Saturday, December 3, 2011

5 రోజులు.. 1100 పాయింట్లు జూమ్

5 రోజులు.. 1100 పాయింట్లు జూమ్

బుల్ జంప్!



వచ్చే ఏడాది సెన్సెక్స్ 16 శాతం అప్!
మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదికలో అంచనా

న్యూఢిల్లీ: భారత స్టాక్ మార్కెట్లు వచ్చే ఏడాది మంచి రాబడులనే అందించగలవని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అంటోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 2012లో 16 శాతం మేర వృద్ధి చెందవచ్చని తాజా నివేదికలో అంచనా వేసింది. అయితే, తీవ్ర స్థాయిలో హెచ్చుతగ్గులు కూడా ఉంటాయని వెల్లడించింది.

2008 జనవరి 10న సెన్సెక్స్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 21,206.77 పాయింట్లతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్ 20 శాతం పైనే క్షీణించింది. ఈ ఏడాదిలోనే ఇప్పటిదాకా 18 శాతం మేర సెన్సెక్స్ దిగజారింది. మోర్గాన్ స్టాన్లీ విడుదల చేసిన నివేదిక ప్రకారం... సెన్సెక్స్ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 18,741 పాయింట్లకు చేరే అవకాశాలున్నాయి. ఇప్పుడున్న స్థాయి నుంచి 16 శాతం పైనే ఇండెక్స్ ఉండొచ్చు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న సంకేతాలు, సంస్కరణలకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన కీలక నిర్ణయాలు దేశీయంగా మార్కెట్లకు ఉత్సాహం ఇచ్చే కీలకాంశాలు. అయితే, అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక అనిశ్చితి ఇబ్బందికరమే.


రెండున్నరేళ్లలో అత్యధిక వీక్లీ లాభం ఇదే... మరో 363 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్

యూరోజోన్ సంక్షోభ పరిష్కారంపై ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆశావాదం...
ఎస్‌అండ్‌పీ ‘స్టేబుల్’ రేటింగ్‌తో బ్యాంకింగ్ జోరు... మెటల్స్, విద్యుత్ షేర్ల పరుగులు...

బుల్ కట్టలు తెంచుకుంది... వారం రోజుల క్రితం నాటి భారీ నష్టాలను వెనక్కి నెడుతూ లాభాలతో కదం తొక్కింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలు, వార్తల ప్రభావంతో సెన్సెక్స్ 5 రోజుల్లో ఏకంగా 1,110 పాయింట్లు దూసుకుపోయింది. గడిచిన రెండున్నరేళ్లలో ఒక వారంలో ఇంత భారీగా దేశీయ మార్కెట్లు లాభపడటం ఇదే తొలిసారి కావడం ర్యాలీ జోరుకు నిదర్శనం.


యూరోజోన్ రుణ సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా సంకేతాలు బలపడుతుండటం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు ఉత్తేజం నింపుతోంది. దీనికితోడు దేశీయంగా జీడీపీ వృద్ధి తగ్గుముఖం, ద్రవ్యోల్బణం దిగొస్తున్న నేపథ్యంలో రిజర్వ్‌బ్యాంక్ ఇక తన పాలసీ రేట్ల పెంపునకు విరామం ఇవ్వొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.


ఇది కూడా ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంట్‌కు దోహదం చేసింది. వెరసి మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిశాయి. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో స్వల్ప లాభాలతో కదలాడిన బీఎస్‌ఈ సెన్సెక్స్ క్రమంగా పుంజుకుంది. వచ్చే వారం బ్రస్సెల్స్‌లో జరగనున్న యురోపియన్ యూనియన్ దేశాధినేతల కీలక సదస్సులో యూరోజోన్ రుణ సంక్షోభానికి పరిష్కారం లభించగలదన్న ఆశాభావంతో యూరప్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. దీంతో మధ్యాహ్నం నుంచి సెన్సెక్స్ పరుగు లంఘించుకుంది.


ఇంట్రాడేలో ఏకంగా 404 పాయింట్లమేర దూసుకెళ్లి 16,889 గరిష్ట స్థాయిని కూడా తాకింది. చివరకు క్రితం ముగింపు 16,483తో పోలిస్తే 363 పాయింట్లు లాభపడి(2.20%) 16,847 పాయింట్ల వద్ద స్థిరపడింది. గత శుక్రవారం నాటి ముగింపు 15,695 నుంచి చూస్తే ఈ వారం అయిదు ట్రేడింగ్ సెషన్లలో 1,150 పాయింట్ల(7.3%) మేర లాభపడటం గమనార్హం. ఇదేవిధమైన జోరును కనబరిచిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా శుక్రవారం 113 పాయింట్లు ఎగసి 5,000 పాయింట్ల పైకి దూసుకెళ్లింది. 5,050 వద్ద స్థిరపడింది. ఈ వారంలో నిఫ్టీ మొత్తం మీద 340 పాయింట్ల(7.2%) లాభాన్ని మూటగట్టుకుంది.


బ్యాంకింగ్‌కు రేటింగ్ బూస్ట్

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సహా మొత్తం 10 భారతీయ బ్యాంకులకు ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ ‘స్టేబుల్’ రేటింగ్ కొనసాగిస్తున్నట్లు స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్‌అండ్‌పీ) ప్రకటించడం బ్యాంకింగ్ షేర్లకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. శుక్రవారం ర్యాలీలో బ్యాంకెక్స్ అత్యధికంగా 3.26 శాతం ఎగబాకింది.

ట్రేడింగ్ విశేషాలివీ...

బీఎస్‌ఈలోని 13 రంగాల సూచీలు కూడా లాభాలతోనే స్థిరపడ్డాయి. బ్యాంకెక్స్ తర్వాత అధికంగా ఎగబాకిన ఇండెక్స్‌లలో విద్యుత్(3.04%), మెటల్స్(2.49%) ఉన్నాయి. మిడ్‌క్యాప్ సూచీ 1.4%, స్మాల్‌క్యాప్ 1.1% చొప్పున పెరిగాయి.

సెన్సెక్స్ 30 షేర్లలో 29 లాభపడ్డాయి. హీరోమోటో కార్ప్ ఒక్కటే స్వల్పంగా నష్టపోయింది.

అధికంగా లాభపడిన స్టాక్స్‌లో టాటా పవర్(6.30%), టాటా మోటార్స్(4.57%), టాటాస్టీల్ (4.04%), స్టెరిలైట్(3.79%), ఎస్‌బీఐ(3.70%), జేపీ అసోసియేట్స్ (3.62), టీసీఎస్(3.59%), ఎన్‌టీపీసీ(3.55%), ఐసీఐసీఐ(3.31%), హిందాల్కో(3.13%) ఉన్నాయి.