ్యవసాయ రుణ కేటాయింపులు పెంచడంతో గ్రామీణ ప్రజల ఆదాయం పెరిగింది. జాతీయ రహదారుల ప్రాధికారిక పథాకినికి కూడా ప్రణబ్ కొంత కేటాయింపులు పెంచడం, రక్షణ రంగం కేటాయింపులు పెరగడం వాహన సంస్థలకు బాగా కలిసి వచ్చింది.
రామ్మోహన్: ధరలు పెరగకుండా ఉండటానికి వాహన సంస్థలు ఏమి చేయాలంటున్నాయి?
సాగర్: ఉద్దీపనలు వెనక్కి తీసుకోవద్దని కోరుతున్నాయి. దీనికి తోడు వాహన పరికారాల తయారీ సంస్థలకు ఇస్తున్న రాయితీలను కొనసాగించాలని, సులభంగా రుణాలు లభించేలా చర్యలు తీసుకోవాలని, దేశీయంగా టైర్ల ధరలు పెరగకుండా ఉండేందుకు విదేశాలను నుంచి దిగుమతి చేసుకొనే సహజ రబ్బరుపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని, కస్టమ్స్ సుంకాన్ని కూడా 20% నుంచి 7.5 శాతానికి తగ్గించాలని టైర్ల సంస్థలు కోరుతున్నాయ్. ప్రణబ్ ఎలా స్పందిస్తారో చూడాలి.