Tuesday, February 23, 2010

లాభదాయక పీఎస్‌యూలన్నీ మార్కెట్లోకి: రాష్ట్రపతి

లాభదాయక పీఎస్‌యూలన్నీ మార్కెట్లోకి
రాష్ట్రపతి
న్యూఢిల్లీ: లాభాలార్జించే అన్ని ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)లను స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేస్తామని రాష్ట్రప్రతి ప్రతిభా పాటిల్‌ పునరుద్ఘాటించారు. సోమవారమిక్కడ ఉభయ సభలనూ ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ 'సామాన్యుడికి సైతం ప్రభుత్వ రంగ కంపెనీ వృద్ధిలో భాగం అందించడానికి లాభాలందించే ఒక్కో పీఎస్‌యూలో కనీసం 10 శాతం మేర వాటాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింద'ని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా దాదాపు 60 పీఎస్‌యూలు పెట్టుబడుల ఉపసంహరణకు రావడానికి వీలు కలుగుతోంది. 'మాంద్యం ప్రభావంతో విమానయాన రంగం దెబ్బతింది. అందులోనూ ఎయిరిండియా బాగా దెబ్బతింది. మంత్రుల బృందం మార్గదర్శకత్వంలో ఆ సంస్థ కోలుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంద'ని పాటిల్‌ వివరించారు. విద్యుదుత్పత్తి, మౌలికాభివృద్ధి దిశగా ప్రభుత్వం చాలా చర్యలు చేపడుతోందని ఆమె అన్నారు. రోజుకు 29 కి.మీ. మేర జాతీయ రహదారులను నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
రూ. 100 కోట్లు సమీకరించిన ఎస్‌కేఎస్‌ మైక్రో ఫైనాన్స్‌
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: సూక్ష్మరుణ వితరణ సంస్థల్లో అగ్రగామి అయిన ఎస్‌కేఎస్‌ మైక్రోఫైనాన్స్‌ తాజాగా నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్లు (ఎన్‌సీడీ), రుణ పత్రాల (కమర్షియల్‌ పేపర్‌) జారీ ద్వారా రూ.100 కోట్లు సమీకరించింది. ఈ మొత్తాన్ని పలు రకాల విస్తరణ కార్యకలాపాలకు వెచ్చించనున్నట్లు సంస్థ సీఎఫ్‌ఓ ఎస్‌. డిల్లీరాజ్‌ చెప్పారు. బజాజ్‌ అలియంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి రూ.50 కోట్ల మొత్తానికి నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్లు జారీ చేశారు. ఇదేవిధంగా రెలిగేర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ రెండు దఫాలుగా రుణపత్రాలు తీసుకొని మరో రూ.50 కోట్లు సమకూర్చింది. ఒక మైక్రో ఫైనాన్స్‌ కంపెనీ జారీ చేసిన ఎన్‌సీడీలను బీమా కంపెనీ తీసుకోవడం ఇదే తొలిసారి అని, సూక్ష్మరుణ సంస్థలపై పెరుగుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనమని డిల్లీరాజ్‌ పేర్కొన్నారు.